సగ్గుబియ్యం లేదా సాబుదానా... మన దేశంలో ఈ గింజలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా పండుగలు, ఉపవాసాల సమయంలో వీటిని కచ్చితంగా వాడతారు. ఎందుకంటే సగ్గుబియ్యం తినడం వల్ల తక్షణ శక్తి వస్తుంది. పొట్ట తేలికగా ఉంటుంది. కార్బోహైడ్రేట్లు, ఫైబర్, క్యాల్షియం, ఐరన్ వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు దీనిలో ఉంటాయి. అందుకే ఉపవాస ఆహారంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ సగ్గుబియ్యాన్ని ‘టాపియోకా పెరల్స్’ అని కూడా పిలుస్తారు. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో సగ్గుబియ్యం వాడకం చాలా ఎక్కువ. మనం ఎంతగా తింటున్నా ఇది మన దేశానికి చెందిన పంట కాదని అంటారు. 


ఆ రాజు వల్లే...
1860లలో కేరళలోని ట్రావెన్‌కోర్ రాజ్యాన్ని ఆయిల్యం తిరుణాల్ రామవర్మ పాలించేవారు. అతనే తొలిసారిగా మన దేశంలో సగ్గుబియ్యాన్ని పరిచయం చేశారని చెబుతారు. తన రాజ్యాన్ని ఘోరమైన కరువు పీడిస్తున్న సమయంలో ప్రజలను ఆకలి బాధల నుండి రక్షించడానికి సగ్గుబియ్యాన్ని దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టారని చరిత్రకారులు వివరిస్తున్నారు. బ్రెజిల్ నుండి రామవర్మ సోదరుడు తొలిసారిగా సగ్గు బియ్యాన్ని తయారు చేసే కర్రపెండలాన్ని మన దేశానికి తెచ్చారని చెబుతారు. అతను ఒక వృక్ష శాస్త్రజ్ఞుడు. మరొక కథనం ప్రకారం 17వ శతాబ్దంలో పోర్చుగీసు వ్యాపారులు భారతదేశానికి కర్రపెండలం దుంపను పరిచయం చేశారని కూడా చెబుతారు.


ఎలా తయారుచేస్తారు?
ముత్యాల్లా మెరిసే సగ్గుబియ్యం నేరుగా అలా గింజల రూపంలో పండవు. వాటిని ప్రత్యేకంగా తయారు చేస్తారు. భూమి లోపల పెరిగే దుంపలు కర్రపెండలం. ఈ కర్ర పెండలం దుంపలను సేకరించి, బాగా కడిగి, మిషన్లో పెట్టి పైన ఉన్న పొరను తొలగిస్తారు. ఆఫ్రికాలో దీన్ని ‘కాసావా’ అని పిలుస్తారు. ఈ దుంప అక్కడ ప్రధాన ఆహారం. తొక్క తీసిన ఈ దుంపలను గ్రౌండింగ్ యంత్రాల్లోకి పంపిస్తారు. చెరుకు నుండి చెరకు రసాన్ని ఎలా తీస్తామో... అలా ఈ దుంపల నుండి ఆ యంత్రాలు పాలను వేరు చేస్తాయి. దుంపల నుండి వచ్చిన పాలు ఫిల్టర్ల ద్వారా సర్క్యూలేటింగ్ ఛానల్స్ లోకి వెళ్తాయి. పాలలోని చిక్కని పదార్థం ముద్దలా తయారవుతుంది. ఆ ముద్ద... రంధ్రాలు ఉన్న జల్లెడలాంటి యంత్రంలోకి వెళుతుంది. ఆ జల్లెడ ఇటూ అటూ వేగంగా కదులుతూ ఉంటుంది. ఆ జల్లెడ రంధ్రాల నుంచి ఈ తెల్లని పదార్థం కిందకి జారుతూ ఉంటుంది. అలా జారినప్పుడు అవి తెల్లటి ముత్యాల్లాగా రాలుతూ ఉంటాయి. అలా రాలిన పూసల్లాంటి వాటిని ఎండలో ఎండబెట్టడం లేదా పెనం మీద వేసి వేడి చేయడం వంటివి చేసి గట్టిగా అయ్యేలా చేస్తారు. అవే సగ్గుబియ్యం. ఇలా 500 కిలోల కర్ర పెండలం దుంపలను సేకరిస్తే 100 కిలోల సగ్గుబియ్యం తయారవుతుంది.


సగ్గుబియ్యం గింజలు ఎండలో ఎక్కువ గంటల పాటు ఎండబెట్టడం వల్ల అందులోని తేమ మొత్తం పోతుంది. దీనివల్ల  అవి గట్టిగా మారుతాయి. వండే ముందు వాటిని నాలుగు ఐదు గంటలు నీటిలో నానబెడితేనే వండడం సాధ్యమవుతుంది. 


Also read: గుడ్డునే కాదు, గుడ్డు పెంకులను తినమని పోషకాహార నిపుణులు చెబుతున్నారెందుకు?





































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.