Hacks to Keep Your Refrigerator Smelling Fresh : నేటి కాలంలో ఫ్రిడ్జ్ లేని ఇల్లు దాదాపు ఉండదు. దానిలో కూరగాయల నుంచి రాత్రి మిగిలిపోయిన ఆహారం వరకు.. పాలు, పండ్లు, పెరుగు, మాంసాహారం, ప్రతిదీ ఫ్రిడ్జ్​లో పెడతారు. ఫుడ్ స్టోర్ చేసుకునేందుకు ఫ్రిడ్జ్ మంచి ఆప్షనే కానీ.. దానిని సరిగ్గా చూసుకోకపోతే సమస్యలకు కారణం కావచ్చు. అది ఎలా చెప్పవచ్చు అంటే.. ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఓ రకమైన స్మెల్ వస్తుందా? ఇలాంటి వాసన వస్తుందంటే మనమే అర్థం చేసుకోవాలి ఫ్రిజ్డ్ శుభ్రంగా లేదు అని. ఈ వాసన ఇబ్బందికరంగా ఉండటమే కాకుండా.. లోపల ఉన్న ఇతర ఆహార పదార్థాలను కూడా పాడు చేస్తుంది.

ఫ్రిడ్జ్ నుంచి వాసన రావడానికి కారణాలు 

వాస్తవానికి ఫ్రిడ్జ్ నుంచి వాసన రావడానికి ప్రధాన కారణం.. పాత, మిగిలిపోయిన ఆహారం. అలాగే పడిపోయిన డ్రింక్స్, ఎక్కువ కాలం నిల్వ చేసిన చెడిపోయిన వస్తువులు, సమయానికి శుభ్రపరచకపోవడం కూడా. కానీ మంచి విషయం ఏమిటంటే ఈ సమస్యకు పరిష్కారం మీ వంటగదిలోనే ఉంది. కొన్ని సులభమైన, ఇంటి నివారణలను ఉపయోగిస్తే.. మీ ఫ్రిడ్జ్ వాసనను పూర్తిగా తొలగించవచ్చు. కాబట్టి ఫ్రిజ్‌లో ఉంచిన వెంటనే ఏ వస్తువులు స్మెల్ దూరం చేస్తాయో తెలుసుకుందాం.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా ఒక సహజమైన డియోడరైజర్. ఇది ఏ రకమైన వాసననైనా త్వరగా పీల్చుకుంటుంది. దీన్ని ఉపయోగించడానికి ఒక చిన్న గిన్నెలో బేకింగ్ సోడా వేసి.. ఫ్రిడ్జ్​లోని ఏదైనా మూలలో తెరిచి ఉంచండి. ఈ పద్ధతి వాసనను తొలగించడమే కాకుండా ఫ్రిడ్జ్​ని తాజాగా ఉంచుతుంది. మంచి ఫలితం కోసం.. ప్రతి 3-4 వారాలకు బేకింగ్ సోడాను మార్చండి.

నిమ్మ లేదా నారింజ తొక్కలు

నిమ్మ, నారింజ తొక్కలలో ఉండే సిట్రస్ నూనెలు ఫ్రిజ్ వాసనను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఈ హ్యాక్‌ను ఉపయోగించడానికి, నిమ్మ లేదా నారింజ తొక్కలను ఒక ప్లేట్‌లో ఉంచండి. ప్లేట్‌ను ఫ్రిజ్‌లో ఉంచండి. కొంత సమయం తర్వాత ఫ్రిజ్ నుంచి వచ్చే వాసన తగ్గుతుంది. లోపల కొంచెం తాజాగా అనిపిస్తుంది.

వెనిలా ఎసెన్స్

మీరు ఫ్రిడ్జ్ నుంచి వాసన పోవడమే కాకుండా.. మంచి వాసన కూడా రావాలని కోరుకుంటే.. వెనిలా ఎసెన్స్ ఒక మంచి ఎంపిక. దీని కోసం ఒక చిన్న దూదిని తీసుకోండి. దానిపై 2-3 చుక్కల వెనిలా ఎసెన్స్ వేయండి. ఒక చిన్న గిన్నెలో ఉంచి ఫ్రిజ్‌లో ఉంచండి. కొంత సమయం తర్వాత ఫ్రిజ్ తెరిచిన వెంటనే మంచి వాసన వస్తుంది.

కాఫీ పొడి లేదా కాఫీ బీన్స్

కాఫీ వాసనను పీల్చుకునే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా చేపలు లేదా మాంసాహారం వాసన కోసం.. దీన్ని ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో కాఫీ పొడి లేదా కాఫీ గింజలు వేసి.. గిన్నెను తెరిచి ఫ్రిజ్‌లో ఉంచండి. ప్రతి వారం కాఫీని మార్చడం మర్చిపోవద్దు.

నిమ్మ, లవంగాలు

నిమ్మ, లవంగాల కలయిక సహజమైన డియోడరైజర్‌గా పనిచేస్తుంది. దీని కోసం.. ఒక నిమ్మకాయను సగానికి కట్ చేసి దానిలో 2-3 లవంగాలను ఉంచండి. దీనిని ఫ్రిడ్జ్​లో ఉంచండి. ఇది వాసనను త్వరగా తొలగిస్తుంది. కొంచెం తాజాగా ఉంచుతుంది. ప్రతి 3-4 రోజులకు నిమ్మకాయలను మారుస్తూ ఉండండి.

టీ ఆకులు

ఇంట్లో కాఫీ లేకపోతే.. ఎండిన టీ ఆకులు కూడా ఉపయోగపడతాయి. దీన్ని ఉపయోగించడానికి ఒక గిన్నెలో ఎండిన టీ ఆకులను నింపండి. ఫ్రిడ్జ్​లో ఉంచండి. టీ ఆకులు వాసనను పీల్చుకుంటాయి. ఫ్రిజ్‌ను తాజాగా ఉంచుతాయి.

ఫ్రిడ్జ్ వాసన రాకూడదంటే..

పైన చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ.. వారానికి ఒకసారి ఫ్రిజ్‌ను శుభ్రం చేసుకోవాలి. చెడిపోయిన లేదా పాత ఆహారాన్ని వెంటనే తీసివేయండి. ద్రవాలు పడిపోతే వెంటనే శుభ్రం చేయండి. ఆహారాన్ని ఎల్లప్పుడూ కప్పి ఉంచండి. ఇవన్నీ ఫ్రిడ్జ్ నుంచి వచ్చే వాసనను దూరం చేస్తాయి.