Desk Job Risks : ఆఫీస్‌లో గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకతో పాటు ఈ అవయవాలకూ ప్రమాదమే, నిపుణుల సూచనలివే
Sit for Long Hours at the Office : ఆఫీస్‌లో గంటల తరబడి కూర్చోని ఉంటున్నారా? అయితే మీకు వెన్నెముక సమస్యతో పాటు.. ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

- పనిలో ఎక్కువసేపు కూర్చోవడం వెన్నెముక, కీళ్లను తీవ్రంగా దెబ్బతీస్తుంది.
- తప్పు భంగిమ మెడ, నడుము నొప్పి, డిస్క్ సమస్యలకు దారి తీస్తుంది.
- సరైన ఎర్గోనామిక్స్, తరచు విరామాలు ఆరోగ్య సమస్యలను నివారిస్తాయి.
Hidden Health Risks of Sitting All Day at Work : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 10 గంటల వరకు కంప్యూటర్ ముందు కూర్చొని పని చేస్తున్నారు. చాలామంది దీనిని సాధారణ విషయంగా భావిస్తారు. అయితే ఎక్కువసేపు ఇలా ఒకే చోట కూర్చోవడం వల్ల వెన్నెముక, కండరాలు, కీళ్లు, శరీరాన్ని నిలబెట్టే ఇతర అవయవాల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అలా కూర్చోవడం వల్ల వచ్చే ఇబ్బందులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.
గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల వెన్నెముక సహజ వంపులు మారిపోయే ప్రమాదం ఉంటుందని.. హైదరాబాద్ యశోద ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ సయూజ్ కృష్ణన్ చెప్తున్నారు. మన వెన్నెముక కదలికల కోసం రూపొందిందని.. ఇలా ఒకే ప్రదేశం గంటల తరబడి కూర్చోవడం మంచిది కాదని చెప్తున్నారు. ముఖ్యంగా తలను ముందుకు వంచి కూర్చోవడం, భుజాలు వాల్చడం, వంగిన భంగిమలో పనిచేయడం వల్ల మెడ, నడుము భాగాలపై ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు. ఈ అంశంపై పలు అంశాలు తెలుపుతూ.. సూచనలు చేశారు.
మెడ, నడుము నొప్పి మొదటి హెచ్చరిక
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మెడ బిగుసుకుపోవడం, నడుము నొప్పి వంటి సమస్యలు ముందుగా కనిపిస్తాయని డాక్టర్ సయూజ్ కృష్ణన్ తెలిపారు. రోజురోజుకూ ఇదే అలవాటు కొనసాగితే శరీరంలో కండరాల సమతుల్యత దెబ్బతింటుందని.. హిప్ ఫ్లెక్సర్ కండరాలు బిగుసుకుపోవడం, కోర్ కండరాలు బలహీనపడటం, వెన్ను పైభాగానికి మద్దతిచ్చే కండరాలు సాగిపోవడం వంటి మార్పులు చోటుచేసుకుంటాయని హెచ్చరించారు.
ఈ కారణంగా దీర్ఘకాలిక మెడ నొప్పి, భుజాల నొప్పి, నడుము నొప్పి, వెన్నెముక వంచుకునే సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.
డిస్క్ సమస్యలు
వెన్నెముకలోని ఎముకల మధ్య ఉండే ఇంటర్‌వర్టీబ్రల్ డిస్కులపై కూడా ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఇవి వెన్నెముకకు కుషన్‌లా పనిచేస్తాయి. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఈ డిస్కులు త్వరగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాలక్రమేణా డిస్క్ బల్జ్ లేదా డిస్క్ హెర్నియేషన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది.
దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడే చాలా మంది ఆఫీస్ ఉద్యోగుల్లో, సంవత్సరాల తరబడి తప్పు భంగిమలో కూర్చోవడమే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
వెన్నెముకకే కాదు.. ఇతర భాగాలకూ ప్రమాదమే..
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కేవలం వెన్నెముక మాత్రమే కాదు, శరీరంలోని ఇతర భాగాలు కూడా ప్రభావితమవుతాయి. మణికట్టుపై ఒత్తిడి పెరగడం, చేతి ముందుభాగంలో నొప్పులు, భుజాల బిగుతు, మోకాళ్లు బిగుసుకుపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా సరైన ఎర్గోనామిక్స్ లేకుండా పనిచేసే వర్క్‌స్టేషన్లలో ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయి.
ఎలా నివారించాలంటే..
ఈ సమస్యల్లో చాలా వరకు ముందస్తు జాగ్రత్తలతో నివారించవచ్చని డాక్టర్ సయూజ్ కృష్ణన్ తెలిపారు. కంప్యూటర్ స్క్రీన్‌ను కళ్ల స్థాయిలో ఉంచడం, నడుముకు సరైన మద్దతు ఉండే కుర్చీ ఉపయోగించడం, కీబోర్డ్, మౌస్‌ను సరైన స్థానంలో ఉంచడం వల్ల శరీరంపై పడే ఒత్తిడి తగ్గుతుందని సూచించారు.
అంతేకాకుండా ప్రతి 30 నుంచి 60 నిమిషాలకు ఒకసారి లేచి కొద్దిసేపు నడవడం లేదా స్ట్రెచింగ్ చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి.. కండరాల అలసట తగ్గి, వెన్నెముకపై పడే ఒత్తిడి కూడా తగ్గుతుందని తెలిపారు.
ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి..
మెడ బిగుసుకుపోవడం, నడుము నొప్పి, శరీరంలో అలసట, భుజాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని సాధారణంగా తీసుకోవద్దని సూచిస్తున్నారు వైద్యులు. ఇవి శరీరం ఇస్తున్న ముందస్తు హెచ్చరికలు కావచ్చని.. ప్రారంభ దశలోనే గుర్తించి భంగిమను సరిచేసుకోవడం, సరైన వ్యాయామం చేయడం ద్వారా భవిష్యత్తులో వచ్చే దీర్ఘకాలిక కండరాలు, కీళ్ల సమస్యలను నివారించవచ్చని చెప్తున్నారు. ఆఫీస్ పని ఎంత ముఖ్యమైనదైనా.. ఆరోగ్యం అంతకంటే ముఖ్యమని గుర్తుంచుకోవాలి. రోజంతా కూర్చొని పనిచేసే వారు తమ వెన్నెముక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఫిట్నెస్ గురించిన ఇంట్రెస్టింగ్ వార్తలు, చిట్కాల కోసం దీనిని క్లిక్ చేయండి.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























