Bethlehem Kudumba Unit Telugu Review - 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' రివ్యూ: మలయాళంలో 200 కోట్ల కలెక్షన్లు... నివిన్ పౌలీ, మమితా బైజు సినిమా ఎలా ఉందంటే?
Bethlehem Kudumba Unit Review In Telugu: ఓనమ్ 2026కి విడుదలైన మలయాళ సినిమా 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' 200 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగు వెర్షన్ తాజాగా విడుదలైంది. ఆ సినిమా ఎలా ఉందంటే?
గిరీష్ ఏడీ
నివిన్ పౌలీ, మమిత బైజు, సంగీత్ ప్రతాప్, సురేష్ కృష్ణ, వినయ్ ఫోర్ట్, రోషన్ షానవాస్, శ్యామ్ మోహన్ తదితరులు
Nivin Pauly's Bethlehem Kudumba Unit Movie Review In Telugu: ఓనమ్ పండక్కి విడుదలైన మలయాళ సినిమా 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్'. ఈ ఏడాది భారీ కలెక్షన్లు సాధించిన మలయాళ సినిమాల్లో ఇదొకటి. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇందులో 'ప్రేమమ్' ఫేమ్ నివిన్ పౌలీ హీరో. 'ప్రేమలు', సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో విజయాలు అందుకున్న మమితా బైజు హీరోయిన్. ఈ సినిమా నిర్మాతల్లో హీరో ఫహాద్ ఫాజిల్ ఒకరు. 'ప్రేమలు' ఫేమ్ గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆగస్టు 21న మలయాళంలో విడుదలై భారీ విజయం సాధించింది. దాంతో తెలుగు వెర్షన్ రెడీ చేశారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా ఎలా ఉందంటే?
కథ (Bethlehem Kudumba Unit Movie Story): జస్టిన్ (నివిన్ పౌలీ)ది క్యాటరింగ్ బిజినెస్. 30 ఏళ్ళు దాటినా పెళ్ళి చేసుకోలేదు. పక్కింటిలోకి కొత్తగా వచ్చిన ఓ కుటుంబంలోని అమ్మాయి యాష్లీ (మమితా బైజు)తో స్నేహం పెరుగుతుంది. ఆమె కాలేజీకి వెళుతోంది. జస్టిన్ కంటే పది పన్నెండేళ్ళు చిన్న. అయితే... అతడిని ప్రేమిస్తుంది.
తనను యాష్లీ ప్రేమిస్తున్న సంగతి తెలిసి జస్టిన్ ఎలా రియాక్ట్ అయ్యాడు? అసలు అతను సింగిల్‌గా ఉండటానికి కారణం ఏమిటి? జస్టిన్ - యాష్లీ ప్రేమ వ్యవహారం తెలిసి ఇద్దరి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లిదండ్రులు ఏమన్నారు? పెళ్ళి వరకు ప్రేమను తీసుకు వెళ్ళడంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు? చివరకు ఎలా ఒక్కటి అయ్యారు? అనేది సినిమా.
విశ్లేషణ (Bethlehem Kudumba Unit Movie Story): ఏజ్ డిఫరెన్స్ కాన్సెప్ట్‌తో సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' వచ్చింది. విజయం సాధించింది. అందులో హీరో కంటే 20 ఏళ్ళు చిన్నది హీరోయిన్. 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్'లో ఉన్నది కూడా ఏజ్ డిఫరెన్స్ కాన్సెప్టే. ఇందులో హీరో కంటే హీరోయిన్ 12- 13 ఏళ్ళు చిన్నది. రెండు సినిమాల్లోనూ హీరోయిన్ ఒక్కరే... మమితా బైజు. రెండింటిలోనూ తనకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళతో ప్రేమలో పడతారు. అయితే... రెండు సినిమాల కథలు వేరు. కథనాలు వేరు. వినోదాన్ని, భావోద్వేగాలను చూపించిన తీరు వేరు.
'విశ్వనాథ్ అండ్ సన్స్'లో లావిష్ లైఫ్ స్టైల్, లార్జర్ దేన్ లైఫ్ హీరో క్యారెక్టర్ మనకు కనిపిస్తాయి. 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్'కు వచ్చేసరికి సహజత్వానికి చాలా దగ్గరగా క్యారెక్టర్లు, సన్నివేశాలు ఉంటాయి. మెజారిటీ సన్నివేశాల్లో రియాలిటీ కనిపిస్తుంది. హీరో హీరోయిన్ల పరిచయం నుంచి ప్రేమలో పడటం, కుటుంబ సభ్యులతో పాటు స్నేహితుల స్పందన... ప్రతిదీ మన పక్కింటిలో లేదంటే మన కాలనీలో జరిగిన కథను తెరపై చూస్తున్న అనుభూతి ఇస్తాయి.
'ప్రేమలు' తర్వాత మరోసారి స్వచ్ఛమైన వినోదం, సున్నితమైన భావోద్వేగాలతో 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు దర్శకుడు గిరీష్ ఏడీ. ఈ సినిమాలో అసలైన బ్యూటీ ఏజ్ డిఫరెన్స్ కాన్సెప్ట్ కాదు... కథ కాదు... రచయిత కిరణ్ జోసేతో ఆయన రాసిన లైఫ్ జర్నీ & బ్యూటిఫుల్ లవ్ - ఫన్ మూమెంట్స్. 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్'లో కథ, స్క్రీన్ ప్లే, సన్నివేశాలు ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే... ప్రతి సన్నివేశం, క్యారెక్టర్ మనల్ని కథతో పాటు ట్రావెల్ చేసేలా చేస్తాయి. అందుకు కారణం... ఆయా సన్నివేశాలను గిరీష్ ఏడీ తీసిన విధానంతో పాటు నటీనటుల ప్రతిభ కూడా! కొన్ని వన్ లైనర్ పంచ్ డైలాగ్స్ గట్టిగా పేలాయి. డైలాగులు లేకున్నా హీరో హీరోయిన్ల ప్రేమ సంగతి తెలిశాక గ్లిక్సన్ (రోషన్ షనవాస్) ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ కూడా నవ్విస్తుంది. ఫస్టాఫ్ అంతా క్యూట్, ఫన్ మూమెంట్స్‌తో వెళుతుంది. సెకండాఫ్‌లోనూ వినోదమే ఎక్కువ ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పటికీ... అటు వైపు ఎక్కువ వెళ్ళలేదు. హీరో లవ్ ఫెయిల్యూర్ గానీ, హీరోయిన్ కోసం పడిన తపనను గానీ ఎక్కువ చూపించలేదు. అందువల్ల, ప్రేమలో డెప్త్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఆ లోటును కామెడీ కవర్ చేసింది.
గిరీష్ ఏడీ కథ, దర్శకత్వానికి విష్ణు విజయ్ సంగీతం - అజ్మల్ సాబు కెమెరా వర్క్ తోడు కావడంతో సినిమా సాఫీగా ముందుకు వెళుతుంది. డ్యాన్స్ నంబర్స్ కాకుండా మాంటేజ్ సాంగ్స్ కావడంతో కథతో పాటు పాటలు ముందుకు వెళ్ళాయి. కామెడీ సన్నివేశాల్లో విష్ణు విజయ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. నవ్వించడంలో ఇంకాస్త హెల్ప్ చేసింది. కేరళతో పాటు గోవా అందాలను కూడా అజ్మల్ సాబు చక్కగా క్యాప్చర్ చేశారు. కామెడీ కాస్త తగ్గినా ఎమోషనల్ డెప్త్ ఇచ్చేలా రేటింగ్ ఉండి ఉంటే సినిమా మరింత బావుండేది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బావున్నాయి.
జస్టిన్‌గా నివిన్ పౌలీ నటించలేదు. మిడిల్ ఏజ్డ్ పర్సన్‌గా జీవించారు. లుంగీ కట్టి, కాస్త పొట్టతో కనిపించేసరికి హీరోలా కాకుండా కామన్ మ్యాన్‌లా ఉన్నారు. ఎక్కడా ఓవర్ చేయలేదు. సెటిల్డ్, మెచ్యూర్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ముఖ్యంగా అమ్మాయి ప్రపోజ్ చేశాక, ఐర్లాండ్ నుంచి అమ్మాయి తిరిగిచ్చిన తర్వాత తన మనసులో ప్రేమను వ్యక్తం చేసే సన్నివేశాల్లో నివిన్ పౌలీ నటన సింప్లీ సూపర్బ్. ఆయన కళ్ళలో అమాయకత్వం కనిపిస్తుంది. అది ఆకట్టుకుంటుంది. కామెడీ టైమింగ్ కూడా సూపర్బ్. మమితా బైజు మరోసారి క్యూట్ లుక్స్, లవ్లీ నటనతో ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తారు. కళ్లతో ఎక్కువ నటించారు.
'ప్రేమలు'లో జేకే పాత్రలో నటించిన శ్యామ్ మోహన్ గుర్తున్నారా? ఈసారి కాస్త సీరియస్ రోల్ చేశారు. అయితే... 'కాంతార' స్పూఫ్ సీన్‌తో నవ్వించారు. హీరో తమ్ముడిగా సంగీత్ ప్రతాప్, అతని స్నేహితుడిగా రోషన్ షనవాస్ నవ్వించారు. షార్ట్ ఫిల్మ్ మేకింగ్ సీన్స్, మైసూర్ పాక్ సీన్ అయితే హిలేరియస్ అని చెప్పాలి. హీరో చెల్లెళ్లతో హీరోయిన్ మందు కొట్టే సీన్, గోవా ట్రిప్ సీన్స్ బావున్నాయి. మిగతా నటీనటులు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
Bethlehem Kudumba Unit Verdict: 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్'లో చక్కటి వినోదం ఉంది. ఆ వినోదంలో ఫోర్స్డ్ ట్రాక్స్ గానీ, స్లాప్ స్టిక్ మూమెంట్స్ గానీ లేవు. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ ఉంది. ఆ ప్రేమలో రొమాన్స్‌ను ఇరికించలేదు. హీరో హీరోయిన్లు నివిన్ పౌలీ, మమితా బైజు చక్కగా నటించారు. వాళ్ళిద్దరి నటనలో మెలోడ్రామా గానీ, ఓవర్ డోస్ గానీ లేవు. ప్రారంభం నుంచి ముగింపు వరకు స్వచ్ఛమైన వినోదం, సహజత్వానికి దగ్గరగా అనిపించే ప్రేమ, ఆహ్లాదకరమైన నటనతో 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' మంచి అనుభూతి ఇస్తుంది. క్లీన్ అండ్ ఆర్గానిక్ రొమాంటిక్ కామెడీ ఇది. తొలకరి చినుకులా, ప్రేమలో పడిన తర్వాత వచ్చే ఫీలింగ్‌లా బావుంటుంది. డోంట్ మిస్ ఇట్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















