టాటూలు అనగానే పాశ్చాత్య సంస్కృతి అనుకుంటారు ఎందరో. కానీ ప్రపంచంలోని చాలా దేశాల్లో టాటూలు అంగీకారం కావు. కొన్ని దేశాల్లో వాటిపై నిషేధం విధించారు. టాటూలు వేయించుకున్న విదేశీయులు కనిపించినా వారికి నచ్చదు. దీనికి ఎన్నో మతపరమైన, సాంస్కృతికపరమైన కారణాలను చూపెడుతున్నాయి ఆయా దేశాలు. మీకు పచ్చబొట్టుందా? అయితే ఈ దేశాలకి వెళ్లేటప్పుడు ఆ పచ్చబొట్టు కనిపించకుండా చేసే దుస్తులు వేసుకుంటే ఉత్తమం. కొన్నిదేశాల్లో పచ్చబొట్టుతో కనిపించినవారిని చాలా చిన్నచూపు చూస్తారు. వారికి విలువివ్వరు. చీదరించుకుంటారు. ఆ దేశాలేమిటో మీరే చూడండి..
జపాన్
ఈ దేశంలో పచ్చబొట్టు చట్ట విరుద్ధం కాదు కానీ, ఆ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం టాటూ కనిపిస్తే తరిమికొడతారు. తమ ప్రాంతంలో అడుగుపెట్టనివ్వరు. జిమ్‌లు, బాత్ హౌస్లు, హోటళ్లు, బార్‌లు, రిసార్ట్ లలోకి వారికి అనుమతి ఇవ్వరు. బయట బోర్డులు కూడా పెడతారు. అయితే పచ్చబొట్టను తాత్కాలిక స్టిక్కర్లతో కప్పేసి వెళ్లచ్చు. 1872లో జపాన్లో టాటూలపై నిషేధం ఉండేది. ఆ తరువాతి కాలంలో ఎత్తివేశారు.
వియత్నాం
వియత్నాంలో టాటూల వేయించుకున్నవారికి విలువుండదు. సమాజంలో వారిని చాలా చిన్నచూపు చూస్తారు. పచ్చబొట్టు వేయించుకోవడం, అలాంటి పనిలో ఉండడం కూడా చట్టవిరుద్ధం. టాటూలు వేయించుకున్నవారికి నేరపూరిత లక్షణాలున్నట్టు భావిస్తారక్కడ.
టర్కీ
మతపరమైన కారణాల రీత్యా ఇక్కడ కొన్ని మతాల వారు టాటూలపై నిషేధం విధించారు. టర్కీప్రభుత్వం అధీనంలో ఉన్న ‘టర్కీస్ రెలిజియస్ ఎఫైర్స్ డైరెక్టరేట్’ టాటూలు వేయించుకున్న ముస్లింలను శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించుకోవాలని ఆదేశించింది. విద్యార్ధులకు మేకప్, టాటూలు వేయాడాన్ని టర్కీ ప్రభుత్వం నిషేధించింది. టర్కీ పాశ్చాత్యదేశమే అయినప్పటికీ ఇలాంటి నిషేధాలు విధించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇరాన్
ఈ దేశంలో పచ్చబొట్టు పూర్తిగా చట్ట విరుద్ధం. ఇరాన్ ప్రభుత్వం టాటూలు వేయించుకోవడం కేవలం దొంగల ఆచారమని ప్రకటించింది. టాటూలు ఆరోగ్యకరమని కూడా చెప్పింది. టాటూలతో ఎవరైనా కనిపిస్తే జరిమానాలు వేయడం కొన్ని నెలలుగా అక్కడ జరుగుతోంది. అరెస్టు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పచ్చబొట్టు చట్టాన్ని ఉల్లంఘిస్తే అరెస్టు చేసి నేరస్థులుగా ముద్రవేసి, బహిరంగంగా వీధుల్లో ఊరేగిస్తారు. అందుకే ఇరాన్లో మీకు టాటూతో ఎవరూ కనిపించదు.
ఉత్తరకొరియా
సోషలిస్టు దేశమైన ఉత్తరకొరియాలో టాటూలపై నిషేధం లేదు. కానీ ఏ పదాన్ని టాటూగా వేయించుకుంటున్నారు, ఎలాంటి బొమ్మలు వేయించుకోవాలి అన్నదానిపై మాత్రం నియంత్రణ ఉంది. నచ్చింది పచ్చబొట్టు పొడిపించుకునే హక్కు ఎవరికీ లేదు. ప్రభుత్వ ఆమోదం పొందినవి మాత్రమే వేయించుకోవాలి. ‘లవ్’ అనే పదాన్ని టాటూగా వేయించుకోవడంపై కొంతకాలం పాటు నిషేధించారు. ఈ మధ్యనే నిషేధాన్ని ఎత్తివేశారు. ‘డిఫెన్స్ ఆఫ్ ది మదర్ ల్యాండ్’, ‘గార్డ్ ద గ్రేట్ లీడర్ టు అవర్ డెత్’... ఈ రెండు ఉత్తరకొరియా ప్రభుత్వ ఆమోదం పొందినవి. ఇవే అక్కడ యువత అధికంగా వేయించుకునే టాటూలు.
దక్షిణ కొరియా
ఎవరు పడితే వారు టాటూలు వేయడానికి వీల్లేదు ఈ దేశంలో. కేవలం లైసెన్స్ పొందిన వైద్యులు మాత్రమే పచ్చబొట్టు వేసేందుకు వీలు కల్పించింది దక్షిణ కొరియా ప్రభుత్వం. ప్రజలను కాపాడేందుకే ఈ చట్టాన్ని పెట్టినట్టు చెప్పింది.
దుబాయ్
చట్టాలు కఠినంగా అమలు చేసే దేశం దుబాయ్. ఇక్కడ కూడా టాటూ నిషేధం. ఒకవేళ వేయించుకున్నా కూడా బహిరంగంగా బయటికి కనిపించనివ్వకూడదు. విదేశీయులను ఏమీ అనరు కానీ, స్వదేశీయులు పచ్చబొట్టు కనిపించేలా బయటికి వస్తే మాత్రం జరిమానా తప్పదు. అయితే విదేశీయుల పచ్చబొట్ట అభ్యంతరకరంగా ఉంటే మాత్రం వారిపై జీవితకాలం నిషేధం ఉంటుంది. వారు దుబాయ్ లో మళ్లీ అడుగుపెట్టలేరు.
Also read: థైరాయిడ్ సమస్య ఉందా? అయితే రోజుకో కొబ్బరి ముక్క తినాల్సిందే
Also read: వేసవిలో కుటుంబంతో విహరించేందుకు చల్లని డెస్టినేషన్‌లు ఇవిగో, ట్రిప్ అదిరిపోవడం ఖాయం