Tricks to Remove Tough Stains in Washing Machine : వాషింగ్ మెషిన్ బట్టలు ఉతికే పనిని చాలా సులభం చేసేసింది. అందుకే దాదాపు అందరి ఇళ్లల్లో ఇది ఉంటుంది. కానీ వాషింగ్ మెషిన్​లో బట్టలు వేస్తే మరకలు పోవు అనే కంప్లైంట్ చాలామందిలో ఉంటుంది. కాలర్, కఫ్స్ లేదా పిల్లల బట్టలపై ఉండే మరకలు పూర్తిగా పోవు. అలాంటప్పుడు కేవలం డిటర్జెంట్ మాత్రమే వేసి బట్టలను మెషిన్‌లో వేస్తే సరిపోదు. డ్రెస్​లు ప్రతిసారీ శుభ్రంగా, తాజాగా ఉండాలంటే కొన్ని స్మార్ట్ పద్ధతులు పాటించడం అవసరం. వాషింగ్ మెషిన్‌లో బట్టలను మరింత సమర్థంగా శుభ్రం చేయడానికి ఉపయోగపడే కొన్ని సులభమైన టిప్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

మచ్చలు ఉంటే ఇలా చేయండి..

బట్టలను మెషిన్‌లో వేయడానికి ముందు మచ్చలు ఉన్న చోట్ల స్టెయిన్ రిమూవర్ లేదా బేకింగ్ సోడా, నీరు కలిపిన మిశ్రమాన్ని అప్లై చేయాలి. ముఖ్యంగా కాలర్, అండర్ ఆర్మ్స్, కఫ్స్ ప్రాంతాల్లో ఇలా చేయడం మంచిది. దీనిని 10–15 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత బట్టలను వాషింగ్ మెషిన్‌లో వేయాలి. దీంతో మచ్చలు సులభంగా తొలగిపోతాయి.

వాష్ సైకిల్, టెంపరేచర్ 

బాగా మురికి పట్టిన బట్టలకు “హెవీ డ్యూటీ” లేదా “ఇంటెన్సివ్” వాష్ సైకిల్ ఉపయోగించాలి. అలాగే కొంచెం గోరువెచ్చని నీరు ఉపయోగిస్తే.. మురికి, నూనె మచ్చలు త్వరగా తొలగుతాయి. అయితే బట్టలపై ఉన్న కేర్ లేబుల్‌ను ముందుగా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే దుస్తులు చెడిపోకుండా మరకలు తొలగించుకోవచ్చు.

డిటార్జెంట్ 

బలమైన మచ్చలను తొలగించడానికి మంచి క్వాలిటీ డిటర్జెంట్ ఉపయోగించడం ముఖ్యం. ముఖ్యంగా ఎంజైమ్ ఆధారిత డిటర్జెంట్లు మురికి, ఆర్గానిక్ మచ్చలను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

నానబెట్టాల్సిందే..

చాలా మురికి పట్టిన బట్టలను మెషిన్‌లో వేసే ముందు 30 నుంచి 60 నిమిషాలు డిటర్జెంట్ లేదా బేకింగ్ సోడా కలిపిన నీటిలో నానబెట్టాలి. దీంతో మురికి తగ్గుతుంది. తర్వాత మెషిన్‌లో ఉతికితే బట్టలు మరింత శుభ్రంగా అవుతాయి.

ఎక్కువ లోడ్ చేయొద్దు

ఒకేసారి ఎక్కువ బట్టలు వేయడం వల్ల అవి మెషిన్‌లో సరిగ్గా కదలవు. దీంతో మురికి పూర్తిగా తొలగదు. కాబట్టి ఒకేసారి తక్కువ బట్టలను ఉతికితే మంచి ఫలితం ఉంటుంది.

వాషింగ్ మెషిన్ ఉన్నా సరే సరైన పద్ధతులు పాటించకపోతే బట్టలు పూర్తిగా శుభ్రం కావు. ఈ టిప్స్ పాటిస్తే అదనంగా రుద్దాల్సిన అవసరం లేకుండా బట్టలు మరింత శుభ్రంగా, తాజాగా కనిపిస్తాయి.