ప్రతి రోజు స్నానం చెయ్యడం దాదాపు అందరికీ అలవాటు ఉంటుంది. ఇది వ్యక్తిగత శుభ్రతకు సంబంధించిన విషయం. అలా స్నానం చెయ్యడం ఆరోగ్యానికి మంచిదనే అందరూ భావిస్తారు. అయితే నిపుణుల సూచనలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. రోజూ స్నానం చెయ్యాలా? వద్దా? అనే విషయంలో నిపుణులు ఏం సూచిస్తున్నారో ఒకసారి చూద్దం.


మనలో దాదాపు అందరూ రోజుకు ఒకసారి తప్పకుండా స్నానం చేస్తాం. అయితే ఇలా స్నానం చెయ్యడం కంటే చెయ్యకపోవడమే మంచిదని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ కు చెందిన ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. ఇక్కడి ప్రొఫెసర్ సాలీ బ్లూమ్ ఫీల్డ్  రోజు స్నానం చెయ్యడం అంత ఇంపార్టెంట్ ఏమీ కాదనే అభిప్రాయం వెలిబుచ్చారు. అది ఇంపార్టెంటని మనందరం అనుకోవడానికి కారణం కేవలం సోషల్ ఆక్సెప్టెన్సీ కోసమే అని ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ చర్చించారు. శరీరం నుంచి వచ్చే ప్రత్యేకమై ఒక వాసన పక్కవారికి ఇబ్బంది కలిగిస్తుందనే కారణం వల్ల రోజూ స్నానం చెయ్యడం మనకు అలవాటవుతుందని వీరి అభిప్రాయం.


శరీరం మీద నివసించే చాలా రకాల సూక్ష్మ జీవులు రోజు స్నానం చెయ్యడం వల్ల తొలగి పోతాయి. అయితే ఇవి చర్మం ఉత్పత్తి చేసే ఆయిల్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తాయని అంటున్నారు. ఇది చర్మం ఆరోగ్యంగా ఉండడానికి అవసరమట. అసలు స్నానం మన శరీరానికి పెద్ద అవసరం లేదు నిజానికి అని అంటున్నారు ఇక్కడి నిపుణులు.


శరీరం మీద పెరిగే సూక్ష్మ జీవుల వల్ల శరీరం నుంచి ఒక దుర్గందం వస్తుంది. దాని వల్ల మనకు ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ ఆరోగ్యానికి పెద్ద నష్టం లేదట. కానీ ఈ దుర్వాసన భరించలేకే రోజూ స్నానం చెయ్యాలని అనిపిస్తుంది మనకు. స్నానం చెయ్యకపోవడం వల్ల లాభం ల లేకపోవడమే కాదు, స్నానం చెయ్యడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయట. రోజూ స్నానం చేస్తే హాని కారక బ్యాక్టీరియాలు మన శరీరం మీద దాడి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. తరచుగా స్నానం చెయ్యడం వల్ల చర్మం పొడి బారి పగుళ్లు చూపుతుంది. దీనితో శరీరంలోపలికి హానికారక బ్యాక్టీరియా చాలా సులభంగా శరీరంలో చేరుతుందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ కు చెందిని డాక్టర్ రాబర్ట్ హెచ్. షెమర్లింగ్ అంటున్నారు.


మన నిరోధక వ్యవస్థ అప్రమత్తంగా ఉండడానికి కొన్ని సూక్ష్మ జీవులను, అపరిశుభ్రమైన పరిసరాలను నిరంతరం ఎదుర్కొంటూ ఉండడం అవసరం. ఇందుకు తగిన యాంటీబాడీలను శరీరం ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటూ ఉంటుంది. అందుకే కొందరు పిడియాట్రిషన్లు కూడా పిల్లలకు ప్రతి రోజూ స్నానం అవసరం లేదని సూచిస్తుంటారు. ప్రతి రోజూ జీవిత పర్యంతం స్నానం చెయ్యడం వల్ల నిరోధక వ్యవస్థ తన విధులను నిర్వర్తించడంలో నిర్విర్యం అవుతుందట.


ఇక యాంటీ బయటిక్ సబ్బులు స్నానానికి వాడడం వల్ల శరీరం మీద ఉండే మంచి బ్యాక్టీరియాలు నశించి పోతాయని అంటున్నారు.