Healthy Sponge Dosa Recipe : ఉదయాన్నే టేస్టీగా, హెల్తీగా బ్రేక్​ఫాస్ట్​గా చేయాలనుకుంటే స్పాంజ్ దోశలను ట్రై చేయండి. వీటిని తయారు చేసుకోవడం కోసం మినపప్పు, బియ్యం నానబెట్టాల్సిన అవసరం లేదు. కేవలం మీ దగ్గర 20 నిమిషాల సమయం ఉంటే.. కావాల్సిన పదార్థాలు అందుబాటులో ఉంటే టేస్టీగా ఈ స్పాంజ్ దోశలు రెడీ చేసుకోవచ్చు. తక్కువ సమయంలో చేసుకోగలిగే ఈ హెల్తీ, టేస్టీ స్పాంజ్ దోశలను ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

కావాల్సిన పదార్థాలు

అటుకులు - 1 కప్పు

రవ్వ - 1 కప్పు

పెరుగు - అరకప్పు

నీళ్లు - కప్పు

ఉప్పు - రుచికి తగినంత 

పంచదార - 1 టీస్పూన్

బేకింగ్ సోడా - అర టీస్పూన్

క్యారెట్ -1 

బీన్స్ - 5 

పచ్చి బఠాణీ - 1 టేబుల్ స్పూన్

క్యాప్సికం - సగం

అల్లం - అంగుళం

పచ్చిమిర్చి - 2

నెయ్యి - దోశలకు సరిపడా

తయారీ విధానం

ముందుగా అటుకులను ఓ పది నిమిషాలు నానబెట్టుకోవాలి. అనంతరం నీటిని తీసేసి బ్లెండర్​లో అటుకులు వేయాలి. ఇప్పుడు దానిలోనే రవ్వ, పెరుగు, కప్పు నీళ్లు కూడా వేసి బాగా గ్రైండ్ చేయాలి. పిండి మెత్తగా కాకుంటే మరిన్ని నీళ్లు వేసి.. మరొక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. పిండి స్మూత్​గా, దోశలకు వేయగలిగేలా వస్తే ఆపేయాలి. ఇప్పుడు ఈ పిండిని ఓ మిక్సింగ్ బౌల్​లోకి తీసుకుని పదిహేను నిమిషాలు పక్కన ఉంటేయాలి. 

ఇప్పుడు క్యారెట్, బీన్స్, పచ్చి బఠాణీ, క్యాప్సికం, అల్లం, పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకోవాలి. లేదంటే మిక్సీలో వేసి ఒక్కసారి తిప్పితే అన్ని పేస్ట్​గా కాకుండా కాస్త కచ్చాపచ్చాగా ఉండేలా చూసుకుని దించేసుకోవాలి. ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత పిండిలో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. దానిలో ఉప్పు, పంచదార, బేకింగ్ సోడా వేసుకుని అన్ని మిక్స్​ అయ్యేలా బాగా కలుపుకోవాలి. 

నాన్​స్టిక్​ పాన్ తీసుకుని స్టౌవ్ వెలిగించి దానిపై పెట్టాలి. ఇప్పుడు కాస్త నెయ్యి అప్లై చేసి.. పిండిని దోశలుగా వేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా.. మరీ మందంగా కాకుండా వేసుకోవాలి. ఇప్పుడు దానిపై మూతపెట్టి 2 నుంచి 3 నిమిషాలు మంటను తగ్గించి ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి.. దోశను మరోవైపు తిప్పాలి. ఇలా రెండు వైపులా గోల్డెన్ రంగులో మారేవరకు వండుకోవాలి. అంతే టేస్టీ, హెల్తీ స్పాంజ్ దోశలు రెడీ. దీనిని మీకు నచ్చిన చట్నీతో లాగించేయవచ్చు. దీనిలోని పదార్థాలు ఆరోగ్యానికి కూడా ఇవి మంచి ఫలితాలు ఇస్తాయి.