Valentine Day: డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పుణ్యమా అని పాత స్నేహితులు, క్లాస్‌మేట్స్‌ ఎక్కడ ఉన్నా ఇట్టే దగ్గరయిపోతున్నారు. ఎప్పుడో  ఏళ్ల క్రితం వదిలేసిన పరిచయాలు ఒక్క హాయ్‌తో మళ్లీ మొదలవుతున్నాయి. అయితే ఇలా మొదలైన మాటలు కేవలం పలకరింపులతోనే ఆగిపోవడం లేదు. ముఖ్యంగా పెళ్లయిన వారి జీవితాల్లో పాత ప్రేమికులు,లేదా క్రష్‌లు తిరిగి వచ్చినప్పుడు అది కొత్త రకమైన మానసిక సంఘర్షణకు దారి తీస్తోంది. దీనినే సైకాలజిస్ట్‌లు ఎమోషన్‌ అఫైర్ లేదా నోస్టాల్జిక్ బాండింగ్ అంటున్నారు. 

Continues below advertisement

రాహుల్ అనుభవం మీకు గుణపాఠం కావచ్చు 

రాహుల్ ఒక సాధారణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. పెళ్లైంది. పిల్లలు ఉన్నారు. జీవితం సాఫీగా సాగుతుంది. కాలేజీ రోజుల్లో అతనికి ఒక అమ్మాయి అంటే ఇష్టం ఉండేది. అది ఇద్దరికీ తెలిసినా, ఎప్పుడూ మాటల్లో బయటపడలేదు. ఎటువంటి ప్రపోజల్స్ లేవు. తిరస్కారాలు లేవు. ఆ కథ అక్కడితో ముగిసిపోయింది అనుకున్నారు. 

కానీ ఒక రోజు అకస్మాత్తుగా ఆమె నుంచి ఫోన్ వచ్చింది. మొదట కుశల ప్రశ్నలతో మొదలై వీరి పరిచయం మెల్లగా రోజూ మాట్లాడుకునే స్థాయికి చేరాయి. ఇద్దరూ వారి వారి జీవితాల్లో హ్యాపీగా ఉన్నారు. రాహుల్ మాట్లాడకపోతే ఆమెకు ఏదో వెలితిగా అనిపించేది. రాహుల్ పరిస్థితి కూడా అంతే. ఒక రోజు మాట్లాడుకోకపోతే మనసులో ఏదో తెలియని అశాంతి. ఇక్కడ శారీరక సంబంధం లేదు, కేవలం మాటలు మాత్రమే ఉన్నాయి. మరి దీనిని ఏమనాలి?

Continues below advertisement

ఎమోషనల్ అఫేర్ అంటే ఏంటీ?

చాలా మంది తమ భాగస్వామిని మోసం చేయడం అంటే కేవలం శారీరకంగా మరొకరితో దగ్గరవ్వడమే అనుకుంటారు. కానీ ఎమోషనల్ అఫేర్ అంతకంటే ప్రమాదకరమైంది. శారీరక సంబంధం లేకపోయినా, మనసులో ఒక వ్యక్తిపై విపరీతమైన అభిమానం పెంచుకోవడం, తన భాగస్వామితో పంచుకోవాల్సిన రహస్యాలు, భావోద్వేగాలు మరొకరితో పంచుకోవడాన్ని ఎమోషనల్ అఫేర్ అంటారు. 

ఎక్కువగా నోస్టాల్జిక్ బాండింగ్‌లో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అంటే ప్రస్తుతం ఉన్న వ్యక్తితో కంటే, గతంలో మనకు దక్కని ఆ అవకాశం మీద ప్రేమను పెంచుకోవడం అన్నమాట. రాహుల్ కేసులో కూడా అదే జరిగింది. వారు నిజానికి ప్రస్తుత వ్యక్తుల్ని ప్రేమించడం లేదు. తమ యవ్వనాన్ని, ఆనాటి కలలను చెప్పని మాటలను ప్రేమిస్తున్నారు. 

ఇది ఎందుకు జరుగుతుంది? సైకాలజీ ఏం చెబుతుంది?

మనుషుల మెదడు చాలా వింతగా పని చేస్తుంది. మనసులో ఏదైనా పని పూర్తి కాకపోతే అది ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఆనాడు ప్రపోజ్ చేయకపోవడం వల్లనో, లేదా క్లియర్‌గా ఎండ్  కాకపోవడం వల్లనో మెదడు ఆ కథను ఇంకా ఒక అవకాశం ఉందని అనే ఫోల్డర్‌లో భద్రపరుస్తుంది. కొత్తగా ఎవరితోనైనా రహస్యంగా మాట్లాడటం వల్ల మెదడులో డొపమిన్ అనే రసాయనం విడుదలవుతుంది. ఇది ఒక రకమైన కిక్కును , ఆనందాన్ని ఇస్తుంది. అందుకే ఆ వ్యక్తితో మాట్లాడటం ఒక వ్యసనంలా మారుతుంది. ఇంటికి వెళ్తే భార్య లేదా భర్తతో పిల్లల స్కూల్‌ ఫీజులు, పవర్ బిల్లులు, ఇంటి పనులు వంటి రియాల్టీ కనిపిస్తుంది. కానీ పాత ప్రేమతో మాట్లాడితే కేవలం నవ్వులు, జ్ఞాపకాలు, కాలేజీ ముచ్చట్లు మాత్రమే ఉంటాయి. ఈ ఫాంటసీ ప్రపంచం ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంటుంది. 

మేం కేవలం ఫ్రెండ్స్‌ మాత్రమే అనేది భ్రమ

ఇలాంటి బంధాల్లో ఉన్న వారు తరచుగా చెప్పుకునే మాట మేం కేవలం స్నేహితులం మాత్రమే, మా మధ్య ఎలాంటి సంబంధం లేదు' అని చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడే ఒక చిన్న పరీక్ష ఉంది. మీరు సదరు వ్యక్తితో చేసే చాటింగ్ లేదా కాల్స్ గురించి మీ భాగస్వామికి తెలుసా? ఆ ఫోన్ కాల్‌ను స్పీకర్‌లో పెట్టి మీ భార్య లేదా భర్త ముందు మాట్లాడగలరా? అలా చేయలేకపోతున్నారంటే అక్కడ ఎమోషనల్ అఫేర్ మొదలైనట్టే లెక్క.

దీని వల్ల కలిగే నష్టాలేంటీ?

ఇది కేవలం ఒక స్నేహంగా తీసిపారేయలేం. దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మనసు ఇంకొకరి దగ్గర ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్న భాగస్వామితో గడిపే సమయం తగ్గిపోతుంది. భావోద్వేగాలు సరిగా ఉండవు. ఇది మీ భార్యాభర్తల మధ్య గ్యాప్ పెంచుతుంది. నేను తప్పు చేస్తున్నానా అనే అనుమానం మొదలవుతుంది. దీని వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఏ రోజైనా చాట్స్, లేదా కాల్‌ లాగ్స్ బయటపడితే , ఒక్కసారిగా నమ్మకం విచ్చిన్నమవుతుంది. ఇంట్లో తల్లిదండ్రుల మధ్య వచ్చే మార్పులను పిల్లలు త్వరగా గమనిస్తారు. ఇది వారిలో అభద్రతా భావాన్ని పెంచుతుంది. 

లిమరెన్స్ అనేది ప్రేమ కాదు

సైకాలజీ ప్రకారం ఈ స్థితిని లిమరెన్స్ అంటారు. ఆ వ్యక్తి గురించి నిరంతరం ఆలోచించడం రిప్లై ఇవ్వకపోతే విలవిలలాడిపోవడం, ఒక రోజు మాట్లాడకపోతే జీవితం శూన్యం అనిపించడం దీని లక్షణాలు. ఇది నిజమైన ప్రేమ కాదు. కేవలం రసాయనిక రియాక్షన్, పాత జ్ఞాపకాల మిశ్రమం మాత్రమే. 

పరిష్కారం ఏంటీ ?

జీవితంలో పాత జ్ఞాపకాలు పలకరించడం సహజం. కానీ వాటిని ఎలా హ్యాండిల్ చేస్తామన్నదే ముఖ్యం. మీరు ఎందుకు ఆ వ్యక్తి వైపు ఆకర్షితులవుతున్నారో మీ ప్రస్తుత బంధంలో ఏదైనా లోపించిందా అని మీకు మీరు చెక్ చేసుకోవాలి. అవసరమైన వ్యక్తిగత విషయాలు పంచుకోకూడదు. రోజూ మాట్లాడటం మానేయాలి. ఏ విషయాన్ని భాగస్వామికి తెలియకుండా దాచకూడదు. మీ పార్టనర్‌తో గడపడానికి సమయం కేటాయించాలి. మీ జీవితంలో ఏదైనా వెలితి ఉంటే వారితో చర్చించాలి. పాత ప్రేమతో ఇలాంటివి చర్చించకపోవడమే మంచిది. సమస్య చేయిదాటిపోతుందంటే మ్యారేజీ కౌన్సిలర్‌ను కలవడం మంచిది. 

రాహుల్ కథలో ఇంకా పెద్ద ప్రమాదం జరగలేదు. కానీ రిస్క్ మొదలైంది. కొన్ని ప్రేమ కథలు జ్ఞాపకాలుగా ఉంటేనే అందం. మీ మాజీ లవర్‌ కాల్ చేసినప్పుడు ఎత్తే ముందు ఒకసారి ఆలోచించాలి.