Funky Movie Review - 'ఫంకీ' రివ్యూ: విశ్వక్ సేన్ సినిమా హిట్టా? ఫట్టా? అనుదీప్ కేవీ సినిమా ఎలా ఉందంటే?
Funky Review In Telugu: విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా అనుదీప్ కేవీ దర్శకత్వంలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన సినిమా 'ఫంకీ'. ఈ సినిమా ఎలా ఉందంటే?
అనుదీప్ కేవీ
విశ్వక్ సేన్, కయాదు లోహర్, సీనియర్ నరేష్, సంపత్ రాజ్ తదితరులు
Vishwak Sen Funky Movie Telugu Review: విశ్వక్ సేన్ కథానాయకుడిగా 'జాతి రత్నాలు' అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన సినిమా 'ఫంకీ'. కయాదు లోహర్ హీరోయిన్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ప్రచార చిత్రాలు నవ్వించాయి. మరి సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకోండి.
కథ (Funky Movie Story): నాలుగు కోట్లలో సినిమా తీస్తానని నమ్మించి, ఒప్పించి 40 కోట్లు ఖర్చు చేయిస్తాడు దర్శకుడు కోమల్ (విశ్వక్ సేన్). సినిమా పూర్తి చేయడానికి మరొక నాలుగు కోట్లు కావాలని చెప్పడంతో నిర్మాత సుదర్శన్ (సీనియర్ నరేష్)కు స్ట్రెస్ వచ్చి ఆస్పత్రిలో చేరతాడు. కోమల్ చేత కోటి రూపాయల్లో మిగతా సినిమా ఫినిష్ చేయిస్తానని నిర్మాత కుమార్తె చిత్ర (కయాదు లోహర్) రంగంలోకి దిగుతుంది.
సినిమా చేసే క్రమంలో చిత్రను ప్రేమిస్తాడు కోమల్. ఆమెకు తన ప్రేమను ఎలా వ్యక్తం చేశాడు? చిత్ర ఏం చెప్పింది? కోమల్ కుటుంబ నేపథ్యం ఏమిటి? కోమల్ సినిమాను ఆపాలని ప్రయత్నించిన జీకే (సంపత్ రాజ్) ఎవరు? అతనితో కోమల్ గొడవ ఏమిటి? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Funky Review Telugu): ప్రేక్షకులను 'జాతి రత్నాలు' నవ్వించడానికి కారణం అనుదీప్ కేవీ రచన (పంచ్ డైలాగ్స్, కామెడీ)తో పాటు నవీన్ పోలిశెట్టి & కో నటన కూడా! 'జాతి రత్నాలు'కు ముందు అటువంటి జానర్ ఫిలిమ్స్ తెలుగు ప్రేక్షకులకు కొత్త. అందుకని బాగా ఎంజాయ్ చేశారు. అనుదీప్ కేవీ మళ్ళీ మళ్ళీ అటువంటి సినిమాలు తీసేటప్పుడు కామెడీతో పాటు కథ మీద కూడా కాన్సంట్రేట్ చేయడం చాలా ముఖ్యం. ఆ మేజిక్ రిపీట్ కావాలంటే చాలా చాలా కేర్ తీసుకోవాలి.
'ఫంకీ' చూస్తే... అనుదీప్ తన స్టైల్ ఆఫ్ కామెడీపై ఎక్కువ ఆధారపడ్డారు. సినిమా విడుదల ముందు నిర్మాత నాగవంశీ చెప్పినట్టు... 'ఫంకీ'లో కథ పెద్దగా లేదు. ఓ నిర్మాత కుమార్తెతో దర్శకుడు ప్రేమలో పడటం సినిమా కాన్సెప్ట్. సినీ నేపథ్యంలో సినిమా కావడంతో ఇండస్ట్రీ మీద పంచ్ డైలాగ్స్ చాలా పడ్డాయి. కథ, స్క్రీన్ ప్లే వంటి అంశాలపై కాకుండా భోజనాల మీద కాన్సంట్రేట్ చేసే దర్శకుల నుంచి ఇండస్ట్రీలో సీక్వెల్స్ & పార్ట్ 2 ట్రెండ్, మైథాలజీ సినిమాలు - వేటినీ అనుదీప్ వదల్లేదు. ఆ పంచ్ డైలాగుల్లో కొన్ని పేలాయి. మరికొన్ని పేలలేదు. అందువల్ల 'రోలర్ కోస్టర్ రైడ్'గా మారుతుందీ సినిమా.
కామెడీతో పాటు 'ఫంకీ' పతాక సన్నివేశాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్ టచ్ చేశారు. తల్లి, చెల్లి... కుటుంబ సభ్యులపై ప్రేమను నేరుగా వ్యక్తం చేయాలని హీరో మనసులో బాధను చక్కగా ఆవిష్కరించారు. అయితే అటువంటి ఎమోషన్స్ ఫస్ట్ నుంచి మిస్ అయ్యింది. కథగా చూస్తే డిజప్పాయింట్ చేస్తుందీ సినిమా. కామెడీలో మాత్రం పార్టులు పార్టీలుగా నవ్విస్తుంది. టెక్నికల్ అంశాలలో భీమ్స్ మ్యూజిక్ మాస్ పల్స్‌కు తగ్గట్టు ఉంది. ప్రొడక్షన్ డిజైన్ బావుంది. లొకేషన్ అందంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కెమెరా వర్క్, నిర్మాణ విలువలు స్టాండర్డ్స్ మైంటైన్ చేశాయి.
విశ్వక్ సేన్ సన్నబడ్డాడు. లుక్స్ పరంగా కేర్ తీసుకున్నారు. ఆయన లాస్ట్ రెండు సినిమాలతో కంపేర్ చేస్తే... 'ఫంకీ'లో హ్యాండ్సమ్‌గా ఉన్నారు. నటనలో ఇంతకు ముందు కనిపించిన విశ్వక్ సేన్... 'ఫంకీ'లోనూ ఉన్నారు. తన స్టైల్‌లో డైలాగ్స్ చెప్పారు. ఈ తరహా కథలకు కామెడీ టైమింగ్ పరంగా వేరియేషన్ చూపిస్తే ఇంకా బావుండేది. నిర్మాత కుమార్తె చిత్ర పాత్రలో కయాదు లోహర్ కనిపించారు. కేవలం అందంగా కనిపించడమే కాదు... కోపాన్ని బాగా ప్రదర్శించారు.
'ఫంకీ'లో దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతలు 'దిల్' రాజు - నాగవంశీ అతిథి పాత్రల్లో తళుక్కున మెరిశారు. వాళ్ళ సీన్లు, ఆ పంచ్ డైలాగ్స్ నవ్విస్తాయి. అనుదీప్ కేవీతో మాటు 'మ్యాడ్' దర్శకుడు కళ్యాణ్ శంకర్ కూడా హీరో విశ్వక్ సేన్ స్నేహితులుగా కనిపించారు. సీనియర్ నరేష్, సంపత్ రాజ్ సహా మిగతా ఆర్టిస్టులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
అనుదీప్ కేవీ రచనలో ఆయన నుంచి ప్రేక్షకులు ఆశించే టిపికల్, మార్క్ పంచ్ డైలాగ్స్ - వన్ లైనర్స్ ఉన్నాయి. అయితే... అవి పార్టులు పార్టులుగా నవ్విస్తాయి. కథ, స్క్రీన్ ప్లే విషయంలో అసలు కేర్ తీసుకోలేదు. అది సినిమాపై గట్టిగా ఎఫెక్ట్ చూపించింది. విశ్వక్ సేన్, కయాదు లోహర్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే మధ్య మధ్యలో నవ్వుకోవచ్చు. అలా కాకుండా సినిమాగా చూస్తే డిజప్పాయింట్ అవుతారు.























