Avatar Fire And Ash Telugu Review - 'అవతార్ 3' రివ్యూ: ఇండియన్ ఫ్యామిలీ ఎమోషన్స్ & వరల్డ్ క్లాస్ విజువల్స్... జేమ్స్ కామెరూన్ ఎలా తీశారంటే?
Avatar 3 Telugu Review: జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ ఫ్రాంచైజీ 'అవతార్'లో మూడో భాగం 'ఫైర్ అండ్ యాష్' ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగులోనూ విడుదల చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది?
జేమ్స్ కామెరూన్
సామ్ వాషింగ్టన్, జోయ్ సల్దానా, స్టీఫెన్ హాంగ్, జాక్ ఛాంపియన్, ఓనా చాప్లిన్ తదితరులు
James Cameron's Avatar 3 Review In Telugu: ప్రపంచ సినీ ప్రేమికులకు అసలు పరిచయం అవసరం లేని ఫ్రాంచైజీ 'అవతార్'. అందులో మూడో భాగం 'ఫైర్ అండ్ యాష్'. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ విడుదలైంది. తెలుగులోనూ డబ్బింగ్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? జేమ్స్ కామెరూన్ ఎలా తీశారు? అనేది తెలుసుకోండి.
కథ (Avatar 3 Story): 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' గుర్తుందిగా... అందులో జేక్ సల్లీ (సామ్ వాషింగ్టన్), నేయితిరి (జో సల్దానా) కుమారుడు మరణిస్తాడు. ఆ బాధలో వాళ్ళ కుటుంబం (Sully Family Avatar) ఉంటుంది. అక్కడ నుంచి 'అవతార్: ఫైర్ అండ్ యాష్' కథ మొదలు అవుతుంది.
జేక్ & తెగ మీద పగ తీర్చుకోవాలని కల్నల్ మైల్స్ (స్టీఫెన్ లాంగ్) ప్రయత్నాలు మొదలు పెడతాడు. అతనికి మంగ్‌క్వాన్ తెగ (యాష్ పీపుల్) నుంచి మద్దతు లభిస్తుంది. నావి ప్రజలను, పండోరా గ్రహాన్ని కాపాడటం కోసం వాళ్ళతో జేక్ ఎటువంటి యుద్ధం చేశాడు? తమ కుటుంబంలో ఒక్కడిగా కలిసిపోయిన స్పైడర్ (జాక్ ఛాంపియన్)ను చంపాలని జేక్ ఎందుకు అనుకున్నాడు? యుద్ధంలో టుల్‌కుమ్స్ (భారీ సముద్రపు తిమింగలాలు) పాత్ర ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Avatar 3 Telugu Review): హాలీవుడ్ సినిమాలపై భారతీయ ప్రేక్షకుల నుంచి ప్రధానంగా వినిపించే విమర్శల్లో ఫ్యామిలీ ఎమోషన్స్ & బాండింగ్స్‌కు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వరని! విజువల్స్ మీద పెట్టిన దృష్టి భావోద్వేగాలపై ఉండదని! బట్, ఫర్ ఏ ఛేంజ్... 'అవతార్: ఫైర్ అండ్ యాష్'లో విజువల్స్ కంటే ఎమోషనల్ 'హై' (మూమెంట్స్) ఎక్కువ ఇచ్చారు జేమ్స్ కామెరూన్.
'అవతార్' ప్రపంచం ప్రేక్షకులకు తెలుసు. పండోరా గ్రహాన్ని చూశారు. వాళ్ళకు 'ఫైర్ అండ్ యాష్'లో జేమ్స్ కామెరూన్ కొత్త ప్రపంచం ఏదీ చూపించలేదు. ఓ రెండు సినిమాల్లో చూసిన పాత్రలు, అదే సముద్రం, అవే జీవులు... ప్రతిదీ మనకు తెలుసు. మరి, 'అవతార్: ఫైర్ అండ్ యాష్' ఎందుకు చూడాలి? అంటే... మనం ఎన్నిసార్లు థియేటర్లలో, ఓటీటీల్లో, టీవీల్లో చూసిన పాత్రలు, ప్రపంచం అయినా సరే మళ్ళీ తెరపై కొత్త స్టంట్ సీక్వెన్స్ వస్తుంటే 'వావ్' అంటూ చూసేలా చేసే విజువల్స్ కోసం! రాబోయే 'అవతార్'ల కోసం జేమ్స్ కామెరూన్ క్రియేట్ చేసిన కథ కోసం! ఇందులో కథ పరంగా ఎగ్జైట్ చేసే పాయింట్ లేదు. జేక్ కుమార్తె కిరి పాత్రను చూస్తే నెక్ట్స్ పార్టుల్లో కీలకం అవుతుందని అర్థం అవుతోంది.
'అవతార్: ఫైర్ అండ్ యాష్' అంటే భారీ అగ్నికీలలు, బూడిద వంటివి తెరపై కమ్మేస్తాయని భావిస్తే డిజప్పాయింట్ అవుతారు. పండోర గ్రహం మీద సైతం ఉన్నది ప్రజలే అని గుర్తు చేస్తారు జేమ్స్ కామెరూన్. 'స్పైడర్'ను జేక్ చంపాలని చూసినప్పుడు... 'అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరీ నాటకంలో' అని 'ప్రస్థానం'లో సాయికుమార్ చెప్పిన డైలాగ్ గుర్తుకు వస్తుంది. టుల్‌కుమ్స్‌తో జేక్ కుమారుడు మాట్లాడే సన్నివేశం చూస్తే... భారతీయ సినిమాల్లో, మరీ మన తెలుగు సినిమాల్లో ఫాదర్ & సన్ సీన్స్ గుర్తుకు వస్తాయి. కుమారుడిపై విలన్ ప్రేమ కూడా ఇండియన్ సినిమాలను గుర్తు చేస్తుంది. 'ఫైర్ అండ్ యాష్' చూస్తున్నంత సేపూ ఇదొక హాలీవుడ్ సినిమా కాదని, మన సినిమాల్లో ప్రతి శుక్రవారం చూసే ఫ్యామిలీ ఎమోషన్స్ & బాండింగ్స్ తెరపై వస్తున్నాయనే ఫీల్ ఇవ్వడంలో జేమ్స్ కామెరూన్ సక్సెస్ అయ్యారు. పాయకాన్ & జేక్ తనయుడి మధ్య బాండింగ్ విషయంలోనూ ఎమోషన్ వర్కవుట్ అయ్యింది. ఎట్ ద సేమ్ టైమ్... రన్ టైమ్ విషయంలో ఓపిక అవసరం.
Also Read: 'అవతార్ 2' సినిమా వెంకటేష్ 'నారప్ప'లా ఉందని ఎందుకు చెప్పారంటే?
'అవతార్: ఫైర్ అండ్ యాష్'లో కామెరూన్ కొత్త వరల్డ్ క్రియేట్ చేయలేదు. కానీ, కొత్త అంశాలు కొన్ని స్పృశించారు. పండోర గ్రహం మీద మంకీ మ్యాన్ అలియాస్ స్పైడర్ మాస్క్ సాయం లేకుండా ఊపిరి తీసుకోవడానికి కారణం మైసీలియం అని చూపించడం, క్లైమాక్స్‌లో నావి జాతిని ఈవా కాపాడే సమయంలో మెటల్ ఐటమ్స్ వంటివి సుడిలో కొట్టుకుపోవడం వంటివి రాబోయే 'అవతార్' ఫ్రాంఛైజీలకు పునాది వేయడమే. నిజమే... సినిమా నిడివి ఎక్కువ ఉంది. కొన్ని సన్నివేశాలను కొంచెం ఎక్కువ నిడివితో చూపించారు. హీరోయిజానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు... ఫ్యామిలీ బాండింగ్ / ఎమోషనల్ డ్రామా మీద తప్ప విజువల్స్ కోసం అన్నట్టు తీయలేదు. చివరి అర గంటలో వచ్చే స్టంట్ సీక్వెన్స్ ఎక్కువ అబ్బురపరుస్తాయి.
సామ్ వాషింగ్టన్, జోయ్ సల్దానా, స్టీఫెన్ హాంగ్ సహా నావి జాతి ప్రజలుగా కనిపించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే... సినిమాలో హైలైట్ అంటే స్పైడర్ రోల్ చేసిన జాక్ ఛాంపియన్. ఆయన రోల్, నటన బావున్నాయి. టెక్నికల్ పరంగా మరోసారి హై స్టాండర్డ్స్ సెట్ చేశారు జేమ్స్ కామెరూన్. నీటిలో, నేలపై, నింగి మీద... ఆయన తీసిన స్టంట్స్ విజువల్లీ నెక్స్ట్ లెవల్. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, వీఎఫ్ఎక్స్... వంక పెట్టడానికి ఏమీ లేదు. కానీ, లెంగ్త్ విషయంలో విమర్శలు తప్పవు.
'అవతార్: ఫైర్ అండ్ యాష్'... మరో ప్రపంచాన్ని, కొత్త కథను, సరికొత్త క్యారెక్టర్లను ఆశించి థియేటర్లకు వెళితే డిజప్పాయింట్ అవుతారు. మూడున్నర గంటలు వెండితెరపై పండోర గ్రహాన్ని చూడటానికి వెళితే ఎంజాయ్ చేయవచ్చు. విజువల్స్ & స్టంట్ సీక్వెన్స్ కోసం తప్పకుండా థియేటర్లలో చూడాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















