Dermatologist Weight Loss Journey with Mounjaro : బరువు ఎక్కువగా ఉంటే తగ్గాలని అందరికీ ఉంటుంది. అలాగే వివిధ కారణాల వల్ల బరువు పెరిగిన ఓ డెర్మటాలజిస్ట్ కూడా తగ్గాలని అనుకున్నారు. దానికోసం లైఫ్స్టైల్లో కొన్ని మార్పులు చేశారు. కొన్ని టిప్స్ ఫాలో అవుతూ 4 నెలల్లో 14 కేజీలు బరువు తగ్గారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇంతకీ ఆ డెర్మటాలజిస్ట్ ఎవరు? ఆమె ఫాలో అయిన వెయిట్‌లాస్ జర్నీ ఏంటి?
డాక్టర్ నివేదిత దాదు. ఢిల్లీలో డెర్మాటాలజిస్ట్గా చేస్తున్న ఈమె సరైన లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వకపోవడం, ఫుడ్ కంట్రోల్ లేకపోవడం వల్ల చాలా బరువు పెరిగిపోయానని.. దానివల్ల ఆమెకు కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోయిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎలా అయినా బరువు తగ్గాలి అనుకుని వెయిట్ లాస్ జర్నీని ప్రారంభించారట. దానితో 4 నెలలో 14 కేజీలు బరువు తగ్గానని తెలిపారు. ఇంతకీ ఆమె ఫాలో అయిన జర్నీ ఏంటి? టిప్స్ ఏంటో తెలుసుకుందాం.
వెయిట్ లాస్ జర్నీ
డాక్టర్ నివేదిత దాదు చిన్న నాటి నుంచే బరువు సమస్యతో ఇబ్బంది పడినట్లు ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే ఆమెకు ఫుడ్ అంటే చాలా ఇష్టం కావడం, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఫుడ్ తినే అలవాటు ఉండడం, బిజీ లైఫ్‌స్టైల్ వల్ల ఆమె బరువు పెరుగుతూ వచ్చారట. దానిని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, వాకింగ్, యాంటీఇన్ఫ్లమేటరీ డైట్ వంటివి చేశారట. కానీ అవి మంచి ఫలితాలు ఇవ్వలేదని తెలిపారు.
డైట్, వాకింగ్‌తో ఫలితాలు రాకపోవడంతో ఆమె టైప్ 2 డయాబెటిస్‌కు చెందిన ఇంజెక్షన్లు తీసుకోవడం ప్రారంభించినట్లు షాకింగ్ విషయం తెలిపారు. ఓజెంపిక్ (Ozempic-semaglutide), మౌంజారో (Mounjaro-tirzepatide) ఇంజెక్షన్లు తీసుకోవడం ప్రారంభించానని తెలిపారు. వీటిని తీసుకోవడం వల్ల ఆకలి కంట్రోల్ అయిందని.. జీర్ణక్రియ నెమ్మదించడంతో బరువు తగ్గడం ప్రారంభమైనట్లు తెలిపారు. ఓజెంపిక్ ఒకటి లేదా రెండు హార్మోన్లనే లక్ష్యంగా చేస్తుందని.. కానీ మౌంజారో ఓజెంపిక్ కంటే ప్రభావవంతంగా ఉందని వెల్లడించారు.
ఇంజక్షన్లే ఎందుకు ఎంచుకున్నారంటే..
ముందుగా ఎన్నో డైట్లు ట్రై చేసిన దాదు.. మౌంజారో ఇంజక్షన్లు ఎంచుకోవడానికి కారణముంది. బరువు ఎలా అయినా తగ్గాలనే ఉద్దేశంలో వాటిని ప్రారంభించారట. అలా ఇంజక్షన్లు గురించి తెలుసుకుని.. వాటిని తీసుకున్నట్లు తెలిపారు. నిజానికి ఇండియాలో ఒజెంపిక్ లీగల్‌గా అందుబాటులో లేదని.. రెబెల్సిస్ని నోటి ద్వారా తీసుకుంటే వికారం వచ్చేదని తెలిపారు. ఆ సమయంలో విక్టోజా (Victoza-Liraglutide)ను ట్రై చేస్తే బరువు తగ్గారు కానీ.. కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడంతో దానిని మానేశారట. అప్పుడు మౌంజారో మంచి ఫలితాలు ఇచ్చిందని.. 20 శాతం బరువు తగ్గడంలో హెల్ప్ చేసిందని దాదు ఇంటర్వ్యూలో తెలిపారు.
ఫలితాలు ఇవే..
మౌంజారో ఉపయోగించినప్పటి నుంచి 4 నెలల్లో 14 కేజీలు బరువు తగ్గారట డాక్టర్ నివేదిత దాదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని తెలిపారు. వారానికోసారి ఇంజక్షన్ తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే పోషకాల లోపాన్ని తగ్గించుకోవడానికి కొల్లాజెన్, గ్లూటాథియోన్, విటమిన్లు తీసుకున్నట్లు తెలిపారు. వీటిని తీసుకోవడంతో పాటు లైఫ్‌స్టైల్, డైట్లో కొన్ని మార్పులు చేశారట.
లైఫ్స్టైల్లో మార్పులు
రోజు ఉదయాన్నే నిమ్మరసంతో ప్రారంభిస్తారట. అనంతరం యోగా చేసి కొబ్బరి నీరు తీసుకుంటారట. ప్రోటీన్ షేక్, కీరదోస, పండ్లతో కూడిన యోగర్ట్‌తో భోజనం ముగిస్తారట. ఎక్కువగా ఆమె డైట్లో ప్రోటీన్స్, విటమిన్స్, హెల్తీ ఫ్యాట్స్ ఉండేలా చూసుకుంటారట. దీనివల్ల ఆమె ఆకలి తగ్గుతుందని తెలిపారు.
బరువు తగ్గాక..
బరువు తగ్గిన తర్వాత ఆమెలో కాన్ఫిడెన్స్ పెరిగిందని తెలిపారు నివేదిత. ఎనర్జీ పెరిగిందని, క్రేవింగ్స్ తగ్గాయని తెలిపారు. మెటబాలీజం పెరిగిందని.. స్కిన్ హెల్తీగా మారిందని తెలిపారు.
బరువు తగ్గాలని మౌంజారో ట్రై చేయాలనుకుంటే కచ్చితంగా వైద్యుల సూచనలు తీసుకోవాలంటున్నారు నివేదిత. ఇది అందరికీ పడకపోవచ్చని.. కాబట్టి కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.