బరువు పెరిగితే ఎన్ని అనారోగ్యాలు చుట్టుముడతాయో తెలిసిందే. బరువు వల్ల డయాబెటిస్, గుండె సమస్యలు వస్తాయి. ఈ ఆరోగ్య సమస్యలు జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తాయి. కాబట్టి, ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. లేకపోతే.. జీవితాంతం మందులు మింగుతూనే ఉండాలి. కానీ, ఈ రోజుల్లో చాలామందికి వ్యాయమం చేయడానికి కూడా సమయం చిక్కడం లేదు. బిజీ లైఫ్ వల్ల సమయానికి ఆహారం కూడా తీసుకోవడం లేదు. దీనివల్ల చిన్న వయస్సులోనే అనారోగ్యానికి గురవ్వుతున్నారు. ఆఫీసులో ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం వల్ల బరువు కూడా పెరుగుతున్నారు. అయితే, వ్యాయమం చేయడానికి సమయం లేనివారికి, బద్దకస్తులకు ఒక గుడ్ న్యూస్. త్వరలో బరువును తగ్గించే మందు అందుబాటులోకి రానుంది.
తిర్జెపటైడ్ (Tirzepatide) అనే ఇంపెక్షన్‌ను ఇప్పుడు వైద్య నిపుణులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. వారానికి ఒకసారి తిర్జెపటైడ్ ఇంజెక్షన్ తీసుకున్న పెద్దలు ఏడాది వ్యవధిలో తమ శరీరంలో ఐదో వంతు కంటే ఎక్కువ బరువును కోల్పోయారు. సాధారణంగా ఇలాంటి ఫలితాలు స్టెప్లింగ్ సర్జరీ తర్వాత కనిపిస్తాయి. తిర్జెపటైడ్ ఫలితాలు చూసిన వైద్యులు భవిష్యత్తులో ఈ ఔషదం మధుమేహం, ఊబకాయం రోగులకు వరం కానుందని తెలిపారు.
ఇది డయాబెటిస్ మందు, కానీ..: వాస్తవానికి ఇది బరువును తగ్గించే మందు కాదు. డయాబెటిస్ నివారణ కోసం దీన్ని తయారు చేశారు. ఆకలిని నియంత్రించే హార్మోన్లను లక్ష్యంగా చేసుకోని ఈ మందు పని చేస్తుంది. ఫలితంగా ఈ మందు ఆకలిని తగ్గించి, తక్కువ క్యాలరీలు తీసుకొనేలా చేస్తుంది. అయితే, సన్నగా ఉండే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఈ మందును తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు ఎదుర్కొంటారనే భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. అలాగే, ఈ మందు వల్ల దుష్ప్రభావాలు కూడా ఉంటాయని ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’ అధ్యయనం తెలిపింది. తిర్జెపటైడ్ తీసుకొనేవారికి వాంతులు, విరేచనాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
యేల్ యూనివర్శిటీకి చెందిన ప్రధాన పరిశోధకురాలు ప్రొఫెసర్ అనియా జాస్ట్రేబాఫ్ ఇటీవల అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ 82వ సైంటిఫిక్ సెషన్స్‌లో మాట్లాడుతూ.. ‘‘ఊబకాయంతో బాధపడుతున్న పది మందిలో తొమ్మిది మంది టిర్జెపటైడ్ తీసుకోవడం వల్ల బరువు కోల్పోయారు. స్థూలకాయానికి కూడా ఇతర దీర్ఘకాలిక వ్యాధుల తరహాలోనే చికిత్స అందించాలి. ఆ చికిత్సకు టిర్జెపటైడ్ పనిచేస్తుందని ఈ ఫలితాలు నొక్కి చెబుతున్నాయి’’ అని తెలిపారు.
24 కిలోల వరకు బరువు తగ్గిపోయారట: ఈ అధ్యయనంలో 2,539 మంది లావుగా ఉన్న వ్యక్తులు పాల్గొన్నారు. వీరిలో ఎవరికీ మధుమేహం లేదు. అయినా సరే వారిలో కొందరికి ఎక్కువ, మరికొందరికి తక్కువ మోతాదులో టిర్జెపటైడ్‌ను ఇంజెక్ట్ చేశారు. 16 నెలల తర్వాత వారిలో కొందరు 52 పౌండ్ల (సుమారు 24 కిలోలు) వరకు బరువును కోల్పోయారు. కొందరు తమ బరువులో 22.5 శాతాన్ని కోల్పోయారు. టిర్జెపటైడ్‌ను తక్కువ మోతాదులో తీసుకున్న వ్యక్తులు 45 నుంచి 49 పౌండ్ల బరువును కోల్పోయారు. యూకే డ్రగ్స్ నిఘా సంస్థ.. ఊబకాయంతో బాధపడుతున్న 1.3 మిలియన్ల బాధితులకు ఈ మందును ఉపయోగించేందుకు ఆమోదించింది.
మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. టిర్జెపటైడ్ తీసుకున్న వ్యక్తులు 15 నెలల్లోనే బరువును కోల్పోయారు. ఇది వ్యాయామం, ఆహార నియమాలు పాటించడం ద్వారా బరువు తగ్గేవారితో పోల్చితే ఆరు రెట్లు ఎక్కువ. దీని సైడ్ ఎఫెక్ట్స్ కూడా మితంగానే ఉండటం వల్ల బాధితులకు టిర్జెపటైడ్ ఇవ్వడం మంచిదే అనే అభిప్రాయాన్ని వైద్య నిపుణులు వెల్లడించారు. టిర్జెపటైడ్ జీవక్రియ, గుండె ఆరోగ్యం కూడా మెరుగైనట్లు కనుగొన్నారు. అయితే, ఇది ఇంకా ట్రయెల్స్‌లోనే ఉంది. మరిన్ని పరీక్షల తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!
Also Read: పొట్టివాళ్లు గట్టోళ్లా? ఎత్తు పెరిగితే ‘అంగ స్తంభన’ సమస్యలు? తాజా స్టడీలో షాకింగ్ ఫలితాలు
గమనిక: ఈ కథనంలోని అంశాలను కేవలం మీ అవగాహన కోసం అందించాం. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఇలాంటి ఔషదాలను ఉపయోగించే ముందు మీరు తప్పకుండా డాక్టర్ సలహా, సూచనలు పాటించాలి. లేకపోతే అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదు.