ఆధునిక జీవితంలో ఆల్కహాల్ తాగడం కూడా ఒక భాగమైపోయింది. ఇప్పుడు ఆడా మగా తేడా లేకుండా తాగేస్తున్నారు. కానీ తాగని వారితో పోలిస్తే రోజూ ఆల్కహాల్ తాగేవారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం 35 శాతం ఎక్కువని చెబుతోంది ఓ కొత్త అధ్యయనం. ఆ పరిశోధన ప్రకారం రోజులో ఒకటి లేదా రెండు సార్లు తాగేవారికి స్ట్రోక్ వచ్చే అవకాశం పది నుంచి 15 శాతం పెరుగుతుంది. అదే నాలుగు సార్లు తాగేవారికి రిస్క్ 35 శాతం పెరుగుతుంది. అందుకే తాగడం మానేయమని లేదా కనీసం తగ్గించుకోమని చెబుతున్నారు పరిశోధకులు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు చేసిన పరిశోధనలో రోజూ సగం వైన్ బాటిల్ తాగే వారికి కూడా స్ట్రోక్ వచ్చే అవకాశం 38  శాతం ఉన్నట్టు బయటపడింది. 


బ్రెయిన్ స్ట్రోక్ ఎప్పుడొస్తుంది?
మెదడుకు రక్త ప్రసరణ సరిగా జరగనప్పుడు, మధ్యలో ఆటంకాలు ఏర్పడినప్పుడు స్ట్రోక్ వస్తుంది. ఇది చాలా ప్రాణాంతకమైన పరిస్థితి. ధూమపానం, మద్యపానం లాంటి వ్యసనాలు ఈ పరిస్థితిని మరింతగా పెంచుతాయి. నలభై ఏళ్లు దాటిన వారికి ముప్పు మరింత ఎక్కువ.


పదేళ్ల కష్టం...
ఈ పరిశోధన కోసం యూకే, చైనా పరిశోధకులు పదేళ్ల పాటూ కష్టపడ్డారు. ఆ కాలంలో అయిదు లక్షల మందిని పరిశోధించారు. ఆల్కహాల్ తాగడం అలవాటున్న వారిలో 16 శాతం మంది పురుషులు, 20 శాతం మంది మహిళలు జీవితంలో ఒక్కసారైనా స్ట్రోక్ బారిన పడినట్టు గుర్తించారు. ఆల్కహాల్ తాగడం అన్నది బ్రెయిన్ స్ట్రోక్ తో బలంగా ముడిపడి ఉన్న అంశంగా పరిశోధకులు చెబుతున్నారు. కేవలం స్ట్రోక్ మాత్రమే కాదు, ఊబకాయం, కాలేయ సమస్యలు, హైపర్ టెన్షన్, డయాబెటిస్... ఇలాంటి రోగాలన్నీ సులువుగా దాడి చేస్తాయని తేల్చారు. 


బీర్, వైన్ కూడా ప్రమాదమే...
ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఒకరు మాట్లాడుతూ వైన్, బీర్ వల్ల ప్రయోజనాలు ఉన్నాయని, వీటివల్ల స్ట్రోక్ రాదని చెప్పే వాదనలకు ఎలాంటి రుజువులు లేవని చెప్పారు. కాబట్టి ఒక మనిషి మద్యపానం ఎంత ఎక్కువ చేస్తే, అంత ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్ తో పాటూ ఇతర రోగాలు వచ్చే ఛాన్సు పెరుగుతుందని తెలిపారు. సురక్షితమైన ఆల్కహాల్ అంటూ ఏదీ లేదని, దాన్ని మానేయడమే మంచిదని సూచిస్తున్నారు. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Also read: కోవిడ్ తరువాత పెరుగుతున్న కోపం... ఇలా తగ్గించుకోండి


Also read: వంటనూనెల్లో ఏది మంచిది? ఏ నూనె ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?


Also read:  డయాబెటిస్ రోగులు కూడా హ్యాపీగా తినొచ్చు... తింటే ఎన్ని లాభాలో


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి