Ganesh Chaturthi 2025 : హిందూ పురాణాల ప్రకారం.. వినాయక చవితి లేదా గణేశ్ చతుర్థి అనేది శివుడు, పార్వతి దేవి కుమారుడైన గణేశుడి జన్మదినం. సాధారణంగా వినాయక చవితిని ఎక్కువరోజులు జరుపుకుంటారు. మండపాలు, పూజలు, ఊరేగింపులు వంటివి చేసి.. భక్తులు హంగామా చేస్తారు. ఇలా చేయడం వల్ల గణేశుడు తాము చేసే పనుల్లోని విఘ్నాలు తొలగిస్తాడని భావిస్తారు. ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు 27వ తేదీన వచ్చింది. ఆ సమయంలో చాలామంది వినాయకుడికి ప్రసిద్ధి చెందిన ఆలయాలు సందర్శిస్తారు. ముంబైలోని సిద్ధి వినాయక (Siddhi Vinayaka) టెంపుల్ కూడా గణేశుడికి ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు సందర్శిస్తారు. ఈ ఆలయం గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు చూసేద్దాం.
అత్యంత ధనిక దేవాలయం
సిద్ధి వినాయక ఆలయం ప్రపంచంలోనే.. అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటి. ఇటుకలతో చేసిన ఒక చిన్న గుడిగా ఉండే ఈ ఆలయాన్ని దేబాయి పాటిల్ అనే భక్తురాలు చేసిన విరాళాలతో గుడిని ఓ భవనంగా పునరుద్ధరించారు. ఇప్పటికీ ఈ ఆలయం అన్యదేశ చెక్కడాలు, బంగారంతో చేసిన అంతర్భాగంతో భక్తులను ఆకట్టుకుంటుంది. సిద్ధి వినాయకుడు 100 మిలియన్ల వరకు విరాళాలు అందుకున్నట్లు తేలింది. ఇది భక్తులు గణేశుడిపై పెట్టుకున్న నమ్మకాన్ని సూచిస్తుంది.
కుడి వైపున గణేష్ తొండం
సాధారణంగా గణేశుడి విగ్రహాలకు తొండం ఎడమ వైపునకు ఉంటుంది. అయితే సిద్ధి వినాయక ఆలయంలోని విగ్రహానికి తొండం కుడి వైపునకు ఉంటుంది. కుడి వైపున తొండం ఉన్న గణేష్‌ను సిద్ధి వినాయకుడు అని పిలుస్తారు. కుడి వైపున ఉన్న తొండం అన్ని కోరికల నుంచి విముక్తిని, మోక్షాన్ని సాధించడాన్ని సూచిస్తుందని చెప్తారు. ఈ ఆలయంలోని గణేశుడి విగ్రహాన్ని ఒక నల్లరాయితో చెక్కారు. విజయానికి, శ్రేయస్సుకు, సంపదకు దేవతలైన రిద్ధి, సిద్ధి విగ్రహాలు 2.5 అడుగుల ఎత్తైన గణేశుడి విగ్రహానికి రెండు వైపులా ఉంటాయి.
హనుమంతుడి విగ్రహం
సిద్ధి వినాయక ఆలయం దగ్గర 1952లో హనుమంతుడి విగ్రహం కనుగొన్నారు. భక్తులు హనుమను గుర్తించి ఆలయ ప్రధాన పూజారికి సమాచారం అందించగా.. అప్పడు ప్రధాన పూజారి హనుమంతుడి విగ్రహాన్ని ఆలయంలోకి తీసుకువచ్చి.. దానికి ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారని చెప్తారు. అనంతరం ఆలయంలో హనుమంతుడి విగ్రహం కోసం ఒక గుడిని నిర్మించారు. చాలా మంది భక్తులు సిద్ధి వినాయకుడి దగ్గరకు వచ్చి హనుమంతుడి ఆశీర్వాదాలు సైతం పొందుతారు.
గణేశుడి మూడవ కన్ను
సిద్ధి వినాయకుడి ఆలయంలోని గణేశుడి విగ్రహానికి శివుడిలాగే మూడవ కన్ను ఉంటుంది. ఈ కన్ను దైవిక అవగాహన, అంతర్దృష్టికి ప్రతీక. హిందూ పురాణాల ప్రకారం.. మూడవ కన్ను అసాధారణమైన విషయాలను చూసే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇది అవగాహన, సత్యాన్ని గ్రహించే శక్తిని సూచిస్తుంది. మూడవ కన్ను గణేశుడి నుదుటిపై కాకుండా తొండంపై ఉంటుంది. ఇది భక్తులను జ్ఞానంతో పర్యవేక్షించే, మార్గనిర్దేశం చేసే సామర్థ్యాన్ని సూచిస్తుంది.
మూషిక వాహనం
హిందూ పురాణాల ప్రకారం మూషికం గణేశుడి వాహనంగా పరిగణిస్తారు. ఎలుక అడ్డంకులను ఎదుర్కోవటానికి, వాటిని అధిగమించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. సిద్ధి వినాయక ఆలయంలో వెండితో చేసిన మూషికం గణేశుడి దగ్గర ఉంటుంది. భక్తులు ఎలుకల చెవుల్లో తమ కోరికలు చెప్పుకుంటే నేరుగా గణేశుడికి చేరుతాయని నమ్ముతారు.
మీరు కూడా ఈ వినాయకచవితి సమయంలో సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించుకోవాలంటే వెళ్లి ఆ గణేశుడి ఆశీర్వాదం తీసేసుకోండి. చవితి సమయంలో క్రౌడ్ ఎక్కువగా ఉంటుందనుకుంటే ముందుగా వెళ్లడమో.. ఆ తర్వాత వెళ్లడమో ప్లాన్ చేసుకోవచ్చు.