Couple Friendly Movie Review - 'కపుల్ ఫ్రెండ్లీ' రివ్యూ: సంతోష్ శోభన్ సినిమా హిట్టేనా? రొమాంటిక్ డ్రామా ఎలా ఉందంటే?
Couple Friendly Review In Telugu: సంతోష్ శోభన్, మానసా వారణాసి జంటగా నటించిన సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ'. తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 14న విడుదలైందీ రొమాంటిక్ సినిమా. ఎలా ఉందంటే?
అశ్విన్ చంద్రశేఖర్
సంతోష్ శోభన్, మానసా వారణాసి, యోగిబాబు, రాజీవ్ కనకాల, గోపరాజు రమణ తదితరులు
Santosh Shoban Couple Friendly Review: సంతోష్ శోభన్ హీరోగా నటించిన తాజా సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ'. మానస వారణాసి హీరోయిన్. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మించింది. అజయ్ కుమార్ రాజు .పి సహ నిర్మాత. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 14న విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే?
కథ (Couple Friendly Story): శివ (సంతోష్ శోభన్)ది నెల్లూరు. ఇంటీరియర్ డిజైనింగ్ చేశాడు. ఉద్యోగం కోసం చెన్నై చేరుకుంటాడు. మిత్ర (మానసా వారణాసి)ది చిత్తూరు. చెన్నైలో ఐటీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటుంది.
అనూహ్య పరిస్థితుల్లో జరిగిన ఇద్దరి పరిచయం ప్రేమగా మారి లివ్-ఇన్ రిలేషన్ షిప్ (సహ జీవనం) చేస్తారు. పెళ్లికి ముందు ఓ ఇంటిలో చేరతారు. మిత్ర రాకతో శివ జీవితం మారుతుంది. కానీ, మిత్రకు ఉద్యోగం రాదు. ఇద్దరి మధ్య గొడవ మొదలు అవుతుంది.
లివ్-ఇన్ మేటర్ మిత్ర ఇంట్లో తెలియడంతో అమ్మాయి తండ్రి (రాజీవ్ కనకాల) రాద్ధాంతం చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? ప్రేమకు పెద్దల అడ్డంకిని మించి మిత్ర జీవితంలో పడిన పిడుగు ఏమిటి? అది తెలిసి శివ ఏం చేశాడు? ఈ ప్రేమ కథ ఎన్ని మలుపులు తిరిగింది? చివరకు ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ (Couple Friendly Telugu Movie Review): 'కపుల్ ఫ్రెండ్లీ' ప్రచార చిత్రాలు చూస్తే ఇదొక యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా అనిపించడం సహజం. కానీ, కపుల్స్ కథలో అసలు విషయం రొమాంటిక్ కాదు... అంతకు మించి ఎమోషన్ ఉంది. అది థియేటర్లలోకి వెళ్లిన ప్రేక్షకులకు షాకింగ్ ఫ్యాక్టర్, సర్‌ప్రైజ్ ఎలిమెంట్.
'కపుల్ ఫ్రెండ్లీ'లో స్పెషాలిటీ ఏమిటంటే... పాత్రలకు తగ్గ నటీనటులు, వాళ్లకు తగ్గ రచన - దర్శకత్వం ఉండటం! దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ (Couple Friendly director Ashwin Chandrasekhar)లో విషయం ఉంది. ప్రతి సన్నివేశాన్ని ఆయన తెలివిగా రాశారు. కుటుంబ బంధాలు - అనుబంధాలకు దూరంగా ఉండాలని కోరుకునే అమ్మాయి... కుటుంబానికి దగ్గరగా ఉండాలని మనసులో ఉన్నప్పటికీ తండ్రి చేత తిట్లు తినలేక దూరంగా ఉంటున్న అబ్బాయి... ఇద్దరి నేపథ్యాలు వేరు. కానీ, హీరో తన బాధను వ్యక్తం చేస్తూ పైకి నవ్వడం చూసి ప్రేమలో పడుతుంది అమ్మాయి. సహ జీవనంలో ముద్దులు, హగ్గులు, రొమాన్స్ చుపించారు. అంతే కాదు... ఒకరికి ఒకరు తోడుగా ఉంటే ఏం సాధించవచ్చో కూడా చెప్పారు. ఫస్టాఫ్ అంతా మ్యూజికల్ జర్నీలా, ఓ పాటలా సమయం తెలియకుండా సాగుతుంది. ఇంటర్వెల్ ముందు చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఇంటర్వెల్ తర్వాత షాకింగ్ ఎలిమెంట్ రివీల్ చేశారు.
ఇంటర్వెల్ తర్వాత 'కపుల్ ఫ్రెండ్లీ' జానర్ షిఫ్ట్ తీసుకుంటుంది. అప్పటి వరకు తెరపై కనిపించిన రొమాన్స్ స్థానంలో రెస్పాన్సిబిలిటీ చేరుతుంది. ఫన్ & రొమాన్స్ బదులు బరువైన భావోద్వేగాలు గుండెను తట్టే ప్రయత్నం చేస్తాయి. ఒక్కసారిగా జరిగే ఆ జానర్ షిఫ్ట్ వల్ల కొందరు ప్రేక్షకులకు జర్క్ తగిలినట్టు అనిపించవచ్చు. కానీ కాసేపటికి తేరుకుని కథలోకి వెళతారు. సహజత్వానికి దగ్గరగా ఉండటం వల్ల ఇంటర్వెల్ వరకు తెరపై పాత్రల్లో ఈతరం యువత తమను చూసుకుంటారు. ఆ తర్వాత జీవిత భాగస్వామితో ఎలా ఉండాలో, భవిష్యత్తులో ఎలా ఉండాలో అర్థం చేసుకుంటారు. అయితే... గుండెను బరువెక్కించే ఆ సన్నివేశాలకు ఎంత మంది యువత కనెక్ట్ అవుతారు? అనేది చూడాలి. 'ఓయ్', 'గీతాంజలి' తరహా చిత్రమిది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సినిమా 'దిల్ బేచారా' ఛాయలు కూడా కనిపిస్తాయి.
'కపుల్ ఫ్రెండ్లీ'కి మెయిన్ ప్లస్ మ్యూజిక్. ఆదిత్య రవీంద్రన్ మంచి బాణీలు ఇవ్వడమే కాదు... సన్నివేశాలకు తగ్గట్టు చక్కటి నేపథ్య సంగీతం సమకూర్చారు. దినేష్ పురుషోత్తమన్ ఛాయాగ్రహణం కూడా బావుంది. చెన్నై అందాలను తెరపై బాగా చూపించారు. నిర్మాతలు ఖర్చుకు రాజీ పడలేదు. చెన్నై నేపథ్యంలో కథ రాయడం వల్ల తమిళంలో విడుదలకూ మార్గం సుగమం అయ్యింది.
బాయ్ నెక్స్ట్ డోర్ (పక్కింటి కుర్రాడు) తరహా పాత్రలో సంతోష్ శోభన్ అద్భుతంగా నటించారు. ఉద్యోగం లేని యువకుల మానసిక పరిస్థితిని మాత్రమే కాదు... ప్రేమ మొదలైన తర్వాత వచ్చే మార్పు, ప్రేయసిని ప్రాణాపాయ స్థితిలో చూసి పడే వేదనను అద్భుతంగా చూపించారు. శివ పాత్రలో సంతోష్ శోభన్ నటించలేదు... జీవించారు. మిత్ర పాత్రలో మానసా వారణాసి ఒదిగిపోయారు. తెరపై యోగిబాబు వచ్చిన ప్రతిసారీ ప్రేక్షకులు నవ్వుతారు. సెటిల్డ్ కామెడీ చేశారు. రాజీవ్ కనకాల, గోపరాజు రమణ తదితరులు పాత్రలకు తగ్గట్టు నటించారు.
'కపుల్ ఫ్రెండ్లీ' టైటిల్ వల్ల 'ఎ' సర్టిఫికెట్ వచ్చిందని తెలుగు రాష్ట్రాల్లో సినిమాను విడుదల చేసిన ధీరజ్ మొగిలినేని చెప్పారు. ఇందులో అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ చిత్రమిది. ఇదొక రొమాంటిక్ డ్రామా. అయితే ఇందులో రొమాన్స్ ఒక్కటే లేదు... రెగ్యులర్ సీన్స్ మాత్రమే లేవు... గుండెను బరువెక్కించే డ్రామా ఉంది. ఎమోషన్స్‌తో కూడిన రొమాంటిక్ సినిమాలు చూసే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. యూత్‌ను శాటిస్‌ఫై చేస్తుంది.























