Homemade Mango Lassi Recipe for Hot Summer : వేసవిలో మామిడిపండ్లు ఎంత తిన్నా తనివి తీరదు. అందుకే వీటిని నేరుగా తినడంతో పాటు వివిధ రకాల వంటకాలుగా చేసుకుని ఆస్వాదిస్తారు. అలాంటివాటిలో మ్యాంగో లస్సీ కూడా ఒకటి. సరిగ్గా చేసుకోవాలే కానీ.. దీని రుచి అమోఘంగా ఉంటుంది. సమ్మర్లో వేడి నుంచి ఉపశమనం కోసం.. చల్లగా, మ్యాంగో ఫ్లేవర్‌తో ఏదైనా ఆస్వాదించాలనుకుంటే మ్యాంగో లస్సీ పర్ఫెక్ట్ ఆప్షన్. మరి దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
మామిడి పండ్లు - 2
జీడిపప్పు - గుప్పెడు
పాలు - 350 మిల్లీ లీటర్లు
పెరుగు - అర లీటర్
పంచదార - దాదాపు కప్పు
మ్యాంగో ఎసెన్స్ - పావు టీస్పూన్
ఐస్ క్యూబ్స్ - 20
తయారీ విధానం
ముందుగా బాగా పండిన మామిడి పళ్లు తీసుకుని వాటిపైన తొక్క తీసి.. ముక్కలుగా చేసుకోవాలి. వాటిని డీప్ ఫ్రీజర్లో పెట్టాలి. జీడిపప్పును నీళ్లలో నానబెట్టుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్. టేస్టీగా లస్సీ తాగాలనుకునేవారు దీనిని యాడ్ చేసుకోవచ్చు. అరగంట తర్వాత పంచదార తీసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తటి పొడిగా చేసుకోవాలి.
బ్లెండర్ తీసుకుని.. దానిలో చల్లని పాలు, ఫ్రీజర్లో నుంచి తీసిన మామిడి ముక్కలు, 20 ఐస్ క్యూబ్స్, పంచదార పొడి, మ్యాంగో ఎసెన్స్ వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. మ్యాంగో ఎసెన్స్ వేసుకుంటే లస్సీ మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు అర లీటర్ పెరుగు కూడా దానిలో వేసుకోవాలి. మరోసారి బాగా బ్లెండ్ చేసుకోవాలి. అంతే టేస్టీ, చల్లటి మ్యాంగో లస్సీ రెడీ.
మ్యాంగో లస్సీ సర్వ్ చేసుకునేప్పుడు నానబెట్టుకున్న జీడిపప్పు పలుకులు, కొన్ని మామిడి పండ్ల ముక్కలు వేసుకుని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. మరింత చల్లగా తాగాలనుకునేవారు దీనిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని కాసేపటి తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోగలిగే ఈ సమ్మర్ రెసిపీని మీరు కూడా ఈ వేసవిలో ట్రై చేసేయండి. పైగా దీనిని పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ ఇష్టపడతారు. కానీ మధుమేహం ఉన్నవారు దీనికి దూరంగా ఉంటే మంచిది. లేదా చాలా తక్కువ మోతాదులో తీసుకోవచ్చు.
