ఆవాలు వేయని పులిహోరని ఊహించలేదు. తాళింపు పెట్టాలంటే మొదట వేయాల్సింది ఆవాలే. సాంబార్ నుంచి కూరల వరకు ప్రతి వెజిటేరియన్ వంటకంలోనూ ఆవాలు మొదట నూనెలో వేగాల్సిందే. ఆవాలకు జోడి జీలకర్ర. ఈ రెండూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఆహార పదార్థాలకు మంచి రుచిని ఇస్తాయి. ఎక్కువ మంది ఆవాలకు పెద్దగా ప్రాధాన్యత ఉందని అనుకోరు. నిజానికి ఆవాలలో ఔషధ గుణాలు ఎక్కువ. వీటిని తినడం వల్ల ఎన్నో సమస్యల నుంచి బయట పడవచ్చు.


పోపు దినుసుల్లో ముఖ్యమైనవి ఆవాలు. వీటిని రోజూ తినడం వల్ల మనకు తగిలిన గాయాలు త్వరగా మారడానికి అవకాశం ఉంటుంది. ఆవాలను పొడిలా చేసి ఆ పొడిని గాయాలపై పెట్టడం వల్ల కూడా త్వరగా గాయం నుంచి బయటపడవచ్చు. ఆవాలు తినేవారిలో దంత సమస్యలు కూడా తక్కువగా వస్తాయని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా పంటి నొప్పితో బాధపడేవారు. ఆవాలను మరిగించిన నీటిని తాగడం లేదా పుక్కిలించి ఉమ్మడం వంటివి చేస్తే మంచిది. పంటి నొప్పి త్వరగా తగ్గుతుంది. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి కూడా ఆవాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఆయుర్వేదంలో ఆవాలు స్థానం ప్రధానమైనది.


చాలామంది కీళ్ల నొప్పుల బారిన పడతారు. దీని కారణంగా నడవలేకపోతూ ఉంటారు. అలాంటి వారు ఆవాలతో ఉపశమనం పొందొచ్చు. ఒక టీ స్పూన్ ఆవాల పొడి, కర్పూరం కలిపి మెత్తని పొడిలా చేయాలి. కాస్త నీళ్లు కలిపి పేస్టులా చేసి కీళ్లనొప్పులు వస్తున్నచోట రాయాలి. ఇలా రాయడం వల్ల నొప్పి త్వరగా తగ్గుతుంది. అలాగే ఆవపిండితో చేసిన ఆహారాన్ని తినేందుకే ప్రయత్నించాలి. ఆవపిండి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల శరీరం వైరస్, బ్యాక్టీరియాలతో పోరాడే శక్తిని పొందుతుంది. జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా ఆవ పిండి త్వరగా బయటపడేలా చేస్తుంది.


గజ్జి, తామర వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఆవాలను వినియోగించవచ్చు. ఆవాలు కాస్త నీళ్లు వేసి మెత్తటి ముద్దలా నూరి ఆ మిశ్రమాన్ని గజ్జి, తామర వచ్చిన చోట పూయాలి. ఇలా తరచూ చేస్తే కచ్చితంగా నయం అవుతాయి. ఆవనూనెను శరీరం అంతా రాసుకొని కాసేపు ఎండలో కూర్చుంటే రికెట్స్ వ్యాధి తగ్గిపోతుంది. ఫుడ్ పాయిజన్ వల్ల పొట్టలో తిప్పుతున్నట్టు అనిపిస్తుంటే ఒక స్పూను ఆవపిండిని నీళ్లలో కలుపుకొని తాగేయాలి. ఇలా చేయడం వల్ల పొట్టలో ఉన్న ఆహారం వాంతి రూపంలో బయటికి వచ్చేస్తుంది. దీనివల్ల పొట్ట ప్రశాంతంగా ఉంటుంది.



Also read: దానిమ్మ తొక్కలు పడేస్తున్నారా? వాటితో అందాన్ని ఇలా పెంచేయొచ్చు


Also read: ముందు రోజే చపాతీ, పూరి పిండిని కలిపి నిల్వ చేయడం మంచిదేనా?









































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.