రోజుల్లో వయస్సు తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ వెంటాడుతోన్న సమస్య.. గుండెనొప్పి. ఇటీవల కొందరు వ్యాయామం చేస్తూ అకస్మాత్తుగా కార్డియక్ అరెస్టుకు గురవ్వుతున్నారు. అయితే, అకస్మాత్తుగా వచ్చే ఈ కార్డియక్ అరెస్టును ముందుగా గుర్తించడం కొంచెం కష్టమే. అది మనం అప్పటికప్పుడు చేసే పనులు, ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. అయితే, కొందరిలో భవిష్యత్తులో వచ్చే గుండె నొప్పి ముప్పును ముందుగానే గుర్తించవచ్చు. సరిగ్గా నెల రోజులకు ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వాటిని గుర్తించి ముందుగానే డాక్టరును కలిస్తే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. 


గుండెపోటు అనేది తీవ్రమైన సమస్య. దీన్ని ఎంత త్వరగా గుర్తించి చికిత్స పొందితే అంత మంచిది. ఎందుకంటే.. దీని లక్షణాలు కూడా సాధారణం కంటే వేగంగా కనిపిస్తాయి. వాటిపై అవగాహన ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందవచ్చు. గుండె నొప్పికి ముందు చాలా మందికి తలతిరగడం ప్రధాన సంకేతంగా ఉన్నట్లు వైద్యు నిపుణులు చెబుతున్నారు. అయితే, గుండె నొప్పికి నెల రోజుల ముందే ఏడు లక్షణాలు బయటపడతాయట. వాటిని మీరు గుర్తించగలిగి వైద్య పరీక్షలు చేయించుకుంటే తప్పకుండా ప్రాణాలతో ఉంటారు. అర్కాన్సాస్ విశ్వవిద్యాలయం నిపుణుల అధ్యయనం ప్రకారం.. గుండెపోటుకు గురైన 90 శాతం మంది నెల రోజుల కంటే ముందు అసాధారణ లక్షణాలను కలిగి ఉన్నట్లు తెలుసుకున్నారు. వారిలో కామన్‌గా కనిపించిన ఆ ఏడు లక్షణాలు మీలో కూడా ఉన్నాయేమో చూడండి. 


ఈ ఏడు లక్షణాలు మీలో కనిపిస్తే జాగ్రత్త


❤ సరిగ్గా నిద్ర పట్టకపోవడం (48 శాతం గుండెపోటు బాధితులు ఈ సమస్యను ఎదుర్కొన్నారు)
❤ శ్వాస ఆడకపోవడం (42 శాతం)
❤ అజీర్ణం (39 శాతం)
❤ ఆందోళన (35.5 శాతం)
❤ చేతులు లేదా కాళ్లు బలహీనంగా ఉండటం లేదా భారంగా మారడం(24.9 శాతం)
❤ ఆలోచనలో మార్పులు (23.9 శాతం)
❤ ఆకలి లేకపోవడం (21.9 శాతం)


వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణంగా ఛాతి నొప్పి లేదా గుండె పోటుకు ముందు ఛాతిలో నొప్పిగా ఉంటుంది. ఛాతి భారంగా ఉన్నట్లు అనిపిస్తుంది. గుండె కవటానికి తగినంత ఆక్సిజనేటెడ్ రక్తం అందకపోతేనే ఇలా జరుగుతుంది. ఈ సమస్య క్రమేనా గుండె పోటుకు దారితీయొచ్చు. అదే సమయంలో మన కాళ్లు, చేతుల్లో నొప్పి లేదా బలహీనత కూడా ఉండవచ్చు. కొందరి గుండె దడ ఎక్కువగా ఉంటుంది. వారు తప్పకుండా డాక్టర్‌ను కలవాలి. గుండెకు ఆక్సిజన్ తగ్గినప్పుడు చెమటలు పట్టడం, మైకంగా ఉండటం, మూర్ఛ, అలసట ఇలా వివిధ రకాలుగా శరీరం సంకేతాలు ఇస్తుంది. మీకు గానీ, మీ కుటుంబ సభ్యులకు గానీ అలా ఉంటే వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లండి. ఆలస్యం చేస్తే ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది.  


కాలి వేళ్లు నీలంగా మారవచ్చు: గుండె నొప్పికి ముందు కొందరిలో అవయవాలు వాపు కనిపిస్తుంది. కాలు లేదా వేళ్లు నీలం రంగులోకి మారతాయి. మరికొందరిలో ఊపిరి ఆడకపోవడం, వెన్ను నొప్పి, దవడ నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. హార్ట్ ఎటాక్ సమయంలో ఛాతీ నొప్పి అత్యంత సాధారణ లక్షణం. అయితే, ఊపిరి ఆడకపోవడం, అనుభూతి లేదా అనారోగ్యం మరియు వెన్ను లేదా దవడ నొప్పి వంటివి కూడా ఏర్పడవచ్చు. 


హృదయ సంబంధ వ్యాధులు రెండు రకాలు. ఒకటి గుండెను ప్రభావితం చేసే పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. దాన్నే 'కార్డియో' అంటారు. రెండోది ధమనులు లేదా సిరలు వంటి రక్తనాళాలను ప్రభావితం చేసే పరిస్థితులను సూచించే ‘వాస్కులర్’. రక్తనాళాలు ఇరుకుగా మారినా, ఏమైనా అడ్డుపడినా గుండె నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. గుండె లేదా మెదడుకు ఆక్సిజన్‌ అందకపోతే.. గుండెపోటు లేదా స్ట్రోక్‌ ఏర్పడవచ్చు.  


అసలు గుండె పోటు ఎందుకు వస్తుంది?


బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ (BHF) డేటా ప్రకారం.. UKలో మొత్తం మరణాలలో నాలుగింట ఒక వంతు గుండె, రక్త ప్రసరణ వ్యాధుల వల్ల సంభవిస్తున్నాయి.  కార్డియోవాస్కులర్ డిసీజ్ (CVD)కి ప్రధాన కారణం ధూమపానమే. ఆ తర్వాత అధిక బరువు, అతిగా మద్యం సేవించడం, మధుమేహం వంటి జీవక్రియ సమస్యలు కూడా కారణమవుతున్నాయి. అధిక ఒత్తిడి అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ఇది CVDకి కారణమతుంది. గుండె జబ్బు ప్రమాదాలు ఎక్కువగా నల్లజాతి లేదా దక్షిణాసియా జాతి ప్రజలకే ఎక్కువని గత పరిశోధనలు వెల్లడించాయి. కాబట్టి, ప్రతి ఒక్కరికి గుండెపోటు, కార్డియక్ అరెస్టుపై అవగాహన ఉండాలి. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో అందించే CPRను కూడా నేర్చుకోవాలి. 


Also Read: పొట్టిగా ఉన్నామని ఫీలవుతున్నారా? ఆ వయస్సు దాటి తర్వాత కూడా హైట్ ఎదగొచ్చట, ఇదిగో ఇలా..


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.