వాతావరణం మారినప్పుడు కొంతమంది వ్యాధుల బారిన పడే అవకాశాలు పెరుగుతాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు ఈ సమయంలో త్వరగా ఇన్ఫెక్షన్ బారిన పడతారు. బయటి ఆహారం తినడం వల్ల త్వరగా అనారోగ్యానికి గురవుతారు. వైరల్ ఫీవర్, జలుబు, గొంతు నొప్పి, కడుపు ఇన్ఫెక్షన్, కఫం సమస్య మొదలవుతాయి. ఇంటి నివారణ చిట్కాలతో సింపుల్ గా వీటి నుంచి బయట పడొచ్చు. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఈ మూలికలు చక్కగా పని చేస్తాయి.


అశ్వగంధ


వితనియా సోమ్నిఫెరా అని కూడా పిలుస్తారు. అశ్వగంధ ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే ఒక ప్రసిద్ధ మూలిక. ఇది తరచుగా అడాప్టోజెన్‌గా ఉపయోగించబడుతుంది. ఆరోగ్యాన్ని ఇచ్చే సహజ పదార్థం. వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే వ్యాధుల నుంచి రక్షించే యాంటీ వైరల్ గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. పౌడర్ రూపంలో తీసుకోవచ్చు. కొద్దిగా పంచదారతో పాటు పాలలో అశ్వగంధ పొడి కలుపుకుని తీసుకోవచ్చు. ఉత్తమ ప్రయోజనాలు పొందేందుకు ఈ పాలు రాత్రిపూట తీసుకుంటే మంచిది.


శొంఠి


ఎండిన అల్లం యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్స్ నుంచి మిమ్మల్ని రక్షించడానికి బాగా పని చేస్తుంది. శొంఠి పాలు తాగితే ఎంతటి జలుబు, దగ్గు, కడుపు ఉబ్బరం సమస్య అయినా చిటికెలో తగ్గిపోతుందని నిపుణులు సూచిస్తారు. ఇందులో విటమిన్ ఏ, సోడియం, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్, కాల్షియం, జింక్ ఉన్నాయి. రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేస్తుంది. జింజె రోల్స్, షోగోల్స్ అనే సమ్మేళనాలు ఇందులో ఉన్నాయి. yయాంటీ మైక్రోబయల్ లక్షణాలని కలిగి ఉంటుంది. వైరస్ లతో పోరాడుతుంది.


అర్జున్ బార్క్


అర్జున్ బెరడుని టెర్మినలియా అర్జున అని కూడా పిలుస్తారు. ఇది ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే అద్భుతమైన మూలిక. అర్జున్ చెట్టు బెరడు శతాబ్దాలుగా ఔషధాల్లో ఉపయోగిస్తున్నారు. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, కాపర్, జింక్, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. ఇవన్నీ రోగనిరోధక శక్తిని పెంచడంలో దోహదపడతాయి. దీన్ని తీసుకుంటే జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ లక్షణాలను తగ్గిస్తాయి.


పసుపు


ఎన్నో ఏళ్ల నుంచి పసుపుని ఔషధాల్లో ఉపయోగిస్తున్నారు. భారతీయులు వంటల్లో తప్పనిసరిగా వేసుకుంటారు. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. రోగనిరోధక వ్యవస్థని బాలహీనపర్చే కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్లతో పోరాడుతోంది. వేడి పాలతో కలిపి పసుపుని తీసుకుంటే జలుబు, గొంతు నొప్పి తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.


ఈ వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం కోసం ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. పుచ్చకాయ, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం వంటి వాటిని తీసుకుంటూ మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవాలి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: బరువు తగ్గాలనుకునే వారికి ఈ సీజన్ బెస్ట్ - ఇలా చేశారంటే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది