ఆరోగ్యమే మహాభాగ్యం అని చిన్నప్పట్నించీ వింటూనే ఉన్నాం, మరి ఆరోగ్యం కోసం మీరేం చేస్తున్నారు. చెడు ఆహారపు అలవాట్లు, మద్యపానం, ధూమపానం, జంక్ ఫుడ్ తింటూ మీ ఆరోగ్యానికి మీరే చిల్లు పెడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగానైనా ఇకపై ఆరోగ్యం-ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకోవాలి. ఆరోగ్యానికి హాని చేసే ఆహారపు అలవాట్లను వదిలేయాలి. ప్రజల్లో తమ ఆరోగ్యంపై, శ్రేయస్సుపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈసారి థీమ్ ‘మన భూమి,మన ఆరోగ్యం’. భూమిపై జీవించే ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలన్నదే ఈ దినోత్సవం ఆకాంక్ష. ఆహారం విషయంలో చేయకూడని తప్పులు, పాటించాల్సిన జాగ్రత్తలు ఎన్నో ఉన్నాయి.
బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయద్దు
టిఫిన్‌ను చాలా మంది తక్కువ అంచనా వేస్తారు. నేరుగా లంచ్ చేసేద్దాం అనుకుని బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇడ్లీ, పోహా, దోశ, గుడ్లు... ఇలా ఇంట్లో వండిన తాజా ఆహారాన్ని తిని రోజును ప్రారంభించాలి. ఇలా చేస్తే రోజంతా చురుగ్గా ఉంటారు. అలాగే బ్రేక్‌ఫాస్ట్‌లో తాజా పండ్లు, నట్స్‌ను చేర్చుకోవాలి.
మధ్యమధ్యలో అలాంటి పండ్లు...
ప్రతి ప్రాంతంలో స్థానికంగా పండే పండ్లు చాలా ఉంటాయి. అలాంటి పండ్లను బ్రేక్‌ఫాస్ట్‌కి లంచ్‌కి మధ్యలో లేదా లంచ్‌కి డిన్నర్ కి మధ్యలో తినాలి. హైపర్ లోకల్ పండ్లు తింటే చాలా మంచిది. అంటే మీ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన పండ్లను హైపర్ లోకల్ పండ్లు అంటారు. అరటిపండ్లు, జామ పండ్లు, పనస, ద్రాక్షల్లాంటివన్నమాట. శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలంటే ఈ పండ్లను తినాలి.
పొట్ట మాడ్చుకోకండి
లంచ్‌లో పూర్తిస్థాయి ఇండియన్ థాలీని ఆరగించాలి. అంటే పప్పు, అన్నం, చపాతీ, కూరగాయలు, పెరుగు, ఆవకాయతో మంచిగా భోంచేయాలి. పొట్ట నిండుగా ఆరగించాలి. మధ్యాహ్న భోజనం పోషకాలతో నిండి ఉండాలి. విటమిన్లు, ఖనిజాలు అధికంగా లభించాలి. లంచ్ లో ఎప్పుడూ స్కిప్ చేయకూడదు. పొట్ట మాడ్చుకుని ఉండకూడదు.
కాసేపు నిద్ర
మధ్యాహ్నం భోజనం చేశాక కనీసం 20 నుంచి 30 నిమిషాలు నిద్రపోవాలి. ఇలా చేయడం వల్ల రాత్రిపూట బాగా నిద్రపడుతుంది కూడా. ఈ నిద్ర గ్రోత్ హార్మోన్లను సరైన స్థాయిల్లో ఎదిగేందుకు సహాయపడుతుంది. కొవ్వును తగ్గించేందుకు సహాయపడుతుంది. గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నవారు, థైరాయిడ్, పీసీఓడీ, హార్మోన్ల సమస్యలు, మధుమేహం, అసిడిటీ ఉన్నవారు, జీర్ణ సమస్యలతో బాధపడుతున్నవారు కచ్చితంగా మధ్యాహ్నం కాసేపు నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
తేలికపాటి రాత్రి భోజనం
రాత్రి భోజనాన్ని ఆలస్యంగా తినడం వల్ల సమస్యలు వస్తాయి. ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్యలో రాత్రి భోజనాన్ని ముగించాలి. డిన్నర్లో కాస్త తేలికపాలి ఆహారాన్ని తీసుకుంటే చాలా మంచిది. త్వరగా అరుగుతుంది, దీనివల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోదు. నిద్ర కూడా హాయిగా పడుతుంది. ఏ ఆరోగ్య సమస్యల నుంచైనా త్వరగా కోలుకోవాలంటే రాత్రి భోజనం, రాత్రి నిద్ర చాలా అవసరం.
Also read: స్పెర్మ్ కౌంట్‌ను పెంచే టొమాటో మిరియాల సూప్, ఎలా చేయాలంటే