వెబ్ సీరిస్: ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్
రేటింగ్: 4.5/5
నటీనటులు: పార్క్ జి-హు, యూన్ చాన్-యంగ్, చో యి-హ్యూన్, పార్క్ సోలమన్, యూ ఇన్-సూ, లీ యు-మి, లిమ్ జే-హ్యోక్, హా సీయుంగ్-రి, లీ యున్-సేమ్ తదితరులు.
క్రియేటర్: చున్ సంగ్-ఇల్
దర్శకులు: లీ JQ, కిమ్ నామ్-సు
ఓటీటీ ప్లాట్‌ఫాం: Netflix
మొత్తం ఎపిసోడ్స్: 12
రేటింగ్: 18+
విడుదల తేదీ: 28-01-2022


హాలీవుడ్‌లో ‘జాంబీ’ల నేపథ్యంతో ఎన్నో చిత్రాలు వచ్చాయి. వాటిలో చాలా చిత్రాలు మంచి వసూళ్లు సాధించాయి. ఇపుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లో కూడా జాంబీల నేపథ్యంతో ‘వెబ్ సీరిస్’లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇన్నాళ్లు హాలీవుడ్ మాత్రమే ఇలాంటి చిత్రాలను తీయగలదని భావించాం. కానీ, ఈ కొరియా వెబ్‌సీరిస్ చూసిన తర్వాత ఆ అభిప్రాయం మారిపోతుంది. ఇది కేవలం జాంబీ చిత్రమే కాదు, అంతకు మించి. ఊహించనట్లే.. జాంబీలు మనుషులపై దాడి చేస్తాయి. అందరినీ జాంబీలుగా మార్చేస్తాయి. కేవలం సూపర్ హీరోలు మాత్రమే వాటిని ఎదుర్కోగలరు. కానీ, ‘ఆల్ అఫ్ అజ్ ఆర్ డెడ్’లో ఎవరూ హీరోలు కాదు. గన్‌తో, కత్తులతో జాంబీలతో విరుచుకుపడేంత పోరాడేంత ధైర్యవంతులు కూడా కాదు. అంతా స్కూల్ పిల్లలు. అందుబాటులో ఉన్న వస్తువులనే ఆయుధాలుగా మార్చుకుని.. తమ ప్రాణాలను కాపాడుకోవాలి. లేదా.. రాజీ పడి ప్రాణాలు అర్పించాలి. మరి Netflixలో ప్రసారమవుతున్న ఈ All of Us Are Dead వ్యూవర్స్‌ను మెప్పిస్తుందా? 12 ఎపిసోడ్‌ల ఈ వెబ్ సీరిస్ ఎలా ఉంది?


కథ: ఎపిసోడ్ ప్రారంభంతోనే ఆకతాయి విద్యార్థుల గ్యాంగ్ ఒక అమాయక క్లాస్‌మేట్‌ను కొడుతూ కనిపిస్తారు. అయితే, అకస్మాత్తుగా ఆ విద్యార్థి జాంబీలా మారిపోతాడు. తనపై దాడి చేసినవారిని తిరిగి కొడతాడు. ఈ క్రమంలో బిల్డింగ్ మీద నుంచి పడిపోతాడు. అతడు మరెవ్వరో కాదు.. ఆ స్కూల్లోనే టీచర్‌గా పనిచేస్తున్న ఓ తెలివైన శాస్త్రవేత్త లీ బైంగ్ చాన్ (కిమ్) కొడుకు. తన కొడుకు తనని హించేసేవారితో పోరాడాలని అతడు కోరుకుంటాడు. ఇందుకు ఓ వైరస్‌ను సృష్టిస్తాడు. కానీ, భవనం మీద నుంచి పడిన తర్వాత అతడి పరిస్థితి చూసి సూట్‌కేస్‌లో బంధించి ఇంటికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత తన భార్య, కొడుకు మీద ఆ వైరస్‌కు సంబంధించి రకరకాల పరీక్షలు చేస్తాడు. ఓ రోజు స్టూడెంట్ అనుకోకుండా అతడి లీ బైంగ్ చాన్ ల్యాబ్‌కు వెళ్తుంది. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోతుంది. ఇంతకీ ఆమె ఏమైంది? ఆ తర్వాత ఏం జరుగుతుంది. అది ఎలాంటి పరిణమాలకు దారితీస్తుందనేది.. మీ ఇంట్లో బుల్లితెరపైనే చూడాలి.


విశ్లేషణ: ఇందులో ప్రతి పాత్ర ముఖ్యమైనదే. నామ్ ఒంజో (పార్క్ జీ హూ), లీ చియోంగ్సన్ (చాన్ యంగ్ యూన్), లీ సుహ్యోక్ (పార్క్ సోలమన్), నామ్ రా (చో యి హ్యూన్), లీ నా యోన్ (లీ యు మి), యో గ్వి నామ్ (యూ ఇన్ సూ) పాత్రల క్యారెక్టర్లు చాలా భిన్నంగా ఉంటాయి. మొదటి ఎపిసోడ్ నుంచి వీరి క్యారెక్టర్స్ అర్థం చేసుకుంటేనే.. మిగతా ఎపిసోడ్స్‌లో వారి ఎమోషన్స్‌కు కనెక్ట్ కాగలరు. ఏ ఆయుధాలు లేని విద్యార్థులు జాంబీలను ఎలా ఎదుర్కొంటారు? పరిస్థితులకు తగినట్లుగా జాంబీలకు చిక్కకుండా ఎలా తప్పించుకుంటారు అనేది చాలా ఆసక్తికరంగా చిత్రీకరించారు. ముఖ్యంగా తమకు ఎంతో ఇష్టమైన స్నేహితులను కళ్ల ముందే కోల్పోతున్నప్పుడు వారిలోని భావోద్వేగాలను చాలా చక్కగా చిత్రీకరించారు. అయితే, కథ మొత్తాన్ని కేవలం స్కూల్ చుట్టేనే తిప్పకుండా.. స్కూల్‌లో చిక్కుకున్న ఓ రాజకీయ నాయకురాలు, ఓ సైనికాధికారి, డిటెక్టివ్, కొడుకు కోసం పరితపించే ఓ తల్లి, కూతురి కోసం ప్రాణాలకు తెగించి మరీ జాంబీలతో పోరాడేందుకు వచ్చే తండ్రి పాత్రలను కూడా బాగా చూపించారు. 


కథ సాఫీగా సాగుతున్న సమయంలో ఊహించని ట్విస్ట్‌తో మరో ఝలక్ ఇస్తారు. ఇప్పటివరకు ఏ జాంబీ చిత్రంలో కనిపించని ట్విస్ట్ అది. యో గ్వి నామ్ పాత్ర పోషించిన యూ ఇన్ సూ‌కు తప్పకుండా ఇందులో మంచి మార్కులు పడతాయి. కథ ఆరంభం నుంచి వరకు అతడి చుట్టూనే సన్నివేశాలు తిరుగుతాయి. అతడు ఒంటికన్ను రాక్షసుడిని తలపిస్తాడు. గర్భంతో ఉన్న విద్యార్థిని స్కూల్ టాయిలెట్లో బిడ్డను ప్రసవించడం, ఆ తర్వాత జాంబీల నుంచి ఆ పసిబిడ్డను కాపాడేందుకు చేసే ప్రయత్నాలు కట్టిపడేస్తాయి. తన కోసం స్కూల్‌కు వచ్చిన తల్లి జాంబీగా మారి.. చంపేందుకు ప్రయత్నిస్తుంటే ఓ కొడుకు పడే బాధ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 12 ఎపిసోడ్స్‌లో చాలానే ఉన్నాయి. 


ఒక్కో ఎసిసోడ్ గంటసేపు ఉంటుంది. కానీ, మీకు అస్సలు బోరు కొట్టదు. ప్రతీ సన్నివేశం సీట్ ఎడ్జ్‌లో నిలబెడుతుంది. మీరు ఊహించని ట్విస్టులు ఇందులో చాలానే ఉంటాయి. ఈ సీరిస్‌లో నటించిన టీనేజర్లు.. పాత్రల్లో జీవించారు. సీరిస్ పూర్తయిన తర్వాత.. ఆ పాత్రలు మీ కళ్లలోనే కదలాడుతుంటాయి. ఇందులో హింస ఎక్కువగానే ఉన్నా.. ఎమోషన్స్, తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ వల్ల మీకు తెలియకుండానే ఒక ఎపిసోడ్ తర్వాత మరో ఎపిసోడ్‌ను చూసేస్తారు. ‘స్క్విడ్ గేమ్’, ‘హెల్ బాండ్’ తరహాలోనే ఈ వెబ్ సీరిస్ కూడా మీకు గుర్తుండిపోతుంది. అంతేకాదు.. మరో సీజన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేలా చేస్తుంది. ఇక సాంకేతికత విషయానికి వస్తే.. VFX నుంచి పిక్చర్ క్వాలిటీ వరకు ఎక్కడా రాజీ పడలేదు. ప్రతి ఫ్రేమ్ హాలీవుడ్ సినిమాలను మించి ఉంటుంది. భారీతనం ఉట్టిపడుతుంది. అందుకే ఇది ప్రపంచవ్యాప్తంగా టాప్-1లో ట్రెండవ్వుతోంది.