Bookie Review - 'బూకి' రివ్యూ: సునీల్, లక్ష్మీ మంచు చేసిందేమిటి? విజయ్ ఆంటోనీ మేనల్లుడి సినిమా హిట్టా? ఫట్టా?
Bookie Review In Telugu: విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ దిశాన్ హీరోగా నటించిన సినిమా 'బూకి'. ధనుషా హీరోయిన్. తెలుగులో వారం ఆలస్యంగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?
గణేష్ చంద్ర
అజయ్ దిశాన్, ఆర్కే ధనుషా, సునీల్, లక్ష్మీ మంచు తదితరులు
Ajay Dhishan's Bookie Movie Review In Telugu: విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ దిశాన్ హీరోగా నటించిన సినిమా 'బూకి'. తమిళంలో ఫిబ్రవరి 13న విడుదలైంది. తెలుగులో వారం ఆలస్యంగా ఫిబ్రవరి 20న విడుదల చేశారు. ధనుషా కథానాయికగా నటించిన ఈ సినిమాలో లక్ష్మీ మంచు, సునీల్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉంది?
కథ (Bookie Story): ఆషా (ఆర్కే ధనుషా), కైలాష్ (అజయ్ దిశాన్) ప్రేమికులు. ఓ గొడవ తర్వాత మాటామాటా పెరిగి నడిరోడ్డు మీద ఒకరినొకరు లాగిపెట్టి చెంప దెబ్బలు కొట్టుకుంటారు. ఆ తర్వాత బ్రేకప్ అవుతుంది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి.
బ్రేకప్ నుంచి బయట పడటం కోసం జిమ్ జాయిన్ అవుతాడు కైలాష్. అక్కడ ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమె వల్ల ఎటువంటి సమస్య వచ్చింది? ఆ తర్వాత ఏమైంది? వరుసకు మరదలు అయ్యే అమ్మాయి కావ్య (శియారా)కు దగ్గర అవుతారు. ఓ ఆధ్యాత్మిక ఆశ్రమానికి వెళుతుంది ఆషా. అక్కడ బాబా (సునీల్) ఏం చేశారు? ఆ తర్వాత సైకాలజిస్ట్ (లక్ష్మీ మంచు) దగ్గరకు ఎందుకు వెళ్ళింది? కావ్య వల్ల కైలాష్ ఏం తెలుసుకున్నాడు? బ్రేకప్ తర్వాత ఇద్దరి జీవితాల్లో ఏం జరిగింది? మళ్ళీ ఒక్కటి అయ్యారా? లేదా? అనేది సినిమా.
విశ్లేషణ (Bookie Review Telugu): ప్రేమకు 'జెన్ జి' (Gen G) కిడ్స్ దృష్టిలో వేర్వేరు అర్థాలు ఉన్నాయ్. ఈతరం యువతలో ప్రేమ పట్ల సీరియస్‌నెస్ లేదని, సోషల్ మీడియా జమానాలో జీవితం అంటే ఏమిటో తెలుసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయ్. అటువంటి అంశాలను 'బూకి'లో క్యాప్చర్ చేసే ప్రయత్నం చేశారు.
వైరల్ వీడియోస్ వల్ల ఎదురయ్యే ఇబ్బందుల నుంచి బ్రేకప్ తర్వాత జిమ్ చేసి సిక్స్ ప్యాక్ చేయాలని చూసే అబ్బాయిలు, స్ట్రెస్ రిలీఫ్ అంటూ షాపింగ్ మీద లక్షలు ఖర్చు చేసే అమ్మాయిలను, ఆఖరికి ఆధ్యాత్మిక కేంద్రాల్లో దందాలను సెటైరికల్‌గా చూపించే ప్రయత్నం చేశారు.
దర్శక రచయితలు గణేష్ చంద్ర - పుతియ పరిథి ఆలోచనలు బావున్నాయ్. కానీ, ఆచరణ అసలు బాలేదు. క్రిస్పీగా, వినోదాత్మకంగా చెప్పాల్సిన కథను సాగదీశారు. మరీ రొటీన్, సోషల్ మీడియాలో వైరల్ వీడియోస్ పంథాలో తీశారు. వీడియోల్లో వైరలైన వ్యక్తులను ఇంటర్వ్యూ చేయాలని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఆరాటపడతాయి. ఆ విషయం చెప్పడానికి ఆల్మోస్ట్ పది నిమిషాల సీన్ చేశారు. ఆ తర్వాత బైక్ రైడింగ్, జిమ్, ఆశ్రమం సీన్స్ కూడా! కొత్తగా చెప్పడంలో ఫెయిల్ అయ్యారు. బ్రేకప్ తర్వాత మరొక పార్ట్నర్ కోసం వెతకడం, తమకు 'ఎక్స్' కరెక్ట్ అనుకుని మళ్ళీ వాళ్ళకు దగ్గర కావడం కొత్త పాయింట్ కాదు. 'జెన్ జి' నేపథ్యంలో కథను చెప్పాలని అనుకోవడం కొత్త. అప్పుడు సన్నివేశాలు సైతం అంతే కొత్తగా ఉండాలి కదా! ఆ కొత్తదనం చూపించడంలో దర్శక రచయితలు ఫెయిలయ్యారు.
'బూకి' కథ, సినిమాలో ప్రధాన సమస్య... హీరో హీరోయిన్లు ఆరేళ్ళు ప్రేమలో ఎలా ఉన్నారు? ఆ బంధం అంత బలంగా ఉండటానికి కారణాన్ని సరిగ్గా చూపలేదు. మరొకరితో కనెక్ట్ కాకపోవడానికి, అంతకు ముందు ప్రేమ నుంచి ఎందుకు బయట పడటం లేదనేది చివరి వరకు సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. అది చేసినప్పుడే కదా... కథ కనెక్ట్ అయ్యేది. ఆ అంశాన్ని రెండు మూడు సన్నివేశాలకు పరిమితం చేయడం బాలేదు. ఫాదర్ ఎమోషన్ కూడా బలవంతంగా ఇరికించినట్టు ఉంది. ప్రేమలో సీరియస్‌నెస్ లేనప్పుడు వినోదమైనా ఉండాలి. సినిమాలో రెండూ లేవు.
Also Read: Nawab Cafe Review - 'నవాబ్ కేఫ్' రివ్యూ: ఇడ్లీ కొట్టు ప్లస్ ఉస్తాద్ హోటల్… సినిమా ఎలా ఉందంటే?
టెక్నికల్ పరంగా 'బూకి' బావుందని చెప్పాలి. కథకు తగ్గ పాటలు ఇచ్చారు విజయ్ ఆంటోనీ. యూత్ వైబ్ వినిపించే ప్రయత్నం చేశారు. కానీ నేపథ్య సంగీతంలో హోరు ఎక్కువైంది. దర్శకత్వం కంటే సినిమాటోగ్రఫీలో గణేష్ చంద్ర పనితనం బావుంది. కొన్ని సన్నివేశాల్లో ఎడిటింగ్ చేయించిన తీరు బావుంది... రింగ్ గాల్లో ఎగిరినప్పుడు మధ్యలో ఫ్లాష్ బ్యాక్ రావడం! మేనల్లుడు హీరో కావడంతో విజయ్ ఆంటోనీ ఖర్చుకు వెనుకాడలేదు.
అజయ్ దిశాన్, ఆర్కే ధనుషా... హీరో హీరోయిన్లు ఇద్దరూ నటన పరంగా తమ బెస్ట్ ఇచ్చారు. జెన్ జి కిడ్ కైలాష్ పాత్రలో అజయ్ నటన యూత్ రిలేట్ చేసుకునేలా ఉంది. ఆర్కే ధనుషాకు కథానాయికగా మొదటి సినిమా అయినప్పటికీ... చాలా సహజంగా నటించారు. భావోద్వేగాలను చక్కగా పలికించారు. లక్ష్మీ మంచు, సునీల్ పాత్రల పరిధి తక్కువ. డబ్బుల కోసం ఆశపడే దొంగ బాబాగా సునీల్, సైకాలజిస్ట్ పాత్రలో లక్ష్మీ మంచు పెద్దగా చేయడానికి వాళ్లకు సరైన సన్నివేశాలు పడలేదు. ఉన్నంతలో న్యాయం చేశారు. సియారా కీలక పాత్రలో కనిపించారు.
ఈతరం యువత ప్రేమ, బ్రేకప్ వ్యవహారాలను వినోదాత్మకంగా చూపించాలని చేసిన ప్రయత్నం 'బూకి'. ఆసక్తికరమైన సన్నివేశాలు పడితే బావుండేది. కానీ, నవ్వించడంలోనూ - ఎమోషన్స్ పరంగా కనెక్ట్ చేయడంలోనూ ఫెయిల్ అయ్యిందీ సినిమా. మోడ్రన్ యూత్ సైతం రిలేట్ కావడం కష్టమే. అయితే... అజయ్ దిశాన్, ఆర్కే ధనుషాలకు హీరో హీరోయిన్లుగా పేరు తీసుకు వస్తుంది. ఇద్దరూ సహజంగా నటించారు. వైరల్ వీడియో లాంటి ఈ సినిమా వాళ్ళిద్దరి నటనకు షోరీల్ అవుతుంది.
PS: రీల్స్‌లో తెలుగు స్టార్ హీరోల వైరల్ స్పీచ్ వీడియోలు చూపించడం బావుంది. తెలుగు కనెక్టివిటీ కోసం చేసిన ప్రయత్నాలు కనిపించాయి.























