ఏవండోయ్ ఇది విన్నారా? మనిషి మెదడు క్రమేనా పెరుగుతోందట. మరి, ఇది మానవ మనుగడకు మంచిదేనా? ఆరోగ్యానికి మేలు చేస్తుందా? కీడు చేస్తుందా? ఇవన్నీ తెలియాలంటే.. తాజా అధ్యయనంలో పేర్కొన్న విషయాలు గురించి తెలుసుకోవల్సిందే.


ఒక అధ్యయనంలో మెదడులోని గ్రేమ్యాటర్, వైట్ మ్యాటర్, హిప్పోకాంపస్ లు విస్తరించడాన్ని గుర్తించారు. ఇది జ్ఞాపకశక్తి, కొత్త విషయాలను నేర్చుకోవడం వంటి ప్రక్రియలకు కారణమయ్యే మెదడులోని ఒక భాగమట. దానివల్ల మనిషికి మేలు జరుగుతుందా? కీడు జరుగుతుందా అనేది తెలుసుకొనే ప్రయత్నంలో పరిశోధకులు ఉన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ పరిణామం తప్పకుండా మేలు చేసేదేనని తేలింది.


ఇటీవల మానవ మస్తిష్కం గురించి జరిగిన పరిశోధనల్లో మెదడు క్రమంగా విస్తరిస్తున్నట్టు గమనించారట. ఇలా విస్తరిస్తున్న మెదడు వయసు ప్రభావంతో వచ్చే మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలను నివారిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 1930లలో జన్మించిన వారితో పోలిస్తే 1970 లలో జన్మించిన వ్యక్తుల మెదడు పరిమాణం, ఉపరితల వైశాల్యంలో గణనీయమైన పెరుగుదలను సూచించే ఆనవాళ్లు ఉన్నట్టు ఈ పరిశోధకులు చెబుతున్నారు.


మార్చి నెలలో జామా న్యూరాలజీ పరిశోధనలు మెదడు పరిమాణంపై జన్యువుల ప్రభావాన్ని కూడా వివరిస్తోంది. ఇవే కాకుండా ఇతర ఆరోగ్య అంశాలు, సామాజిక స్థితి గతులు, సంస్కృతి, విద్య వంటి అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని.. వీటి ప్రభావం మెదడు విస్తరణపై ఎలా ఉందనే విషయాలను పరిశీలించారు.


ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన న్యూరాలజీ ప్రొఫెసర్ చార్లెస్ డికార్లీ తెలిపిన వివరాలు ప్రకారం.. మెదడు పరిమాణం జెనెటిక్స్ మీదే ఎక్కువగా  ఆధారపడి ఉంటుందట. అయితే ఇతర బాహ్య కారకాల ప్రభావం కూడా ఉండవచ్చని పేర్కొన్నారు. స్టడీలో భాగంగా ప్రేమింగ్ హామ్ హార్ట్ స్టడీ నుంచి సేకరించిన కొన్ని తరాలకు చెందిన వ్యక్తుల మెదడు స్కానింగ్ రిపోర్టులను పరిశీలించారు.


1925 నుంచి 1968 మధ్య పుట్టిన వ్యక్తుల మెదడు ఎంఆర్ఐ స్కాన్‌‌లను విశ్లేషించిన పరిశోధకులు మెదడు పరిమాణం, ఉపరితల వైశాల్యం పెరగడాన్ని గమనించారు. 1970 లలో జన్మించిన వారి మెదడు పరిమాణం.. 1930ల్లో జన్మించిన వారితో పోలిస్తే 6.6 శాతం ఎక్కువ వ్యాల్యూమ్ కలిగి ఉన్నట్టు గుర్తించారు. ఇక మెదడు ఉపరిత వైశాల్యం 15 శాతం పెరిగిందట. అంతేకాదు మెదడులోని గ్రేమ్యాటర్, వైట్ మ్యాటర్, హిప్పోకాంపస్ లో గణనీయమయిన విస్తరణ జరిగిందట. ఇది జ్ఞాపకశక్తికి సంబంధించిన మెదడు భాగం కనుక వయసు ప్రభావంతో వచ్చే మతిమరుపు, అల్జీమర్స్ వంటి వాటిని నివారించగలదని అభిప్రాయపడుతున్నారు. మెదడులోని పెద్ద భాగంలో విస్తరణ జరగడం వల్ల.. వయసు ప్రభావం వల్ల కలిగే న్యూరోడీజనరేటివ్ సంబంధిత మతిమరుపు, అల్జీమర్స్ నుంచి సహజంగా రక్షణ లభించవచ్చని భావిస్తున్నారు.


Also read : Eye care tips: వేసవిలో ఒళ్లే కాదు.. కళ్లు కూడా జర భద్రం - ఈ పనులు అస్సలు చేయొద్దు, ఈ చిట్కాలు పాటించండి





గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.