Laughing Health Benefits: ఒకప్పుడు నవ్వు నాలుగు విధాలా చేటు అనేవారు. కానీ ఇప్పుడు నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం అంటున్నారు. భాషతో పనిలేకుండా ప్రతి మనిషి పలకరింపు నవ్వు. అందుకే నవ్వు సార్వత్రిక భాష. నవ్వుతో ఆరోగ్యం, ఆనందం, శాంతి సాధ్యపడుతాయి.


నవ్వు ఒక మంచి అనుభూతి. కానీ నవ్వు ఆరోగ్యాన్ని మెరుగు పరిచే మంచి వ్యాయామం కూడా. నవ్వడం ఒత్తిడి నుంచి, శారీరక, మానసిక బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నవ్వడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కలిగించడం ఈ ప్రపంచ నవ్వుల దినోత్సవం ముఖ్య ఉద్దేశం.


నవ్వుల దినోత్సవం చరిత్ర


1998లో డాక్టర్ మదన్ కటారియా ప్రపంచవ్యాప్తంగా నవ్వు కూడా ఒక యోగా అంటూ ఉద్యమాన్ని మొదలు పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో మే మొదటి ఆదివారం నాడు ప్రపంచ నవ్వుల దినోత్సవం జరుపుకుంటారు. ఈ సంవత్సరం మే 5న నవ్వుల దినోత్సవం జరుపుకుంటున్నాము.


డాక్టర్ మదన్ 1995లో లాఫ్టర్ యోగా ఉద్యమాన్ని ప్రారంభించారు. నవ్వు ప్రభావం ముఖకవళికలు, భావోద్వేగాల మీద గణనీయమైన ప్రభావం చూపుతాయనే అవగాహన కలిగించడం ఈ ఉద్యమ లక్ష్యం. నవ్వు ద్వారా సోదరభావాన్ని ప్రపంచవ్యాప్తం చెయ్యవచ్చనే స్పృహను వ్యాప్తి చేస్తున్నారు.


డెన్మార్క్‌లో 2000 సంవత్సరం HAPPY-DEMIC పేరుతో మొదటిసారి మనదేశానికి వెలుపల జరిగిన మొదటి నవ్వుల దినోత్సవం. ఇది కోపెన్హాగన్ లోని టౌన్ హాల్ స్క్వైర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 10000 మందికి పైగా ప్రజలు ఒకచోట చేరారు. ఇది అతి పెద్ద సమావేశంగా చెప్పుకోవచ్చు.


లాఫ్టర్ క్లబ్‌లో కామెడి సినిమాలు, స్టాండప్ కమెడియన్ల కామెడీ షోలు కూడా చూడవచ్చు. స్టాండప్ కమెడియన్ గా టాలెంట్ పెంచుకునేందుకు అవసరమయ్యే క్లాసులు కూడా ఈ లాఫ్టర్ క్లబ్ ల ఆధ్వర్యంలో జరుగుతాయట. సోషల్ మీడియా ద్వారా జోకులు పంచుకోవచ్చు. స్నేహితులతో కలిసి కామెడి సినిమాలు చూడవచ్చు. పార్కుల్లో సమావేశమై నవ్వుల యోగాభ్యాసం కూడా చేస్తారు.


నవ్వుతో ఆరోగ్యం


నవ్వుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయట. అవేమిటో తెలుసుకుందాం.



  • శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది.

  • ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడి తగ్గి నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.

  • నవ్వడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఫలితంగా తాత్కాలికంగా నొప్పిని తగ్గిస్తుంది.

  • గుండెకు రక్షణ ఇస్తుంది. రక్తనాళాల పనితీరు మెరుగుపరుస్తుంది. ప్రసరణ మెరుగవుతుంది.

  • నవ్వడం వల్ల క్యాలరీలు ఖర్చవుతాయి. రోజుకు 10, 15 నిమిషాలు నవ్వగలిగితే 40 క్యాలరీల వరకు ఖర్చవుతాయి.

  • నవ్వుతూ బతికేవారి ఆయుప్రమాణాలు మెరుగవుతాయి.

  • కోపాన్ని తగ్గిస్తుంది. ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుంది.

  • నవ్వుతో కండరాలు రిలాక్స్ అవుతాయి.

  • నవ్వు సహజమైన వ్యాయామం. ఇదొక కాంప్లిమెంటరీ క్యాన్సర్ థెరపి. క్యాన్సర్ మీద నవ్వు ప్రభావం చూపుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

  • నవ్వు రక్తంలో ఆక్సిజన్‌ను పెంచుతుంది. జ్ఞాపకశక్తిని మెరగుపరుస్తుంది. సృజనాత్మకత పెంచుతుంది.


Also Read : Eye care tips: వేసవిలో ఒళ్లే కాదు.. కళ్లు కూడా జర భద్రం - ఈ పనులు అస్సలు చేయొద్దు, ఈ చిట్కాలు పాటించండి





గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.