Rao Bahadur Review - రావు బహదూర్ రివ్యూ: కమల్ హాసన్ రేంజ్‌లో సత్యదేవ్ చేశాడా? వెంకటేష్ మహా సినిమా ఎలా ఉందంటే?
Rao Bahadur Review Telugu: 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' హీరో సత్యదేవ్, దర్శకుడు వెంకటేష్ మహా కలయికలోని తాజా సినిమా 'రావు బహదూర్'. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.
వెంకటేష్ మహా
సత్యదేవ్, దీపా థామస్, వికాస్, బాల పరాశర్, వెంకటేష్ మహా తదితరులు
Satyadev's Rao Bahadur Movie Review In Telugu: 'రావు బహదూర్' ప్రెస్‌మీట్‌లో సత్యదేవ్‌ను కమల్ హాసన్‌తో పోల్చారు దర్శకుడు వెంకటేష్ మహా. మహేష్ బాబు, సుకుమార్ సైతం సినిమా చూసి హీరో, దర్శకుడిపై ప్రశంసలు జల్లు కురిపించారు. అందువల్ల, ప్రేక్షకులలో సినిమాపై సహజంగా అంచనాలు ఏర్పడ్డాయి. 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' తర్వాత సత్యదేవ్, వెంకటేష్ మహా కలిసి చేసిన ఈ సినిమా ఎలా ఉంది? ఇందులో ఏముంది? అనేది రివ్యూలో తెలుసుకోండి.
కథ (Rao Bahadur Story Explained In Telugu): స్వాతంత్య్రం వచ్చి పదిహేనేళ్ళు. భువన సంస్థాన వారసుడు రామప్ప రావు బహదూర్ (సత్యదేవ్) పెళ్ళి పిల్లలు ఆస్తి వద్దని ప్రపంచ యాత్రకు వెళతాడు. స్నేహితుడు నారాయణాచారి (వికాస్) అతని ఆచూకీ కనుక్కుని మరీ దేశానికి తీసుకొస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత తండ్రికి బాలేదని తెలుస్తుంది. ఆయన్ను చూసుకోవడానికి వచ్చిన నర్స్ రేణుక (దీపా థామస్)ను ఇష్టపడతాడు రామప్ప. అయితే... తొలుత అతడి ప్రతిపాదనను తిరస్కరిస్తుంది. తర్వాత పెళ్లి చేసుకుంటుంది.
రామప్ప, రేణుక దంపతులకు ఇద్దరు కుమారులు. అందులో ఒకరు మరణిస్తారు. అప్పటి నుంచి రామప్ప మానసికంగా కుంగిపోతాడు. వింత వింతగా ప్రవర్తిస్తాడు. మద్యానికి బానిస అవుతాడు. రేణుక తన గది దాటి బయటకు రాదు. ఓవైపు మానసిక సమస్యలు... మరోవైపు తాగుడు వల్ల వచ్చిన ఆరోగ్య సమస్యలు... వయసు మీరిన రామప్ప ఎక్కువ రోజులు బతకడని, మరణిస్తాడని డాక్టర్లు చెబుతారు. ఆ మాటలను తల్లకిందులు చేస్తూ రామప్ప బతుకుతాడు. ఒక్క నిజం తెలుసుకోవాలని పరితపిస్తాడు. అదేమిటి? రామప్ప సమస్య ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Rao Bahadur Review Telugu): అనుమానం పెనుభూతం... ఒక్కసారి అది మనిషి మనసులో మొదలైతే మెదడును తొలిచేస్తుంది. చెక్కను చెదపురుగు ఎలా తినేస్తుందో, వీక్ అయ్యేలా చేస్తుందో... అలా అనుమానం మనిషికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. కుంగిపోయేలా చేస్తుంది. సినిమాలోని ఓ సన్నివేశంలో 'రావు బహదూర్' అంటే ధైర్య సాహసాలు గల యువరాజు అని చెప్పారు. అయితే... ఇది రాజులు, సంస్థానాలకు చెందిన కథ కాదు. ప్రపంచం తిరిగిన, అన్నీ తెలిసిన మనిషిని అయినా సరే... అనుమానం ఎంతటి పిచ్చివాడిని చేస్తుంది? అని చెప్పిన సినిమా 'రావు బహదూర్'.
ఇప్పటి వరకు తెలుగు తెరపై రాని కథతో దర్శక రచయిత వెంకటేష్ మహా చేసిన ప్రయోగం 'రావు బహదూర్'. కమర్షియల్ సినిమాలకు దూరంగా, కొత్త తరహా స్క్రీన్ ప్లేకు దగ్గరగా తెరకెక్కించారు. సినిమాలోని మొదటి సన్నివేశంలో సత్యదేవ్ తలలో ఓ పురుగు దూరుతుంది. అది అనుమానం అన్నమాట. అనుమానం తీరిన తర్వాత అది బయటకు వస్తుంది. ఇటువంటి మెటాఫర్లు సినిమాలో చాలా ఉన్నాయి. దానికి తోడు సినిమా ప్రారంభంలో ఏం జరుగుతుందో? రామప్ప (సత్యదేవ్) ప్రవర్తన అలా ఎందుకు ఉందో చాలా సేపటికి గానీ అర్థం కాదు. కథ, కథనం కంటే రామప్ప క్యారెక్టరైజేషన్ - సత్యదేవ్ నటనపై వెంకటేష్ మహా ఎక్కువ నమ్మకం పెట్టుకున్నట్టు అనిపించింది.
రామప్ప అనుమానం ఏమిటి? అతని మానసిక సమస్య ఏమిటి? అనేది ఇంటర్వెల్ వచ్చేవరకు క్లారిటీ రాదు. అప్పటి వరకు తెరపై చూపించిన సైకలాజికల్ డ్రామా సగటు ప్రేక్షకులకు అర్థమయ్యేలా లేదు. దాంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. క్లైమాక్స్‌లోని ఓ ట్విస్ట్‌ను ఎవరూ ఊహించలేదని వెంకటేష్ మహా భావించి ఉండొచ్చు. అయితే... పెళ్లి చేసుకుంటానని రామప్ప అడిగితే రేణుక చెప్పిన సమాధానం గమనించిన ప్రేక్షకులకు ఆ ట్విస్ట్ సులభంగా అర్థం అవుతుంది. ఆ తర్వాత క్లైమాక్స్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. మరో ట్విస్ట్ మాత్రం సర్‌ప్రైజ్.
'రావు బహదూర్' కథను సింపుల్‌గా కూడా చెప్పవచ్చు. కానీ, వెంకటేష్ మహాలోని దర్శక రచయిత హీరో పాత్రకు సైకలాజికల్ సమస్య, 1968 - 1991 పీరియడ్ యాడ్ చేసి... బ్రహ్మపదార్థంగా మలిచారు. కొత్తగా చెప్పే ప్రయత్నం (ప్రయోగం) చేశారు. అందువల్ల, ఈ సినిమా అందరికీ అర్థం అవుతుందా? అంటే సందేహమే. సాంకేతికంగా సినిమా ఉన్నత స్థాయిలో ఉంది. స్మరణ్ సాయి సంగీతం, కార్తీక్ పార్మర్ సినిమాటోగ్రఫీ కథకు తగ్గట్టు ఉన్నాయి.
నటుడిగా సత్యదేవ్ ప్రతిభపై ఎవరికీ సందేహాలు అవసరం లేదు. ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్. ఇంతకు ముందు పలు సినిమాల్లో అద్భుతంగా నటించారు. మరోసారి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. సత్యదేవ్‌ను తప్ప మరొకరిని రామప్పగా ఊహించుకోలేం. ఇక, ఆయన డైలాగ్ డెలివరీ పాత్రకు హెల్ప్ అయ్యింది. దీపా థామస్ రూపం, అభినయం బావున్నాయి. బాల పరాశర్ డైలాగులు, ఆమె నటన నవ్విస్తాయి. ఆమె క్యారెక్టర్ రాసిన తీరు బావుంది. హీరో స్నేహితుడు ఆచారి పాత్రలో వికాస్ ఒదిగిపోయారు. మిగతా నటీనటులు ఓకే. తెరపై వెంకటేష్ మహా కూడా ఓ పాత్రలో కనిపించారు. డ్యాన్స్ చేశారు.
సైకలాజికల్ డ్రామాగా తెరకెక్కిన 'రావు బహదూర్'లో హీరో సత్యదేవ్ అద్భుతంగా నటించారు. 'దేశ సంచారి' సాంగ్ వంటివి ఉన్నప్పటికీ... కమర్షియల్ హంగులకు దూరంగా ప్రయోగాత్మక సినిమాను తెరకెక్కించారు వెంకటేష్ మహా. సగటు సినీ ప్రియులకు చాలాసేపు సస్పెన్స్ తర్వాత గానీ తెరపై ఆయన ఏం చెబుతున్నారో అర్థం కాదు. కమర్షియల్ సినిమాల కంటే కంటెంట్ ఓరియెంటెడ్ డిఫరెంట్ సినిమాల కోసం చూసే ప్రేక్షకులకు నచ్చుతుంది. సినిమా నిదానంగా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు సహనానికి పరీక్ష పెడతాయి. ఓపిగ్గా చూడాలి మరి. అప్పుడే సత్యదేవ్‌ను కమల్ హాసన్‌తో పోల్చలేం. అయితే... ఆయన నిస్సందేహంగా ఈ జనరేషన్‌లో వన్నాఫ్ ది బెస్ట్ యాక్టర్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















