Mithra Mandali Review Telugu - మిత్రమండలి రివ్యూ: ప్రియదర్శి & గ్యాంగ్ నవ్వించిందా? లేదా?... సినిమా హిట్టా? ఫట్టా?
Priyadarshi Mithra Mandali Review: ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్ జంటగా నటించిన సినిమా 'మిత్ర మండలి'. రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ఇతర ప్రధాన తారాగణం. ఈ సినిమా ఎలా ఉందంటే?
విజయేందర్ ఎస్
ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, వీటీవీ గణేష్, వెన్నెల కిశోర్, సత్య తదితరులు
Priyadarshi and Niharika NM movie Mithra Mandali review in Telugu: 'కోర్టు: స్టేట్ వర్సెస్ నోబడీ', 'సారంగపాణి జాతకం' విజయాల తర్వాత ప్రియదర్శి హీరోగా నటించిన సినిమా 'మిత్రమండలి'. ఇందులో నిహారిక ఎన్ఎమ్ హీరోయిన్. రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ఇతర ప్రధాన తారాగణం. వీటీవీ గణేష్, 'వెన్నెల' కిశోర్, సత్య కీలక పాత్రలు పోషించారు. విజయేందర్ ఎస్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా ఎలా ఉందంటే?
కథ (Mithra Mandali Story): జంగ్లీపట్నంలో తుట్టె కులం పులిబిడ్డగా నారాయణ (వీటీవీ గణేష్)కు పేరు ఉంది. కులం అండదండలు ఉండటంతో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది. అయితే... తన కుమార్తె స్వేచ్ఛ (నిహారిక ఎన్ఎమ్)ను కిడ్నాప్ చేశారని పోలీస్ స్టేషన్‌కు వెళతాడు నారాయణ.
స్వేచ్ఛ మిస్సింగ్ వెనుక చైతన్య (ప్రియదర్శి), సాత్విక్ (విష్ణు ఓయ్), అభి (రాగ్ మయూర్), రాజీవ్ (ప్రసాద్ బెహరా) ఉన్నారని తెలుస్తుంది. స్వేచ్ఛ ప్రేమను పొందడం కోసం అభి, సాత్విక్ వెంటపడతారు. అయితే చైతన్యను ప్రేమిస్తుంది స్వేచ్ఛ. అప్పుడు సాత్విక్, అభి ఏం చేశారు? నిజంగా స్వేచ్ఛను కిడ్నాప్ చేశారా? లేదంటే మరొకటి జరిగిందా? ఈ కేసును సాల్వ్ చేయడంలో పోలీస్ (వెన్నెల కిశోర్)కు ఇంపార్టెంట్ క్యారెక్టర్ (సత్య) ఎలా హెల్ప్ చేశాడు? చివరకు ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ (Mithra Mandali Telugu Review): కామెడీ సినిమాలపై, మరీ ముఖ్యంగా ప్రేక్షకులను నవ్వించడం ప్రధాన లక్ష్యంగా తీసే సినిమాలపై వినిపించే విమర్శల్లో ముఖ్యమైనది కథ లేదని! 'మిత్రమండలి' చిత్ర బృందం ముందు నుంచి కథ కోసం థియేటర్లకు రావద్దని, కేవలం కామెడీ కోసం రమ్మని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తోంది. మరి సినిమా ఎలా ఉంది? అనేది చూస్తే...
'మిత్ర మండలి'లో కథ గురించి డిస్కస్ చేయడానికి కూడా ఏమీ లేదు. సింపుల్ లైన్ తీసుకుని చేశారు. ప్రేమించిన అబ్బాయి దగ్గరకు కుల, రాజకీయ నాయకుని కుమార్తె వెళుతుంది. ఆమె ఆచూకీ తెలుసుకోవడం కోసం తండ్రి, పోలీసులు ఏం చేశారు? అనేది సినిమా. ఇటువంటి కథలకు క్యారెక్టరైజేషన్లు, కామెడీ సీన్లు చాలా కీలకం. ఒక్క సత్య క్యారెక్టరైజేషన్ తప్ప మిగతా వాళ్ళవి క్లిక్ కాలేదు. కామెడీకి బోలెడంత స్కోప్ ఉన్న చిత్రమిది. అయితే చాలా సీన్లు పేలలేదు. సత్య వచ్చిన ప్రతిసారీ ప్రేక్షకుల ముఖాల్లో నవ్వు వస్తుంది. తర్వాత తగ్గుతుంది. తర్వాత 'వెన్నెల' కిశోర్ సీన్స్ పర్వాలేదు. అయితే ఆయనకు రాసిన సన్నివేశాల్లోనూ కాస్త కూడా కొత్తదనం లేదు.
ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా మంచి ఆర్టిస్టులు. నార్మల్ సీన్ అయినా సరైన తమదైన కామెడీ టైమింగ్ & నటనతో నిలబెట్టగలరు. అయితే విజయేందర్ పూర్ రైటింగ్ వల్ల చాలా సీన్లు పేలవంగా మారాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో అందర్నీ నవ్వించిన నిహారిక ఎన్ఎమ్ సైతం బొమ్మలా నిలబడింది తప్ప కాస్త కూడా నవ్వించలేదు. పైగా ఆమె లుక్స్ కూడా బాలేదు. ఆ విషయంలో ఎందుకు కేర్ తీసుకోలేదో మరి? వీటీవీ గణేష్ తదితరులు ఓకే. ఈ తరహా జానర్ సినిమాలకు ఎటువంటి సంగీతం కావాలో ఆర్ఆర్ ధృవన్ అటువంటి మ్యూజిక్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఆర్ఆర్ బావున్నా జోక్స్ వచ్చినప్పుడు నవ్వు రాదు. కథకు తగ్గట్టు నిర్మాతలు ఖర్చు చేశారు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ వాళ్ళు ఆశించిన ప్రయోజనం రావడం కష్టం.
కామెడీ క్లిక్ అయితే 'జాతి రత్నాలు' తరహాలో అందర్నీ నవ్వించే సినిమాగా 'మిత్ర మండలి' మారేది. కానీ, ఆ కామెడీ క్లిక్ కాకపోవడం వల్ల బోర్ కొట్టిస్తుంది. కేవలం పార్టులు పార్టులుగా కొన్ని సీన్లు మాత్రమే నవ్విస్తాయి. అదీ సత్య వచ్చినప్పుడు. ప్రియదర్శి & గ్యాంగ్ కష్టపడ్డారు. కానీ కామెడీ మాత్రం వర్కవుట్ కాలేదు.