5 Blood Tests May Reveal Hidden Health Risks : సాధారణంగా ఆరోగ్యాన్ని చెక్ చేసుకోవడానికి చాలామంది బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్, లివర్, కిడ్నీ ఫంక్షన్ వంటి రొటీన్ బ్లడ్ టెస్టులు చేయించుకుంటారు. అయితే కొన్ని వ్యాధులు ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకుండా నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంటాయి. అలాంటి పరిస్థితులను ముందుగానే గుర్తించేందుకు కొన్ని ప్రత్యేక రక్త పరీక్షలు ఉపయోగపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వైజాగ్‌లోని అన్ష్ హాస్పిటల్లో సర్జికల్ ఆంకాలజిస్ట్‌గా చేస్తోన్న డాక్టర్ రఘువంశీ రొటీన్‌కు భిన్నంగా 5 బ్లడ్ టెస్ట్‌ల చేయించుకోవాలని సూచిస్తున్నారు. మరి ఆ టెస్ట్‌లు ఏంటి.. వాటివల్ల ఏయే వ్యాధులను ముందుగా గుర్తించవచ్చో.. ఎవరు కచ్చితంగా ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలో చూసేద్దాం.
Apolipoprotein B (ApoB) Test
''చాలామంది గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి లిపిడ్ ప్రొఫైల్, మొత్తం కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటి పరీక్షలు చేయించుకుంటారు. అయితే Apolipoprotein B (ApoB) పరీక్ష రక్తంలో ధమనుల్లో పేరుకుపోయే హానికరమైన కొలెస్ట్రాల్ కణాల సంఖ్యను మరింత ఖచ్చితంగా అంచనా వేయగలదు'' అని డాక్టర్ రఘువంశీ తెలిపారు.
Also Read : బీపీ ఎక్కువ, తక్కువ ఉన్నా, గుండె సమస్యలు ఉన్నా.. లైంగిక కోరికను పెంచే ట్యాబ్లెట్స్ వాడకూడదా?
ఈ టెస్ట్ ద్వారా గుండెపోటు లేదా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం ఉందా అనే విషయాన్ని ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిస్, ఊబకాయం లేదా కుటుంబంలో గుండెజబ్బుల చరిత్ర ఉన్నవారికి ఈ పరీక్ష ఉపయోగకరంగా ఉండొచ్చు.
High-Sensitivity C-Reactive Protein (hs-CRP)
శరీరంలో దాగి ఉన్న దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్‌ను గుర్తించడంలో High-Sensitivity C-Reactive Protein (hs-CRP) పరీక్ష సహాయపడుతుంది. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు, టైప్-2 డయాబెటిస్ వంటి సమస్యల ప్రమాదం పెరగవచ్చని రఘువంశీ తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఇతర ఆరోగ్య సమస్యలతో కూడా దీనికి సంబంధం ఉండొచ్చు. కాబట్టి ఈ ఫలితాలను ఇతర పరీక్షలు, లక్షణాలతో కలిపి సమస్యను వైద్యులు చెప్తారు.
Omega-3 Index Test
డాక్టర్ రఘువంశీ ప్రకారం.. శరీరంలో ఒమేగా-3 స్థాయి తక్కువగా ఉంటే గుండె ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో పాటు మెదడు పనితీరు, ఇన్‌ఫ్లమేషన్‌పై కూడా ప్రభావం చూపవచ్చు. ఈ స్థాయిలు తక్కువగా ఉంటే వైద్యుల సూచన మేరకు చేపలు, ఫ్లాక్స్ సీడ్స్, వాల్‌నట్స్ వంటి ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం లేదా అవసరమైతే సప్లిమెంట్లు ఉపయోగించవచ్చు.
Also Read : తేనెలో వెల్లుల్లి ముంచి ఉదయాన్నే తింటే కలిగే లాభాలివే.. బరువు తగ్గడం నుంచి గుండె ఆరోగ్యం వరకు
Fasting Insulin Test
రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణంగా ఉన్నా, శరీరంలో ఇన్సులిన్ నిరోధకత ప్రారంభమై ఉండొచ్చు. ఈ పరిస్థితిని ముందుగానే గుర్తించడంలో Fasting Insulin Test ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ నిరోధకతను ప్రారంభ దశలో గుర్తిస్తే జీవనశైలిలో మార్పులు, వ్యాయామం, సరైన ఆహారంతో భవిష్యత్తులో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుంది.
Homocysteine Test
రక్తంలో హోమోసిస్టీన్ అనే పదార్థం స్థాయిలు ఎక్కువగా ఉంటే రక్తనాళాల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. కొన్ని పరిశోధనల్లో ఇది గుండెజబ్బులు, మెదడు స్ట్రోక్ వంటి సమస్యల ప్రమాదంతో సంబంధం కలిగి ఉండవచ్చని గుర్తించారు. అలాగే విటమిన్ B6, B12, ఫోలేట్ లోపాల వల్ల కూడా హోమోసిస్టీన్ స్థాయిలు పెరగవచ్చు.
కాబట్టి ఈ 5 పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ రఘువంశీ సూచించారు. వీటి ద్వారా కొన్ని ప్రమాదకరమైన వ్యాధులు ముందుగానే గుర్తించి దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని తెలిపారు.
ఎవరు చేయించుకుంటే మంచిది?
ఈ టెస్ట్‌లు వైద్యులు సూచించినా.. లేదా కుటుంబంలో గుండెజబ్బులు లేదా డయాబెటిస్ ఎవరికైనా ఉన్నా చేయించుకుంటే మంచిది. అలాగే అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారు, హై బీపీ, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు, స్మోకింగ్ చేసే వారు, 40 ఏళ్లు దాటిన తర్వాత రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకునే వారు వీటిని కూడా చేయించుకుంటే బెటర్. ఎందుకంటే ఈ పరీక్షలు ఆరోగ్య ప్రమాదాలను ముందుగానే అంచనా వేయడంలో సహాయపడతాయి.
ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
