మిస్ వరల్డ్ పోటీ విజేత ఎవరో మరి కాసెపట్లో....
ఈ పోటీల కధా కమామీషు ఏంటో మీకు తెలుసా ?
మిస్ వరల్డ్ పోటీలు ప్రతిష్టాత్మకమైన పోటీల్లో ఒకటి. ఇవి ప్రపంచంలోనే అత్యంత పూరాతన పోటీలు. 1951లో బ్రిటన్ లో ఇవి ప్రారంభమయ్యాయి. అప్పటి నుండి ఇవి ప్రతీ ఏడాది జరుగుతుంటాయి. ఏవైనా ప్రత్యేక పరిస్థితులు ఉంటే, అంటే కోవిడ్ లాంటి పరిస్థితుల్లోతప్ప ఇదీ ప్రతీ సంవత్సరం జరిగే అద్భుతమైన ఈవెంట్. బిగ్ ఫోర్ పోటీల్లో ఇది ఒకటి. అంటే అంతర్జాతీయ అందాల పోటీలయిన మిస్ యూనివర్స్, మిస్ ఎర్త్, మిస్ ఇంటర్నేషనల్ తో పాటు మిస్ వరల్డ్ పోటీలు అతి పెద్దదైన ఈవెంట్స్ గా చెప్పాలి.
మిస్ వరల్డ్ పోటీల చరిత్ర ఇదే
1951లో లండన్ లో ఎరిక్ మోర్లీ చే ఈ పోటీలు బ్యూటీ విత్ ఏ పర్పస్ (Beauty with a Purpose) అనే నినాదంతో ప్రారంభమయ్యాయి. ఎరిక్ మెర్లీ ఇంగ్లీష్ టెలివిజన్ హోస్ట్ గా పని చేసే వారు. కమ్ డ్యాన్సింగ్ అనే ప్రముఖ టెలివిజన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మిస్ వరల్డ్ పోటీల ద్వారా పిల్లలు, మహిళల చైతన్యం కోసం నిధులు సేకరించే వారు. వారి విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారిత కోసం ఈ నిధులను వెచ్చించే వారు. ఎరిక్ మెర్లీ 2000 సంవత్సరంలో మరణించారు. ఆయన తర్వాత ఆయన సతీమణి జూలియా మెర్లీ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు.
మొదటగా ఫెస్టివల్ బికీని కాంటెస్ట్ గా ప్రారంభమైన ఈ పోటీలు ఆ తర్వాత మిస్ వరల్డ్ గా రూపాతంరం చెందాయి. ఈ పోటీలను బీబీసీ 1959 నుండి ప్రసారం చేయడం ప్రారంభించింది. అప్పటి నుండే ఈ పోటీలు ప్రపంచాన్ని ఆకర్షించాయి. ఈ పోటీలు కేవలం అందాన్ని ప్రదర్శించే వేదిక మాత్రమే కాదు. బరిలో ఉండే సుందరీమణులు చేసే సామాజిక సేవ, స్వచ్ఛంధ కార్యక్రమాలను కూడా దృష్టిస్త్తోంది. పిల్లల కోసం పని చేసే స్వచ్చంధ సంస్థల కోసం ఈ వేదిక ద్వారా 1 బిలియన్ పౌండ్ల నిధులు విరాళాలుగా సేకరించడం జరిగింది.
నిరసనల మధ్య మూడు సార్లు ఆతిధ్యం ఇచ్చిన భారత్
ఈ పోటీలు ప్రశంసలతో పాటు విమర్శలను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా స్త్రీ వాద సంస్థలు దీన్ని స్కిన్ షోగా విమర్శిస్తాయి. మన దేశం ముడు సార్లు ఈ పోటీలకు ఆతిధ్యం ఇచ్చింది.1996లో 46వ ఎడిషన్ కు బెంగళూరు వేదికయింది. ఆ తర్వాత 2024లో 71వ ఎడిషన్ ముంబైలో జరిగింది. 72వ ఎడిషన్ (2025) ఇప్పుడు మన హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రస్తుతం మిస్ వరల్డ్ చెక్ రిపబ్లిక్ చెందిన క్రిస్టినా పిస్కోవా ముంబైలో గత ఏడాది జరిగిన పోటీల్లో విజేత నిలిచారు.
బెంగుళూరులో జరిగిన 1996 ఎడిషన్ పోటీలు, 2024లో ముంబైలో, నేడు హైదరాబాద్ లో జరుగుతున్న పోటీలు కూడా విమర్శలను ఎదుర్కొన్నాయి. స్త్రీవాద సంస్థలు, కొన్ని మత సంప్రదాయ సంస్థలు ఈ పోటీలను తప్పబుట్టాయి. ఏది ఏమైనా ఆధునిక మహిళలు మాత్రం ఈ పోటీల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.