కొన్ని విషయాలు బయటివారితో మాట్లాడలేరు. కానీ తెలుసుకోవాలన్న కోరిక మాత్రం ఉంటుంది. అలాంటివారికి గూగుల్ దేవతలా కనిపిస్తుంది. ఎలాంటి ప్రశ్న అడిగినా ఏదో ఒక సమాధానం ఇచ్చి తీరుతుంది గూగుల్. ప్రపంచంలో అధిక శాతం మందికి లైంగిక విషయాల్లో చాలా అనుమానాలు ఉంటాయి. కానీ వాటిని ఎవరిని అడగాలన్నా సిగ్గుపడతారు. అలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది గూగుల్‌ను తరచూ అడిగిన ప్రశ్నలు ఇక్కడ ఇచ్చాము. ఇవి కేవలం అడిగిన వారికే కాదు ఎంతో మందికి ఉపయోగపడేవి. జీవితం సాఫీగా సాగడానికి కలయిక పాత్ర కూడా ఎంతో ముఖ్యమైనదని వైద్యులు వివరించారు. జీవిత భాగస్వాముల మధ్య సాన్నిహిత్యం వారి మధ్య అర్ధంచేసుకునే తత్వాన్ని, సర్దుకుపోయే గుణాన్ని పెంచుతుందని కొంతమంది వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మగవారికి ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని, ప్రమాదాన్ని కలయిక తగ్గిస్తుందని చెబుతున్నారు. ఆ ప్రశ్నలేంటో వాటికి ఎక్కువ మంది వైద్యులు ఇచ్చిన జవాబేంటో చదవండి మరి. 


1. ఆ చర్య ఆరోగ్యానికి మంచిదేనా?
శారీరక, మానసిక ఆరోగ్యంలో ఆ ఆరోగ్యం కూడా ఒక భాగం. ఆ కలయిక మనుషుల మెదడులో ఆనందాన్ని, నొప్పిని, ఒత్తిడిని కంట్రోల్ చేసే రసాయనాలను పెంచుతుంది. జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ కమ్యూనిటీ హెల్త్‌లో జరిపిన ఒక అధ్యయనంలో కలయిక గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంతో సంబంధం కలిగి ఉందని తేలింది. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్‌లోని పరిశోధన క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా  తగ్గిస్తుందని కనుగొంది.


2. రోజూ చేయడం మంచిదేనా?
రెగ్యులర్ కలయిక ప్రక్రియ మంచిదే. అది పూర్తిగా మీరు, మీ జీవితభాగస్వామి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. వారానికి రెండుసార్లు అయితే ఆరోగ్యపరంగాను లాభం ఉంటుంది, మీ సంబంధబాంధవ్యాలు పటిష్టంగా మారుతాయి. 


3. కలయిక పూర్తయ్యాక ఏం చేయాలి?
కలయిక పూర్తయ్యాక కచ్చితంగా మూత్ర విసర్జన చేయమని సలహా ఇస్తున్నారు అంతర్జాతీయ వైద్యులు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు వంటివి కలగకుండా ఉంటాయని చెబుతున్నారు. కలయిక తరువాత యూరిన్ కు వెళ్లడం వల్ల బ్యాక్టిరియా ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని సలహా ఇస్తున్నారు. 


4. గర్భిణిగా ఉనప్పుడు కలయికలో పాల్గొనవచ్చా?
ఇది పూర్తిగా వ్యక్తగతమైన నిర్ణయం. గర్భిణి ఆరోగ్యసమస్యలు, వారి పరిస్థితులను, గర్భం నెలలపై ఆధారపడి ఉంటుంది. వారికి ఇబ్బంది అనిపించనంత వరకు ఎలాంటి సమస్యా ఉండదని అంటున్నారు. 


5. పీరియడ్స్ సమయంలో కలయిక సురక్షితమేనా?
వైద్యులు చెప్పిన ప్రకారం మహిళలకు రుతుక్రమ సమయంలో కలయిక లో పాల్గొనడం వైద్యపరంగా సురక్షితమేనని చాలా అధ్యయనాలు చెప్పాయి. అయితే మానసిక అంశాలు కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. ఆ సమయంలో చాలా మందికి చికాకుగా, కోపంగా ఉంటుంది. కొందరికి అధిక రక్తస్రావం అవుతుంది. కాబట్టి ఇలాంటివారికి ఆ కోరిక రుతుక్రమ సమయంలో కలగడం చాలా కష్టం.


Also read: డెంగ్యూ జ్వరం వస్తే తినాల్సినవి ఇవే, వీటితో సమర్థంగా ఎదుర్కోవచ్చు