Hey Balwanth Review - 'హే బల్‌వంత్' రివ్యూ: సుహాస్ సినిమా హిట్టా? ఫట్టా? బిజినెస్ అంటూ చేసిన కామెడీ ఎలా ఉందంటే?
Hey Balwanth Review In Telugu: సుహాస్, శివానీ నాగరం జంటగా నటించిన సినిమా 'హే బల్‌వంత్'. ముందు 'హే భగవాన్' అనుకున్నా... తర్వాత టైటిల్ మార్చారు. ఈ సినిమా ఎలా ఉంది? ఆ బిజినెస్ ఏమిటి? తెలుసుకోండి.
గోపీ అచ్చర
సుహాస్, సీనియర్ నరేష్, శివానీ నాగరం, యాంకర్ స్రవంతి, సుదర్శన్ తదితరులు
Suhas Hey Balwanth Telugu Review: సుహాస్ హీరోగా నటించిన తాజా సినిమా 'హే బల్‌వంత్'. ఇందులో శివానీ నాగరం హీరోయిన్. సీనియర్ నరేష్, యాంకర్ స్రవంతి కీలక పాత్రలు పోషించారు. బి నరేందర్ రెడ్డి నిర్మించిన సినిమాను 'బన్నీ' వాస్, వంశీ నందిపాటి విడుదల చేశారు. 'అంబాజీ మ్యారేజి బ్యాండు' తర్వాత సుహాస్, శివానీ జంట మరో విజయం అందుకుందా? ప్రచార చిత్రాల్లో ఆసక్తి రేపిన బిజినెస్ ఏంటి? సినిమా ఎలా ఉంది?
కథ (Hey Balwanth Story): రావు బల్‌వంత్ (సీనియర్ నరేష్)కు ఓ బిజినెస్ ఉంది. అది ఏమిటి? అనేది కుమారుడు కృష్ణ (సుహాస్)కు చెప్పడు. తండ్రికి బిజినెస్ ఉందని తెలుసు. కానీ, ఏ బిజినెస్ అనేది తెలియదు. ఎంబీఏ చేసి తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకోవాలని, బిజినెస్ టేకప్ చేయాలని ఆశ పడతాడు. అయితే తండ్రి చేసే బిజినెస్ తెలిసి షాక్ తింటాడు.
కృష్ణ ఫ్యామిలీ బిజినెస్ తెలిసి ప్రేమించిన అమ్మాయి మిత్ర (శివానీ నాగరం) ఎలా రియాక్ట్ అయ్యింది. ప్రేమలో ఎటువంటి ఇబ్బందులు వచ్చాయి? మిత్ర తండ్రి, ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న పీవీబీ (హర్షవర్ధన్) & దుర్గారావు (అజయ్ ఘోష్) మధ్య గొడవ కృష్ణ - మిత్ర ప్రేమలో ఎటువంటి పాత్ర పోషించింది? చివరకు ఆ బిజినెస్ కృష్ణతో ఎన్ని ఫీట్లు చేయించింది? అనేది సినిమా.
విశ్లేషణ (Hey Balwanth Review Telugu): సమాజంలో కొన్ని వృత్తుల పట్ల చిన్న చూపు ఉంటుంది. ఆ వృత్తిలో మహిళలకు అవమానాలు, ఛీత్కారాలు పలువురి నుంచి ఎదురవుతాయి. ఆ మహిళల బాధను ఆవిష్కరించిన సినిమాలు ఉన్నాయ్. అయితే... ఆ నేపథ్యం తీసుకుని తండ్రీ కొడుకుల మధ్య అనుబంధాన్ని చెప్పడం 'హే బల్‌వంత్'ను కాస్త కొత్తగా మార్చింది.
బిజినెస్ బిజినెస్ అంటూ ప్రేక్షకులలో 'హే బల్‌వంత్' సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది టీమ్. ఆసక్తికి తగ్గట్టు సినిమాలో సన్నివేశాలు వినోదాన్ని పంచాయి. స్టార్ట్ టు ఇంటర్వెల్... బిజినెస్ చుట్టూ రాసిన సన్నివేశాలు గానీ, అంతకు ముందు హీరో సీన్స్ గానీ నవ్వించాయి. అందుకు ప్రధాన కారణం సుదర్శన్. సుహాస్, సుదర్శన్ కాంబినేషన్ సీన్స్ వర్కవుట్ అయ్యాయి. 'హే బల్‌వంత్'కు 'వెన్నెల' కిశోర్ ఇంపాక్ట్ ప్లేయర్. ఆయన కూడా నవ్వించారు.
బిజినెస్ నుంచి సినిమా ఎప్పుడు అయితే పక్కకు జరిగిందో? శ్రీను వైట్ల ఫార్ములా తరహాలో ఓ ఇంటిలోకి వెళ్లిందో? అప్పటి నుంచి తడబాటు మొదలైంది. అక్కడ సీన్స్ ఊహించడం కష్టం కాదు. ప్రిడిక్టబుల్ కావడంతో సెకండాఫ్ కొంచెం డౌన్ అయ్యింది. కానీ, చివరిలో సందేశం ఇచ్చారు. తండ్రీ కొడుకుల మధ్య ఎమోషనల్ ట్రాక్ / సీన్స్ లెంగ్త్ ఎక్కువైంది. కామెడీ నుంచి ఎమోషన్ వైపు కథ టర్న్ తీసుకున్న తీరు ఫోర్డ్స్‌గా కాకుండా ఆర్గానిక్‌గా ఉంటే బావుండేది. వినోదాన్ని, భావోద్వేగాన్ని సరిగా మిక్స్ చేయడంలో దర్శకుడి తడబాటు కనిపించింది. కానీ చెప్పాలనుకున్న విషయం బావుంది. లాజిక్కులు పట్టుకుంటూ వెళితే చాలా కనిపిస్తాయి. కామెడీని ఎంజాయ్ చేయలేం.
'హే బల్‌వంత్' కథకు వివేక్ సాగర్ మంచి పాటలు ఇచ్చారు. నేపథ్య సంగీతం వల్ల కొన్ని కామెడీ సీన్స్ నవ్వించాయి. సుహాస్ ప్రతి పాటకూ డ్యాన్స్ చేయాలని పడిన తాపత్రయం తెరపై కనిపించింది. ప్రొడక్షన్ డిజైన్ బావుంది. ఇది చిన్న సినిమా అన్నట్టు కాకుండా రిచ్‌గా కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మహి రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా బావుంది.
కృష్ణ పాత్రకు సుహాస్ సూటయ్యారు. నటుడిగా ఆయన కొత్తగా చేసింది ఏమీ లేదు. కానీ, ఆ పాత్రను డామినేట్ చేయకుండా అవసరమైనప్పుడు కామెడీ చేశారు. ఛాన్స్ వచ్చినప్పుడు ఎమోషనల్ సీన్స్ చేశారు. శివానీ నాగరం సహజంగా నటించారు. ఈ సినిమాలో హైలైట్ అయ్యేది సుదర్శన్. ఆయన కామెడీకి అందరూ నవ్వుతారు.
హీరో తండ్రిగా నరేష్ ఎమోషనల్ రోల్ చేశారు. ఆ పాత్రకు తగ్గట్టు నటించారు. బాబు మోహన్ (Babu Mohan Role In Hey Balwanth)ను వాడుకున్న విధానం బావుంది. ఈ కథలోని కీలక పాత్రల్లో 'వెన్నెల' కిశోర్, హర్షవర్ధన్, అజయ్ ఘోష్ నటించారు. తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. అటువంటి పాత్రలో నటించేందుకు అంగీకరించిన యాంకర్ స్రవంతిని అప్రిషియేట్ చేయాలి.
బిజినెస్ ఏమిటి? అనేది చెప్పేస్తే థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులకు కిక్ ఉండదు. అది తెలిసినా 'హే బల్‌వంత్'లో నవ్వులకు లోటు ఉండదు. కానీ, స్క్రీన్ మీద చూస్తే కిక్. సుదర్శన్ కామెడీ, ఆ బిజినెస్ చుట్టూ రాసుకున్న సీన్స్ వర్కవుట్ అయ్యాయి. సీనియర్ నరేష్ మరోసారి తన మార్క్ చూపించారు. ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. సుహాస్, శివానీ చక్కగా నటించారు. థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు కాసేపు నవ్వుకునే సినిమా.
Also Read: Tollywood Flashback: పాన్ ఇండియా హీరో ఫస్ట్ మాస్ హిట్... ప్రేమ కథ ప్లేసులో ఫ్యాక్షన్ సినిమా






















