Buddy Movie Review: మెగా హీరో అల్లు శిరీష్ చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తూ ఉంటారు. గత ఐదేళ్లలో ఆయన కేవలం రెండు సినిమాలు మాత్రమే చేశారు. ఇప్పుడు ఆయన చేసిన ‘బడ్డీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ దర్శకుడు శామ్ ఆంటోన్ దర్శకత్వంలో తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మించారు. టెడ్డీ బేర్‌లో ఆత్మ ప్రవేశించడం అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపించడం కారణంగా ఆడియన్స్‌కు ఈ సినిమాపై ఇంట్రస్ట్ పెరిగింది. టీజర్, ట్రైలర్ కూడా ఇంట్రస్టింగ్‌గా కట్ చేశారు. మరి సినిమా ఎలా ఉంది?
కథ (Buddy Movie Story): ఆదిత్య (అల్లు శిరీష్) ఒక పైలట్. అతనికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో పని చేసే పల్లవి (గాయత్రి భరద్వాజ్) పరిచయం అవుతుంది. ఆదిత్య ఎప్పుడూ గాయత్రిని చూడలేదు కానీ గాయత్రి ఆదిత్యను ఎప్పుడూ ఫాలో అవుతుంది. అనుకోకుండా ఒకసారి పల్లవి కారణంగా ఆదిత్య సస్పెండ్ అవుతాడు. ఉన్నట్టుండి ఒకరోజు పల్లవిని ఇంటర్నేషనల్ ఆర్గాన్ ట్రాఫికింగ్ ముఠా కిడ్నాప్ చేస్తుంది. తప్పించుకోబోయిన పల్లవిని రౌడీలు కొట్టడంతో కోమాలోకి వెళ్తుంది. కానీ తను ప్రాణాలతో ఉండగానే శరీరంలో నుంచి ఆత్మ బయటకు వచ్చి ఒక టెడ్డీ బీర్‌లోకి ప్రవేశిస్తుంది. ఆ టెడ్డీ ఆదిత్య దగ్గరకి చేరుతుంది. అందులో ఉన్నది పల్లవి అన్న సంగతి ఆదిత్యకి తెలియదు. కానీ టెడ్డీకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఈ విషయం తెలిసిన ఆర్గాన్ ట్రాఫికింగ్ ముఠా లీడర్ అర్జున్ కుమార్ వర్మ (అజ్మల్ అమీర్) ఆదిత్యని ఆపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆదిత్య ఏం చేశాడు? పల్లవిని కాపాడగలిగాడా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ (Buddy Movie Analysis): మనిషి బతికి ఉండగానే శరీరంలో నుంచి ఆత్మ బయటకు రావడం అనే కాన్సెప్ట్ టాలీవుడ్‌కి కొత్తేమీ కాదు. 2012లో రామ్ హీరోగా నటించిన ‘ఎందుకంటే ప్రేమంట’ ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. 2021లో తమిళంలో ‘టెడ్డీ’ అనే సినిమా డైరెక్ట్‌గా తెరకెక్కింది. ఆ ‘టెడ్డీ’, ఈ ‘బడ్డీ’ రెండూ సేమ్ కాన్సెప్ట్ అని చెప్పవచ్చు. ‘టెడ్డీ’ మూలకథకు కొన్ని మార్పులు చేసి కథను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మారిస్తే ‘బడ్జీ’ రెడీ.
సినిమా మొదలవ్వడమే డైరెక్ట్‌గా స్టోరీలోకి వెళ్లిపోతుంది. కానీ హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ దాదాపు ఫస్టాఫ్ మొత్తం తినేస్తుంది. ఇలాంటి ట్రాక్ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఉండాలంటే... అయితే హిలేరియస్‌గా ఉండాలి, లేకపోతే హృదయాలను కట్టిపడేసేంత ఎమోషనల్‌గా ఉండాలి. కానీ ఈ లవ్ ట్రాక్ అలా ఉండదు. కాబట్టి ఈ లెంతీ లవ్ ట్రాక్ కాస్త బోర్ కొట్టిస్తుంది. ఇంటర్వల్ సమయానికి కథలోని కీలక పాత్రలన్నీ ఒక చోటకి చేరతాయి.
సెకండాఫ్‌ను రేసీగా తీసి ఉంటే బాగుండేది. కానీ బడ్డీ పాత్రతో కామెడీ సైడ్ వెళ్దామనుకున్నారు. టెడ్డీ బేర్ కామెడీ చాలా చోట్ల వర్కవుట్ అవ్వలేదు. కథలో లాజిక్స్ గురించి వెతక్కుండా ఉంటే మంచిది. క్లైమ్యాక్స్‌లో విమానంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటుంది. చివర్లో సీక్వెల్ ఉంటుందని కూడా హింట్ ఇచ్చారు.
ఇక నటీనటుల విషయానికి వస్తే... అల్లు శిరీష్ పాత్రలో ఎమోషన్స్‌ను పలికించడానికి పెద్దగా స్కోప్ లేదు. తనకు స్కోప్ ఉన్నంతలో బాగా నటించారు. గాయత్రి భరద్వాజ్ పాత్ర ఫస్టాఫ్‌కే పరిమితం. పల్లవి పాత్రలో బాగా నటించారు. విలన్ పాత్రలో అజ్మల్ అమీర్ స్టైలిష్‌గా కనిపించారు. అల్లు శిరీష్‌కు లైనేసే ఎయిర్ హోస్టెస్ పాత్రలో ప్రిషా రాజేష్ సింగ్ కనిపించారు. ఆమె స్క్రీన్‌పై చాలా అందంగా ఉన్నారు. క్లైమ్యాక్స్‌లో ఆలీకి, ప్రిషాకి మధ్య వచ్చే చిన్న కామెడీ ట్రాక్ హిలేరియస్‌గా ఉంది. మిగతా నటీనటులందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
ఓవరాల్‌గా చెప్పాలంటే... కొత్త తరహా సినిమాలు చూడాలనుకుంటే ‘బడ్డీ’ని ఒకసారి ట్రై చేయవచ్చు. చిన్న పిల్లలకు ఈ సినిమా బాగా నచ్చే అవకాశం ఉంది. టికెట్ రేట్లు కూడా తక్కువగా ఉండటం బడ్డీకి ప్లస్ పాయింట్.