గత యాభైఏళ్లుగా మనం క్షయ వ్యాధిని అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ అంతం చేయలేక భంగపడుతూనే ఉన్నాం. కలరా, పోలియో వంటి మహమ్మరుల అంతు చూసిన మానవాళి క్షయను మాత్రం ఏమీ చేయలేకపోతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారం ప్రపంచంలో ఉన్న క్షయ వ్యాధిగ్రస్తుల్లో సగానికి పైగా భారతదేశంలోనే ఉన్నారు. కేవలం క్షయ కారణంగా మనదేశంలోనే 4,80,000 మంది ఏటా మరణిస్తున్నారు. అంటే రోజుకి 1300 మంది అన్నమాట. ఇంతగా చాప కింద నీరులా క్షయ వ్యాపిస్తున్నా కూడా ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి.
మనతెలుగు రాష్ట్రాల్లో క్షయ వ్యాధి గ్రస్తుల సంఖ్య కాస్త తక్కువగానే ఉంది కానీ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మధ్య క్షయ తీవ్రంగా ఉంది. కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చాక, ప్రభుత్వాలు పూర్తిగా తమ దృష్టిని పెట్టడంతో క్షయ వంటి దీర్ఘకాలికవ్యాధుల బారిన పడిన వారు చాలా ఇబ్బందులు పడ్డారు. మరింత మంది ఈ రెండేళ్లలో క్షయ వ్యాధి బారిన పడినట్టు గుర్తించారు.
ప్రభుత్వం నుంచి మందులు ఫ్రీ
క్షయవ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం నుంచి ఉచితంగా మందులు, పౌష్టికాహారం, రూ.500 నగదు కూడా అందిస్తారు. కాబట్టి ఎవరికైనా క్షయ వ్యాధి ఉంటే ప్రభుత్వం నుంచి ఈ సాయాన్ని కచ్చితంగా తీసుకోవాలి. క్షయరోగుల్లో చాలా మందికి కోవిడ్ వైరస్ కూడా సోకింది. దీనివల్ల వారు ప్రాణాంతకమైన పరిస్థితి చేరుకున్నారు. 2030 కల్లా క్షయ వ్యాధిని అంతం చేయాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇప్పుడున్న గణాంకాల ప్రకారం అది సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు.
ఇదొక అంటువ్యాధి..
చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే క్షయ ఒక అంటువ్యాధి. క్షయ రోగుల్లో మైకోబ్యాక్టిరియం ట్యూబర్ కోలోసిస్ అనే బ్యాక్టిరియా ఉంటుంది. ఇది వారు తుమ్మినప్పుడు, దగ్గనప్పుడు గాలి ద్వారా ఇతరులకు సోకుతుంది. అందుకే క్షయ వ్యాధి గ్రస్తులు ఉన్న ఇళ్లల్లో మిగతావారికి కూడా ఇదొచ్చే అవకాశం ఎక్కువ.
లక్షణాలు ఇలా..
విపరీతమైన దగ్గు వస్తుంది. జ్వరం, ఛాతీ నొప్పి, నీరసం, అలసట, తలనొప్పి, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోవద్దు. ట్యూబర్ కొలోసిస్ బ్యాక్టిరియా శరీరంలో చేరాక రెండేళ్ల తరువాత లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. కొందరిలో అయిదేళ్లయిన లక్షణాలు బయటపడవు.
వీరు జాగ్రత్త
మధుమేహ రోగులు, పోషకాహార లోపం ఉన్నవారు, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు, కరోనా వైరస్ బారిన తీవ్రంగా పడిన వారు, క్యాన్సర్ రోగులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో క్షయ త్వరగా కలుగుతుంది.
Also read: చర్మక్యాన్సర్ వచ్చిన విషయాన్ని కళ్లు చెబుతాయా? లక్షణాలెలా ఉంటాయి?
Also read: చిన్న వయసులోనే ఆడపిల్లలు ఎందుకు రజస్వల అవుతున్నారు?