Dahi Kebabs Recipe : అసలే వీకెండ్. అందునా సాయంకాలం. బయటకెళ్లి ఏదైనా తినాలంటే ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఇక ఇంటిల్లీపాది తినాలంటే జేబులు ఖాళీ అయిపోవడం ఖాయం. పైగా బయటి ఫుడ్ ఆరోగ్యానికి అంతగా మంచిది. ఎలాంటి నూనె ఉపయోగిస్తారో.. ఎలాంటి పిండి వాడుతారో.. అవి తింటే పిల్లలకు ఏమి అవుతుందో అనే ఆందోళన. వీటికి మీరు చెక్​ పెట్టాలి అనుకుంటే ఇంట్లోనే సింపుల్​గా చేసుకునే రెసిపీలు ఎన్నో ఉన్నాయి. వాటిలో దహీ కబాబ్ ఒకటి. 



బయట ఫుడ్​ తింటే బరువు పెరిగిపోతాము అనుకునేవారికి దహీ కబాబ్​ మంచి ఎంపిక. ఎందుకంటే దానిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. పైగా మీరు స్ట్రిక్ట్ డైట్ పాటిస్తూ.. టేస్టీగా ఏదైనా తినాలి అనుకుంటే మీరు దీనిని కచ్చితంగా ట్రై చేయవచ్చు. ఈ రెసిపీని ఎలా ట్రై చేయాలో.. కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 



కావాల్సిన పదార్థాలు


నూనె - 5 టేబుల్ స్పూన్లు


వెల్లుల్లి - 1 టేబుల్ స్పూన్ (రెబ్బలను సన్నగా తరగాలి)


అల్లం -  తురుము (1 టేబుల్ స్పూన్)


పచ్చిమిర్చి - 2 (సన్నగా తరగాలి)ఉల్లి


పాయలు - 2 చిన్నవి (సన్నగా తరగాలి)


జీలకర్ర పొడి -  1 టేబుల్ స్పూన్


గరం మసాలా పొడి - ½ స్పూన్


కొత్తిమీర - పావు కప్పు (తరిగినది)


ఉప్పు - రుచికి తగినంత


మిరియాల పొడి - చిటికెడు


పెరుగు - 1 కప్పు 


వాల్​నట్స్ - పావు కప్పు (తరిగినది)


పనీర్ తురుము - పావు కప్పు 


శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు


బ్రెడ్ క్రంబ్స్ - కప్పు



ప్రిపరేషన్..


సాయంత్రం స్నాక్స్​గా దహీ కబాబ్స్ చేసుకోవాలంటే ఉదయం, ఉదయం బ్రేక్​ఫాస్ట్​గా చేసుకోవాలంటే రాత్రి పెరుగును ఓ కాటన్​ క్లాత్​ లేదా మస్లిన్ క్లాత్​లో వేసి మూట కట్టాలి. ఓ జల్లెడలో దానిని ఉంచి ఫ్రిజ్​లో పెట్టాలి. మీరు ఈ రెసిపీని తయారు చేసుకునే ముందు దానిని ఫ్రిజ్​నుంచి తీసి బయటపెట్టండి. 



తయారీ విధానం..


దహీ కబాబ్ తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి పాన్​ పెట్టి మీడియం మంట చేయండి. దానిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. దానిలో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి కాస్త వేయించాలి. అనంతరం ఉల్లిపాయలు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అనంతరం జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర, ఉప్పు, పెప్పర్ పౌడర్ వేసి బాగా కలిపి స్టౌవ్ ఆపేయండి. 



తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగుతో కలపండి. దానిలో వాల్​నట్, పనీర్ వేసి బాగా కలిపేయండి. ఈ రెండూ వేసుకున్నా పర్లేదు. వేసుకోకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు అరకప్పు బ్రెడ్ క్రంబ్స్, శనగ పిండి వేసి మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని కావాల్సిన సైజులో బాల్స్​గా తయారు చేసుకోవాలి. ఈ బాల్స్​ను బ్రెడ్​ క్రంబ్స్​లో రోల్ చేయాలి. మిగిలిన మిశ్రమంతో బాల్స్ చేసుకుని ఓ ప్లేట్​లో ఉంచండి. వీటిని అరగంట సేపు ఫ్రిజ్​లో ఉంచండి. ఇలా చేస్తే బాల్స్ విడిపోకుండా.. కబాబ్స్ మరింత టేస్టీగా వస్తాయి. 
ఇప్పుడు నాన్​స్టిక్​ పాన్​లో మిగిలిన నూనె వేసి వేడి చేయండి. ఈ కబాబ్​ బాల్స్​ను నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీయాలి. అంతే వేడి వేడి దహీ కబాబ్స్ రెడీ. వీటిని గ్రీన్ చట్నీ లేదా టొమాటో కెచప్​తో ట్రై చేయవచ్చు. 


Also Read : బరువు తగ్గడానికి కేలరీలు లెక్కేసి తింటున్నారా? అయితే ఇది మీకోసమే