Godari Gattupaina Movie Review - 'గోదారి గట్టుపైన' రివ్యూ: క్రిస్టియన్ అమ్మాయితో హిందూ కుర్రాడి ప్రేమకథ... సుమంత్ ప్రభాస్ సినిమా ఎలా ఉందంటే?
Godari Gattupaina Review In Telugu: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా... జగపతి బాబు కీలక పాత్రలో నటించిన సినిమా 'గోదారి గట్టుపైన'. సుభాష్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందంటే?
సుభాష్ చంద్ర
సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతి బాబు, లైలా, రీణు, దేవి ప్రసాద్, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి తదితరులు
Sumanth Prabhas Godari Gattupaina Movie Telugu Review: 'మేం ఫేమస్'తో కథానాయకుడిగా, దర్శకుడిగా పరిచయయ్యారు సుమంత్ ప్రభాస్. ఆ సినిమా వచ్చి మూడేళ్ళ అవుతోంది. ఇప్పుడు 'గోదారి గట్టుపైన' సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో నిధి ప్రదీప్ హీరోయిన్. జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్ కీలక పాత్రల్లో నటించారు. ఎంఆర్ ప్రొడక్షన్స్‌లో పలు షార్ట్ ఫిలిమ్స్ తీసిన సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అయ్యారు. మే 8న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? (మరిన్ని రివ్యూలకు ఈ లింక్ క్లిక్ చేయండి)
కథ (Godari Gattupaina Movie Story): రాజు (సుమంత్ ప్రభాస్) ఆటో డ్రైవర్. తన చెల్లెలు క్లాస్ మేట్ మాయ (నిధి ప్రదీప్)తో ప్రేమలో పడతాడు. అమ్మాయి కూడా ఓకే. ఆమె నాన్న శ్యాంబాబు (జగపతి బాబు) సెక్యూరిటీ గార్డ్. ఆయన పేరు చెబితే ఊరిలో జనాలు అందరూ భయపడతారు. కూతురు అంటే ఆయనకు ఎంతో ప్రేమ.
రాజుకు ముద్దు పెట్టిన మాయ... తర్వాత ఎందుకు దూరమైంది? కుమార్తె ప్రేమలో పడిందని తెలిశాక శ్యాంబాబు ఏం చేశాడు? రాజును పోలీసులు ఎందుకు తీసుకు వెళ్లారు? అతనిపై నమోదు అయిన కేసు ఏమిటి? శ్యాంబాబుకు తాను అంటే ఇష్టం లేదని తెలిసిన తర్వాత రాజు ఏం చేశాడు? కథ ఎన్ని మలుపులు తిరిగింది? మళ్ళీ పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వెళ్ళింది? చివరకు ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ (Godari Gattupaina Review In Telugu): ప్రేమ కథలకు నేపథ్యం కంటే బలమైన భావోద్వేగాలు, ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కీలకం. కథలో విషయం ఉన్నప్పుడు నేపథ్యం (బ్యాక్‌డ్రాప్) యాడ్ ఆన్ అవుతుంది. ఆ ప్రేమను ఎలివేట్ చేస్తుంది. హీరో హీరోయిన్లు తమ నటనతో ప్రేక్షకులు ఆ ప్రేమను ఆస్వాదించేలా చేయగలరు. 'గోదారి గట్టుపైన'లో బ్యాక్‌డ్రాప్ బావుంది. కానీ, కథ కొత్తగా లేదు & బాలేదు.
ఆటో డ్రైవర్లను మెజారిటీ సినిమాల్లో నెగెటివ్ షేడ్‌లో చూపించారు. బట్, ఫర్ ఏ ఛేంజ్... 'గోదారి గట్టుపైన'లో మంచి మనసున్న యువకుడిగా చూపించారు. ఆటో డ్రైవర్ అని కాదు... ఈతరం యువతలో అంత మెచ్యూరిటీ కనిపించడం అరుదు. టీనేజర్లు, యంగ్‌స్టర్లను ఉడుకు రక్తం, దుందుకు స్వభావం కల వ్యక్తులుగా చూపిస్తారు. కానీ, దర్శకుడు సుభాష్ చంద్ర తన హీరోని మర్యాదాపురుషోత్తమ రాముడిగా చూపించారు. హీరో క్యారెక్టర్ పరంగా (అంటే ఆటో డ్రైవర్ బ్యాక్‌డ్రాప్ కనుక) అదొక్కటీ కొత్తదనం అని చెప్పవచ్చు. కానీ, సన్నివేశాల్లో ఆ కొత్తదనం అసలు కనిపించలేదు.
హీరోయిన్ ప్రేమలో పడటానికి చూపించిన కారణం అసలు కన్వీన్సింగ్‌గా లేదు. ఆ పాయింట్‌లో అసలు బలం లేదు. దాంతో తెరపై సన్నివేశాలు వచ్చి వెళతాయి కానీ అసలు ప్రేమ కనిపించదు. బ్రేకప్ రీజన్ గానీ, ఇంటర్వెల్ సన్నివేశంలో, బ్రేకప్ చెప్పిన తర్వాత హీరోయిన్ రియలైజ్ అయ్యే సన్నివేశంలో గానీ... ఎందులోనూ బలం లేదు. అందువల్ల, ప్రేమను ఎక్కడా ఆస్వాదించలేం. హీరోయిన్ తండ్రిగా జగపతి బాబు ఆలోచనలో తప్పు లేదనిపిస్తుంది. దాంతో కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ మిస్ అయ్యింది. కులమతాలకు అతీతమైనది ప్రేమ. కథలో సహజంగా కులమతాల ప్రస్తావన రావాలి గానీ... బలవంతంగా ఇరికించినట్టు ఉండకూడదు. హీరో హిందూ, హీరోయిన్ క్రిస్టియన్, హీరో తల్లి ముస్లిం... అన్ని మతాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే తాపత్రయం తప్ప ఈ కథకు కులమతాలు అవసరం లేదు. సరైన కామెడీ సీన్లు కుదరలేదు. దాంతో బోరింగ్ మూమెంట్స్ చాలా వచ్చి వెళ్లాయి.
సుభాష్ చంద్ర రచనలో బలం తక్కువైనా... విజువల్స్ పరంగా మెప్పించే ప్రయత్నం చేశారు. సాయి సంతోష్ ఛాయాగ్రహణం బావుంది. గోదావరి జిల్లాను బాగా క్యాప్చర్ చేశారు. నాగవంశీ కృష్ణ సంగీతంలో 'బంగారు బొమ్మ' సాంగ్ బావుంది. పాటలు ఓకే. కానీ, నేపథ్య సంగీతం మాత్రం సెట్ కాలేదు. ముఖ్యంగా కథకు ఎంతో కీలకమైన చివరి అరగంటలో అసలు సెట్ కాలేదు. కథపై నమ్మకంతో నిర్మాత అభినవ్ రావు ఖర్చుకు వెనుకాడలేదు. ఎడిటర్ అనిల్ కుమార్ కత్తెరకు పని చెప్పాల్సిన సన్నివేశాలు ఉన్నాయి. ఆ కథకు నిడివి ఎక్కువే.
పక్కింటి కుర్రాడిగా, పల్లెటూరి ఆటో డ్రైవర్ పాత్రలో సుమంత్ ప్రభాస్ చక్కగా నటించారు. పాత్రలో ఒదిగిపోయారు. గోదారి యాస విషయంలో ఆయన పడిన కష్టం, ఆ కృషి వినిపించాయి. కొత్త అమ్మాయి నిధి ప్రదీప్ నటన పరంగా కాస్త మెరుగు పడాలి. హీరోయిన్‌గా కాకుండా సహజంగా నటించే ప్రయత్నం చేశారు. కానీ, హీరో హీరోయిన్ల మధ్య ఈ కథకు అవసరమైన క్యూట్ కెమిస్ట్రీ మిస్ అయ్యింది.
తండ్రిగా జగపతి బాబు పాత్రతో అమ్మాయిల తండ్రులు కనెక్ట్ అవుతారు. ఆ పాత్ర తాలూకూ సంఘర్షణను ఆయన ఆవిష్కరించిన తీరు బావుంది. క్యారెక్టర్ షేడ్స్ బాగా చూపించారు. హీరోయిన్ తల్లిగా లైలా కనిపించారు. డైలాగులు తక్కువగా ఉన్నాయి. రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్ రొటీన్ రోల్స్ చేసినా తమ పాత్రలకు న్యాయం చేశారు. సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి నవ్వించే ప్రయత్నం చేశారు. కొంత వరకు సక్సెస్ అయ్యారు.
'గోదారి గట్టుపైన' సినిమాకు బలం సుమంత్ ప్రభాస్ నటన. ఆటో డ్రైవర్ పాత్రలో నిజాయతీగా నటించారు. కెమెరా వర్క్ & 'బంగారు బొమ్మ' సాంగ్ బావున్నాయి. కానీ, కథలో బలం లేదు. సన్నివేశాల్లో స్ట్రాంగ్ ఎమోషన్స్, కాన్‌ఫ్లిక్ట్ మిస్ అయ్యాయి. ఆర్ఆర్ బాలేదు. అందువల్ల, రెండున్నర గంటల సినిమాను చూడటానికి ఓపిక అవసరం.
Also Read: కర రివ్యూ: బ్యాంక్ రాబరీలో పోలీసులకు సవాల్ విసిరిన పల్లెటూరి దొంగ… ధనుష్ సినిమా ఎలా ఉందంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















