Mandaadi Review - 'మందాడి' రివ్యూ: సుహాస్ తమిళ్ డెబ్యూ & విలనిజం బావుందా? సినిమా హిట్టేనా?
Mandaadi Review In Telugu: తమిళ చిత్రసీమకు సుహాస్ పరిచయమైన సినిమా 'మందాడి'. ఆయనది విలన్ రోల్. సూరి హీరోగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?
మాదిమారన్
సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్ తదితరులు
Suhas Movie Mandaadi Telugu Review: తమిళ చిత్రసీమకు సుహాస్ పరిచయమైన సినిమా 'మందాడి'. తెలుగులో హీరోగా సినిమాలు చేస్తున్న ఆయన... 'హిట్ 2', సోనీ లివ్ వెబ్ సిరీస్ 'ఫ్యామిలీ డ్రామా'లో నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్లు చేశారు. ఇప్పుడు తమిళ్ డెబ్యూలో విలన్ రోల్ చేశారు. ఇందులో సూరి హీరో. మాదిమారన్ దర్శకుడు. సముద్రంలో పడవ పందేలు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? సుహాస్ విలనిజం బావుందా? అనేది రివ్యూలో తెలుసుకోండి.
కథ (Mandaadi Movie Story): ముత్తు కాళీ (సూరి), సాట్టా పులి (సుహాస్) మంచి స్నేహితులు. వాళ్ళిద్దరిదీ సముద్ర తీర ప్రాంతంలోని కళింగపట్నం. ఆ ఊరిలో పడవ పందేలు ఎప్పుడు జరిగినా ముని (సత్యరాజ్) దగ్గర శిక్షణ తీసుకున్న కాళీ, పులిలదే విజయం. అటువంటి స్నేహితులు బద్ధ శత్రువులుగా ఎందుకు మారారు? ఊరు వదిలి ఉద్యోగం కోసం సిటీకి వచ్చిన ముత్తు కాళీ, మళ్ళీ ఊరిలో ఎందుకు అడుగు పెట్టాడు? అతడు ఊరు వచ్చాక ఏం జరిగింది?
ఊరు విడిచి వెళ్ళక ముందు ఏంజిల్ చిలకమ్మ (మహిమా నంబియార్)తో ముత్తు కాళీ ప్రేమ కథ ఏమిటి? వాళ్ళిద్దరూ ఎందుకు దూరమయ్యారు? సాట్టా పులితో చేసిన ఛాలెంజ్‌లో కొత్త కుర్రాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి పడవ పందేల్లో ముత్తు కాళీ విజయం సాధించాడా? లేదా? సాట్టా పులితో శత్రుత్వం ముగిసిందా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Mandaadi Review Telugu): తెలుగు ప్రేక్షకులకు స్పోర్ట్స్ డ్రామాలు కొత్త కాదు. అయితే... ఇప్పటి వరకు పడవ పందేల నేపథ్యంలో కథను వెండితెరపై చూడలేదు. శత్రువులుగా మారిన స్నేహితుల కథ కూడా తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. 'సలార్'లో చూశారు. దానికి ముందూ కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే... సహజత్వానికి దగ్గరగా, సగటు ప్రేక్షకులు తమను తాము చూసుకునేలా తీసిన సినిమా 'మందాడి' అని చెప్పాలి.
ఇప్పటి వరకు తెరపై చూడాని కొత్త నేపథ్యం (పడవ పందేలు)లో 'మందాడి'ని తీయడంతో సినిమా ప్రారంభం ఆసక్తి రేకెత్తిస్తుంది. కథను కేవలం పడవ పందేలకు పరిమితం చేయకుండా స్నేహితుల మధ్య శత్రుత్వం, అహం వంటి అంశాలతో ముడిపెట్టిన తీరు బావుంది. దాంతో ఇంటర్వెల్ వరకు పరుగులు పెడుతుంది. ఏ దశలోనూ చూపు పక్కకు తిప్పుకోనివ్వకుండా ఉత్కంఠ రేకెత్తిస్తూ కథను ముందుకు నడిపారు దర్శకుడు మదిమారన్.
ముత్తు కాళీ ఎందుకు ఊరు వచ్చాడు? సాట్టా పులికి, అతనికి మధ్య ఏం జరిగింది? అనేది ఆసక్తి కలిగిస్తుంది. దానికి తోడు పడవ పందేల సన్నివేశాలను సైతం చక్కగా తెరకెక్కించారు. ఇంటర్వెల్ తర్వాత కథ కాస్త చల్లబడింది. స్నేహితులు శత్రువులుగా మారడం వెనుక చూపించిన ఫ్లాష్ బ్యాక్ గానీ, సెకండాఫ్ గానీ ఆసక్తిగా ముందుకు సాగలేదు. ఆటలోనూ, ప్రధాన పాత్రధారుల జీవితాల్లోనూ ఆసక్తి సన్నగిల్లింది. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ప్రేక్షకుల ఊహకు అందుతూ ముందుకు సాగింది కథనం. అయితే... ప్రధాన పాత్రధారుల నటనతో పాటు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, ఛాయాగ్రహణం వంటివి సహజంగా ఉండటంతో పెద్దగా కంప్లైంట్స్ ఉండవు. బోట్ రేసింగ్ యాక్షన్ సీక్వెన్సులు సినిమాకు హైలైట్ అని చెప్పాలి. చివర్లో కొన్ని చోట్ల వీఎఫ్ఎక్స్ మినహా ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి.
తమిళంలో కమెడియన్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు సూరి. తర్వాత హీరోగా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. వెట్రిమారన్ 'విడుదలై'లో హీరోగా సీరియస్ రోల్ చేశారు. మరోసారి ఆయన సీరియస్ క్యారెక్టర్ చేశారు. హీరోగా సినిమాను తన భుజాలపై మోయగల సత్తా ఉందని 'మందాడి'తో మరోసారి నిరూపించారు. ముత్తు కాళీ పాత్రలో సూరి నటన చూస్తే... మత్యకారుడు అంటే నమ్మేస్తారు. సూరికి ధీటుగా సుహాస్ నటించారు. ఆయన విలనిజం బావుంది. డైలాగులు చెప్పడమే కాదు... కళ్ళతో విలనిజం చూపించారు. మహిమా నంబియార్ నటన చక్కగా ఉంది. తన వయసుకు తగ్గ పాత్రలో హుందాగా కనిపించారు సత్యరాజ్. రవీంద్ర విజయ్ ఓ పాత్రలో కనిపించారు. మిగతా ఆర్టిస్టుల్లో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు తక్కువ.
పడవ పందేలు (తెరచాప పడవ పోటీల) నేపథ్యంలో ఇద్దరు స్నేహితుల మధ్య అహం (ఈగో) వల్ల జీవితాలు ఎలా మారాయి? అనే కథతో, నేటివిటీతో తెరకెక్కిన సినిమా 'మందాడి'. కొత్త నేపథ్యం, బోట్ రేసింగ్ సీన్స్ ఇంటర్వెల్ వరకు ఆసక్తిగా కథను ముందుకు తీసుకు వెళ్ళాయి. సెకండాఫ్‌లో రొటీన్ స్క్రీన్ ప్లే, సీన్స్ ఉన్నప్పటికీ... సూరి, సుహాస్ నటన చాలా వరకు సేవ్ చేసింది. రూరల్ అండ్ రస్టిక్ సినిమా చూడాలని కోరుకునే ప్రేక్షకులు అంచనాలు లేకుండా వెళ్ళడం మంచిది.
Also Read: Sahaa Movie Review - సహ రివ్యూ: హీరోయిన్ అమీర్‌పేట్‌లో గుండు గీసుకోవాలా? లేదంటే సినిమా బావుందా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















