55 ఏళ్ల మర్ఫీ అనే వ్యక్తికి ఏం తిన్నా.. అది పాడైపోయిన పదార్థం మాదిరిగానే అనిపించేది. అప్పుడే వండిన తాజా ఆహారాన్ని వడ్డించినా పాడైపోయిన వాసన వస్తోందని పదే పదే కంప్లైంట్ చేసేవాడు. లోపం ఆహారంలో ఉందా? తనలో ఉందా అని తెలుసుకోడానికి డాక్టర్లను సంప్రదించాడు. చాలా రకాల పరీక్షలు కూడా చేయించాడు. చివరకు ప్రాణాంతక క్యాన్సర్ వల్ల అలా జరుగుతోందని తేలింది.
అదెలా సాధ్యం?
మర్ఫీ ఈ విచిత్రమైన పరిస్థితి రకరకాల పరీక్షల అనంతరం టెర్మినల్ స్టమక్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు నిర్ధారణ జరిగింది. అంతేకాదు కడుపులో ఉన్న క్యాన్సర్ ట్యూమర్ కు చిల్లులు పడ్డాయని, వెంటనే దాన్ని తొలగించాలని అత్యవసరంగా సర్జరీ చేశారు. అప్పటికే చాలా ఆలస్యమైంది. పొత్తి కడుపులో ఇన్ఫెక్షన్ తో పాటు, క్యాన్సర్ లివర్ కు కూడా వ్యాపించిందని తెలిసింది. ఇక దానికి చేసే చికిత్స ఏమీ లేదని డాక్టర్లు చేతులు ఎత్తేశారు.
ఆహారం రుచిగా అనిపించకపోవడం కేవలం టేస్ట్ బడ్స్ కు సంబంధించిన విషయం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అది వికారం, కడుపు నొప్పి నుంచి క్యాన్సర్ వరకు దేనికైనా కారణం కావచ్చు. ఆహారం రుచిగా అనిపించకపోవడం అనే అసౌకర్యం ఒక వ్యక్తి జీవితాన్నే హరించే కారణమయ్యింది. టెర్మినల్ స్టమక్ క్యాన్సర్ తో బాధపడుతుండడం వల్ల ఇలాంటి లక్షణాలు కనిపించాయట. మొదట ఆహారం దుర్వాసనగా అనిపించడంతో మొదలై నెమ్మదిగా రోజులు గడిచేకొద్ది పొత్తి కడుపులో నొప్పి రావడాన్ని గమనించాడు మర్ఫీ. తర్వాత మెల్లిగా ఆకలి మందగించడం మొదలైంది. ఈ లక్షణాలకు కారణాన్ని నిర్ధారించడంలో జరిగిన జాప్యం వల్ల అతడిలో క్యాన్సర్ ముదిరిపోయి జీవితం చరమాంకానికి చేరింది.
కడుపులో క్యాన్సర్ అంటే జీర్ణాశయ పరిసర భాగాల్లో క్యాన్సర్ కణితి ఏర్పడటం. ఇది క్యాన్సరేనా నిర్ధారించుకోవడంలో కొంత గందరగోళం ఏర్పడవచ్చు. ఎందుకంటే చాలా సాధారణ జీర్ణసంబంధ లక్షణాలను పోలి ఉంటాయి ఈ కాన్సర్ లక్షణాలు.
క్యాన్సర్ లక్షణాలు
☀ అనారోగ్యంగా అనిపించడం
☀ ఆహారం మింగడంలో ఇబ్బంది
☀ ఆసిడ్ రిఫ్లక్సెస్
☀ గుండెల్లో మంటగా ఉండడం
☀ అజీర్ణం
☀ కడుపులో మంట
☀ త్వరగా కడుపునిండిన భావన
☀ కడుపులో ఏదో బరువుగా ఉన్న భావన
☀ నీరసంగా అనిపించడం
☀ కడుపుపై భాగంలో నొప్పి
☀ ఆకలి మందగించడం
☀ కారణం లేకుండా బరువు తగ్గడం
ఈ లక్షాణాల్లో అన్నీ ఉండొచ్చు. లేదా కొన్ని ఉండొచ్చు. అయితే ఈ లక్షణాలన్నీ సాధారణ జీర్ణసంబంధ అనారోగ్యాల్లో కూడా కనిపిస్తుంటాయి. సాధారణ ఇబ్బందులు క్యాన్సర్ కు భిన్నంగా ఉంటాయి. క్యాన్సర్ లో కొన్ని లక్షణాలు అదనంగా ఉంటాయి. వాటి గురించిన అవగాహన కలిగి ఉంటే క్యాన్సర్ ఉందేమో అని త్వరగా అనుమానించేందుకు అవకాశం ఉంటుంది. క్యాన్సర్ చికిత్స విషయంలో ఎంత త్వరగా వ్యాధి నిర్ధారించి చికిత్స ప్రారంభిస్తే అంత మంచి ఫలితాలు సాధించేందుక అవకాశం ఉంటుంది. కనుక సమయానికి క్యాన్సర్ ను గుర్తించడం క్యాన్సర్ చికిత్సలో చాలా ముఖ్యం.
☀ మింగడంలో సమస్యలు ఉండడం
☀ కడుపులో ఏదో బరువుగా ఉండడం
☀ 6 నుంచి 12 నెలల్లో కారణం లేకుండానే బరువు తగ్గడం
☀ ఇలాంటి లక్షణాలు రెండు వారాలకు పైగా కొనసాగుతున్నాయంటే మాత్రం తప్పకుండా డాక్టర్ ను సంప్రదించడం అవసరమని గుర్తించాలి.
Also Read: పీడకలలు తరచూ వస్తున్నాయా? ప్రమాదం పొంచి ఉన్నట్టే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.