Ari Movie Review - 'అరి' రివ్యూ: అరిషడ్వర్గాలపై కథతో... ఎండింగ్‌లో శ్రీకృష్ణుడు... సినిమా ఎలా ఉందంటే?
Ari My Name Is Nobody Review In Telugu: 'పేపర్ బాయ్' తర్వాత జయశంకర్ దర్శకత్వం వహించిన సినిమా 'అరి: మై నేమ్ ఈజ్ నోబడీ'. వినోద్ వర్మ, సాయి కుమార్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందంటే?
జయశంకర్
వినోద్ వర్మ, సాయికుమార్, శుభలేఖ సుధాకర్, అనసూయ, సురభి ప్రభావతి, హర్ష చెముడు తదితరులతో పాటు అతిథి పాత్రల్లో సుమన్, ఆమని
మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సహా పలువురు రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులు చూసి ప్రశంసించిన సినిమా 'అరి: మై నేమ్ ఈజ్ నోబడీ'. డైలాగ్ కింగ్ సాయి కుమార్, 'శుభలేఖ' సుధాకర్, 'సురభి' ప్రభావతి, అనసూయ, వినోద్ వర్మ, హర్ష చెముడు ప్రధాన తారాగణం. 'పేపర్ బాయ్' తర్వాత జయశంకర్ దర్శకత్వం వహించిన చిత్రమిది. అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.
కథ (Ari Movie Story): షాదాబ్ హోటల్‌లో టీ మాస్టర్ అమూల్ కుమార్ (హర్ష చెముడు)కు సన్నీ లియోన్ అంటే మోజు. ఆమెతో ఒక్క రాత్రి గడపాలని అతని కోరిక. ఎయిర్ హోస్టెస్ ఆత్రేయి (అనసూయ)కు తన సహ ఉద్యోగి మీద అసూయ. ఎప్పటికీ తాను అందంగా ఉండాలని కోరుకుంటుంది. కుటుంబీకుల ఆస్తి తన సొంతం కావాలనే దురాశతో గుంజన్ (శుభలేఖ సుధాకర్), నిధి అన్వేషణలో ఆగ్రహ జ్వాలతో రగిలే సీఐ చైతన్య (శ్రీకాంత్ అయ్యంగార్), మరణించిన భర్తను మళ్ళీ బ్రతికించాలనే మోహంతో లక్ష్మి (సురభి ప్రభావతి), తన వారసులు ఎప్పటికీ ఐశ్వర్యంతో ఉండాలనే అహంకారంతో విప్రనారాయణ పాశ్వాన్ (సాయి కుమార్)... ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో కోరిక ఉంటుంది.
'ఇక్కడ మీ కోరికలు తీర్చబడును' అని సోషల్ మీడియా (ఇన్‌స్టాగ్రామ్), పేపర్స్, ఫోర్బ్స్ వంటి మ్యాగజైన్‌లలో వచ్చిన యాడ్ ఆరుగుర్నీ ఆకర్షిస్తుంది. కామ క్రోధ మధ మోహన లోభ మాత్సర్యాలతో తమ తమ కోరికలను తీర్చుకోవాలని ఆ యాడ్ ఇచ్చిన వ్యక్తి (వినోద్ వర్మ) దగ్గరకు వస్తారు. ఎప్పుడూ లైబ్రరీలో ఉండే ఆ వ్యక్తి కోరికలు తీరాలంటే తాను చెప్పినది చేయాలని కండిషన్ పెడతాడు. అతను పెట్టిన కండిషన్స్ ఏమిటి? వాళ్ళు ఏం చేశారు? చివరకు ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ (Ari Review Telugu): కామ క్రోధ మధ మోహన లోభ మాత్సర్యాలు అంటూ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. అయితే మనుషుల్లో అవి ఎలా ఉంటాయో విపులంగా ఉదాహారణలతో చూపించిన సినిమా 'అరి'. దర్శకుడు జయశంకర్ తీసుకున్న కాన్సెప్ట్ బావుంది. తాము అనుకున్నది నెరవేరడం కోసం మనుషులు ఎంత దూరం వెళతారు? ఎంతకు తెగిస్తారు? అనేది చూపించిన తీరు సైతం బావుంది. ఆరుగురు మనుషులు, ఆరు కథలు... సినిమాను ప్రారంభించిన విధానం, ఒక్కొక్కరి పరిచయం, సన్నివేశాలు ఆసక్తిగా అనిపించాయి. అయితే ఈ కథను క్లుప్తంగా చెప్పడంలో దర్శకుడు తడబడ్డారు. కానీ చివరకు మంచి సందేశం ఇచ్చారు. ఈ యూనివర్సల్ కాన్సెప్ట్ కారణంగా, ఈ సినిమా అన్ని భాషల్లో రీమేక్ చేయడానికి అవకాశం ఉంది.
జయశంకర్ తీసుకున్న అరిషడ్వార్గాలు పాయింట్, దానిని ముగించిన విధానం బావుంది. అయితే ఎగ్జిక్యూషన్ పరంగా తడబడ్డారు. కథను డైరెక్టుగా చెప్పడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. శ్రీనివాస రెడ్డి, 'చమ్మక్' చంద్ర పాత్రలతో చెప్పడం వల్ల నిడివి పెరిగింది. ఆ పాత్రలతో చేసిన కామెడీ కూడా బాలేదు. దాంతో స్క్రీన్ ప్లే, సినిమా ఫ్లో మీద దెబ్బ పడింది. నిర్మాణ పరంగా దర్శకుడికి సరైన సహకారం లభించలేదు. అందువల్ల, తక్కువలో సినిమా తీసినట్టు అనిపిస్తుంది. టెక్నికల్ పరంగానూ 'వావ్' ఫ్యాక్టర్ ఏమీ కనిపించలేదు.
నటనతో మాత్రమే కాదు... డైలాగ్ డెలివరీతోనూ విప్రనారాయణ పాశ్వాన్ పాత్రకు సాయి కుమార్ ప్రాణం పోశారు. లుక్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. పెట్టుడు గడ్డం క్యారెక్టర్ కంటిన్యుటీని దెబ్బ తీసింది. అనసూయ పాత్ర పరిధి తక్కువ. తన స్క్రీన్ టైం వరకు ఆ పాత్రకు తగ్గట్లు నటించారు. 'అరి: మై నేమ్ ఈజ్ నోబడీ' సినిమాలో సీజనల్ ఆర్టిస్టులు కంటే ఎక్కువగా వినోద్ వర్మ సర్‌ప్రైజ్ చేశారు. కామ్ & కంపోజ్డ్‌గా కనిపించారు. సినిమా ఎండింగ్ తర్వాత ఆయన ఎందుకు అలా నటించారో ప్రేక్షకులకు అర్థం అవుతుంది.
శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar)కు క్యారెక్టర్ పరంగా వేరియేషన్ చూపించే అవకాశం లభించింది. ఆయన బాగా చేశారు. ఆయన కుమారుడిగా చేసిన వ్యక్తి కూడా ఓకే. హర్ష చెముడు కామెడీ టైమింగ్ గురించి అందరికీ తెలుసు. అయితే చివరకు వచ్చేసరికి ఎమోషనల్ టర్న్ అయ్యే సీన్స్ బాగా చేశారు. తనను స్టార్ హీరోల సినిమాల్లో టైప్ కాస్ట్ చేస్తున్నారనో లేదంటే వేరియేషన్ చూపించాలనో డైలాగ్ డెలివరీ - నటన పరంగా 'శుభలేఖ' సుధాకర్ కొత్తగా ట్రై చేశారు. సురభి ప్రభావతి పాత్రకు తగ్గట్టుగా చేశారు.
తెలుగు తెరపై ఇప్పటి వరకు రానటువంటి అరిషడ్వార్గాలు కాన్సెప్ట్ తీసుకుని దర్శకుడు జయశంకర్ చేసిన ప్రయత్నం 'అరి: మై నేమ్ ఈజ్ నోబడీ'. కాన్సెప్ట్ బావుంది. ప్రేక్షకులకు తెలిసిన ఆర్టిస్టులు ఉన్నారు. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ బావున్నాయి. అయితే మధ్యలో దర్శకుడు కొంత తడబడ్డారు. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే కమర్షియల్ సినిమాలు కాకుండా డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే ప్రేక్షకులను శాటిస్‌ఫై చేస్తుంది. ఎండింగ్‌లో శ్రీకృష్ణుడు వచ్చారు... ఆ రోల్ ఎవరు చేశారు? కథలో ఆయన పాత్ర ఏమిటి? అనేది స్క్రీన్ మీద చూడాలి.
Also Read: 'కాంతార చాప్టర్ 1' రివ్యూ: రిషబ్ శెట్టి మళ్ళీ సక్సెస్ కొడతారా? 'కాంతార' ప్రీక్వెల్ హిట్టా? ఫట్టా?





















