ఎండాకాలం చర్మాన్ని కాపాడుకోవటం ఎలా.. 


ఎండాకాలం వచ్చిందంటే బాధా ఒకటే..చర్మం పాడైపోతుందని. అమ్మాయిలైతే స్కార్ఫ్‌లు కట్టుకుని ఎలాగోలా ఎండ నుంచి కవర్ చేసుకుంటారు. అబ్బాయిలు క్యాప్‌ పెట్టుకుని ఖర్చీఫ్‌లు కట్టుకుంటూ నానా బాధలు పడతారు . వీళ్లే కాదు. స్కిన్‌కేర్‌పై ఆసక్తి ఉన్న వాళ్లందరూ ఇలా ఏవో తంటాలు పడతారు. ఇంకొందరు రకరకాల సన్‌స్క్రీన్‌ లోషన్స్ వినియోగిస్తారు. అయితే వీటిలో ఏది సరిగ్గా పని చేస్తుంది..? ఏ క్రీమ్‌ ఎండ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది..? అన్నది తేల్చుకోవటం కాస్త కష్టమే. అన్ని సంస్థలూ తమ ప్రొడక్ట్‌ చాలా బెస్ట్ అని ప్రచారం చేసుకుంటాయి. కానీ సన్‌స్క్రీన్ లోషన్‌ను ఎంపిక చేసుకోవటంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు డెర్మటాలజిస్ట్‌లు. 


సరైన సన్‌స్క్రీన్ లోషన్‌ని ఇలా ఎంచుకోవాలి 


సరైన సన్‌స్క్రీన్ లోషన్ వినియోగించకపోతే చర్మం తొందరగా ముడతలు పడిపోవటం సహా చర్మ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదమూ ఉంది. అందుకే అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ సరైన సన్‌స్క్రీన్ లోషన్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలో వివరిస్తోంది. సన్‌ప్రొటెక్షన్ ఫ్యాక్టర్-SPF ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. 30 కన్నా ఎక్కువ SPF ఉన్న సన్‌స్క్రీన్‌ లోషన్‌ని ఎంచుకోవాలని చెబుతోంది అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ. వాటర్ రెసిస్టెంట్‌ లోషన్ అయితే యూవీ కిరణాలు చర్మం మీద పడకుండా అడ్డుకుంటాయని ఈ సంస్థ చెబుతోంది. వీటితో పాటు మరి కొన్ని సూచనలూ చేసింది. 


ఇలా చేస్తే చర్మం నిగనిగలాడిపోతుంది 


1. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు తరచూ సన్‌స్క్రీన్ లోషన్‌ను రాసుకోవాలి. ఎస్‌పీఎఫ్‌ 30 కన్నా ఎక్కువగా ఉన్నదే ఎంచుకోవాలి. 
2. యూవీఏ, యూవీబీ లాంటి ప్రమాదకర కిరణాల ప్రభావం మన శరీరంపై పడకుండా ఉంచే సన్‌స్క్రీన్‌ లోషన్‌లు వినియోగించాలి. 
ప్రొడక్ట్‌ కొనే ముందు ఈ డిస్‌క్లెయిమర్‌ ఉందో లేదో చూసుకోవాలని సూచిస్తున్నారు డెర్మటాలజిస్ట్‌లు. 
3.ఎక్కువ  సమయం ఎండలో గడిపే వాళ్లు వాటర్ రెసిస్టెన్స్ లోషన్‌ని ఎంపిక చేసుకోవాలి. ఈ తరహా లోషన్లు కనీసం రెండు గంటల పాటు శరీరాన్ని ఎండ నుంచి రక్షిస్తుంది. 
3. పొడి చర్మం ఉన్న వాళ్లైతే గ్లిసరిన్ ఉన్న సన్‌స్క్రీన్ లోషన్స్‌ని వినియోగించాలి. జిడ్డు చర్మం ఉన్న వాళ్లైతే ఆయిల్ ఫ్రీ లోషన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. 
4. ఫ్రాగ్రన్స్‌లు, ఇతర అడిటివ్స్‌ ఉన్న లోషన్స్‌ను వినియోగించొద్దని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటివి వాడితే చర్మం పాడవుతుందని హెచ్చరిస్తున్నారు. 
5. విటమిన్ డీ అందించే లోషన్‌ను ఎంచుకోవాలి. ఒకే వేలితో లోషన్‌ను తీసుకుని చర్మమంతా అప్లై చేసుకోవాలి. ఈ సూచనలు పాటిస్తే చర్మం పాడవకుండా ఎండాకాలంలోనూ నిగనిగ మెరిసిపోతుంది.