Friendship Day 2025:  జీవితంలో ప్రతి బంధానికి ప్రత్యేకత ఉంటుంది. కానీ వీటిలో స్నేహం అనేది చాలా ప్రత్యేకమైంది. వయస్సు, మతం లేదా కులం చూడని బంధం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్‌షిప్‌ డేకు ప్రత్యేక రోజుగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా స్నేహ దినోత్సవం ఘనంగా జరుపుకుంటారు. అలాంటి ఫ్రెండ్‌షిప్‌డే ఎక్కడ? ఎలా ప్రారంభమైందో మీకు తెలుసా?

ప్రపంచంలో మొట్టమొదటి స్నేహ దినోత్సవం ఎలా ప్రారంభమైంది

స్నేహ దినోత్సవం భావన మొదట 1930లో వచ్చింది, అప్పుడు అమెరికాకు చెందిన గ్రీటింగ్ కార్డ్ కంపెనీ హాల్‌మార్క్ వ్యవస్థాపకుడు జాయ్స్ హాల్. స్నేహానికి గౌరవంగా ఒక ప్రత్యేక రోజు ఉండాలని ఆయన సూచించారు. ఆ రోజు స్నేహితులకు కార్డ్స్‌,  బహుమతులు ఇచ్చి వేడుక చేసుకోవాలని చెప్పారు. ఆగస్టు మొదటి ఆదివారం నాడు జరుపుకోవాలని చెప్పారు. అయితే, ఈ ఆలోచన కొంతకాలం మాత్రమే పరిమితమైంది. కాని చాలా సంవత్సరాల తరువాత స్నేహ దినోత్సవానికి ప్రపంచ గుర్తింపునిచ్చిన మరొక ముఖ్యమైన ఘటన జరిగింది.

గ్లోబల్ ఫ్రెండ్‌షిప్ డే ఎక్కడ ప్రారంభమైంది

1958లో డాక్టర్ రెమన్ ఆర్టిమియో బ్రాచో అనే వైద్యుడు పరాగ్వేలో తన స్నేహితుడితో కలిసి భోజనం చేస్తూ ఈ ఆలోచన పంచుకున్నాడు. స్నేహితులందర్నీ ఏకం చేసేందుకు స్నేహితుల కోసం ప్రత్యేక రోజు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించాడు. దీని ద్వారా సమాజంలో సోదరభావం కూడా విస్తరిస్తుందని అన్నాడు. ఇక్కడి నుంచే వరల్డ్ ఫ్రెండ్‌షిప్ డేకు పునాది పడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా స్నేహం, శాంతి సందేశాన్ని వ్యాప్తి చేసే సంస్థగా మారింది. ఈ ఆలోచనతో జులై 30న స్నేహ దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించారు.

ఐక్యరాజ్యసమితి ఎప్పుడు అధికారికంగా గుర్తించింది

2011లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ స్నేహ దినోత్సవాన్ని అధికారికంగా గుర్తించి, జులై 30ని అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా ప్రకటించింది. దీని లక్ష్యం ప్రపంచ ప్రజలు, సమాజాలు, దేశాల మధ్య శాంతి, సహకారాన్ని పెంపొందించడం. 

అధికారిక ప్రకటన జులై 30న అయితే, ఆగస్టులో ఎందుకు జరుపుకుంటారు

ఐక్యరాజ్యసమితి 2011లో అధికారికంగా జులై 30ని అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా ప్రకటించింది. ఈ తేదీని ప్రపంచంలోని అనేక దేశాలు స్నేహ దినోత్సవంగా పాటిస్తాయి. కానీ భారతదేశం సహా అనేక దేశాలు దీనికి భిన్నమైన మార్గాన్ని అనుసరించాయి. భారతదేశం, మరికొన్ని దేశాల్లో స్నేహ దినోత్సవాన్ని ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. దీనికి అధికారిక ప్రకటన ఏమీ లేదు, కానీ ఇది పాపులర్ కల్చర్, మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగానే వాడుకలోకి వచ్చింది.

ఫ్రెండ్‌షిప్‌ డేపై ప్రత్యేక క్రేజ్

ఫ్రెండ్‌షిప్‌ డే అంటే యువతో చాలా క్రేజ్ ఉంటుంది. టీనేజర్లు  కళాశాల విద్యార్థులు చాలా సెలబ్రేషన్స్‌లో మునిగిపోతారు. ఒకరికొకరు రంగురంగుల ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్లు కట్టుకుంటారు, గ్రీటింగ్ కార్డులు, చాక్లెట్లు, బహుమతులు ఇచ్చుకుంటారు. సోషల్ మీడియాలో కూడా ఫ్రెండ్‌షిప్‌డే ట్రెండ్ అవుతుంది. ప్రజలు తమ బెస్ట్ ఫ్రెండ్‌తో ఫోటోల, వీడియోలను షేర్ చేస్తారు.

2025లో స్నేహ దినోత్సవం ఎప్పుడు వస్తుంది

ఈ సంవత్సరం అంటే 2025లో ఫ్రెండ్‌షిఫ్‌డే ఆగస్టు 3న జరుపుకుంటారు. ఇది ఆదివారం, ఇది స్నేహితులతో కలిసి తిరగడానికి, వేడుకలు చేసుకోవడానికి, పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడానికి సరైన అవకాశంగా చూస్తారు. 

స్నేహం కేవలం వేడుక మాత్రమే కాదు... 

నేటి కాలంలో డిజిటల్ కనెక్షన్లు ఉన్నప్పటికీ, మనసుల మధ్య దూరం పెరుగుతోంది. ఇలాంటి  పరిస్థితిలో ఫ్రెండ్‌షిప్‌ డేని భిన్నంగా చేసుకునేందుకు యువత సిద్ధమవుతోంది. చిన్ననాటి స్నేహితుడైనా, కళాశాల మిత్రుడైనా ఆఫీస్‌లో ఉన్న దోస్త్‌ అయినా విష్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని మరింత ఉత్సాహం నింపుకుంటున్నారు.