Monsoon Clothing Tips : వర్షాకాలం వచ్చేసింది. వర్షం వచ్చేప్పుడు తడవడం ఎక్కువమంది ఇష్టపడతారు. కానీ వర్షంలో ఆఫీస్​కి లేదా కాలేజ్​కి, ఇతర పనులు కోసం వెళ్లేవారు చాలా ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో బట్టలు ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది. బయట ఆరేసుకునే వీలు ఉండదు. అలా అని లోపలే వేస్తే వాటి నుంచి స్మెల్ వస్తుంది. కాబట్టి వర్షాకాలంలో ఎలాంటి డ్రెస్​లు వేసుకుంటే మంచిది. రైనీ సీజన్​లో కూడా ఫ్యాషన్​గా కనిపిస్తూ.. కంఫర్ట్​బుల్​గా ఉండగలిగే దుస్తులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

దుస్తుల ఎంపిక..

వర్షాకాలంలో దుస్తుల ఎంపికనేది చాలా ముఖ్యం. ఎందుకంటే వర్షం వచ్చేప్పుడు మీరు కొన్ని రకాల దుస్తులు వేసుకోకపోవడమే మంచిది. నైలాన్, పాలిస్టర్​ దుస్తులు వేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇవి తొందరగా ఆరిపోతాయి. ఇన్​ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పైగా ఇవి శరీరం మీదనే కాదు.. బయటక ఆరేసినా కూడా త్వరగా ఆరిపోతాయి.  

వాటర్​ప్రూఫ్ జాకెట్లు..

మీరు బయటకు వెళ్లేప్పుడు వర్షం రావట్లేదు అని వదిలేయకుండా మీతో పాటు వాటర్​ప్రూఫ్ జాకెట్లు లేదా రెయిన్ కోట్లు క్యారీ చేస్తే మంచిది. అకస్మాత్తుగా వర్షం వచ్చినా మీరు తడవకుండా గమ్యస్థానాన్ని చేరుకోగలుగుతారు. దీనివల్ల వర్షంలో తడిస్తే వచ్చే ఇన్​ఫెక్షన్లు కూడా దూరం చేసుకోవచ్చు. 

కలర్స్

వర్షాకాలంలో లైట్ కలర్స్ వేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే వర్షంలో తడిచినా లేదా బురద గుర్తులు ఏమైనా పడితే అవి క్లియర్​గా కనిపిస్తాయి. డార్క్ కలర్స్ ఎంచుకుంటే మరకలు అంతగా కనిపించవు. 

వాటికి దూరంగా ఉంటే బెటర్

తేలికగా ఉండాలని కాటన్ దుస్తులు వేసుకుంటే మాత్రం కష్టమే. ఎందుకంటే ఇవి మీకు గాలి ఆడేలా చేస్తాయి కానీ.. వాటిని ఆరబెట్టేందుకు ఎక్కువ సమయం పడుతుంది. మీరు ఆఫీస్​కి వెళ్లినా అవి త్వరగా ఆరవు. పైగా దుస్తులు ఆరకుంటే ఒకరకమైన వాసన వస్తుంది. కాబట్టి వర్షాకాలంలో వాటిని అవాయిడ్ చేయడమే మంచిది. పైగా తడిసిన బట్టలు ఎక్కువసేపు వేసుకుంటే స్కిన్ సమస్యలు వచ్చే ప్రమాదముంది. 

వాటికి నో..

పొడవుగా ఉండే ప్యాంట్స్ లేదా బాటమ్స్ వేసుకోకపోవడమే మంచిది. మీరు నీటిలో నడవాల్సి వచ్చినా లేదా ఇతర సమయాల్లో నీరు కింది భాగంలో దుస్తులకు అంటుకుంటుంది. పైగా ప్యాంట్ చివరి భాగం ఆరడానికి ఎక్కువ సమయం కూడా తీసుకుంటుంది. కాబట్టి వాటిని అవాయిడ్ చేస్తే మంచిది. 

చెప్పులు..

వర్షంలో నడిచేప్పుడు చాలామందికి ఫంగల్ ఇన్​ఫెక్షన్లు వస్తాయి. నీటిలో ఎక్కువగా తడవడం వల్ల పాదాలపై ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని దూరం చేసుకోవడానికి రబ్బరు లేదా క్రోక్స్ వంటి చెప్పులు వినియోగిస్తే మంచిది. లేదా వాటర్​ప్రూఫ్ షూలు ధరించవచ్చు. ఇవి కంఫర్ట్​గా జారిపోకుండా గ్రిప్ ఇవ్వడంతో పాటు ఫంగల్ ఇన్​ఫెక్షన్లను దూరం చేస్తాయి. 

ఈ టిప్స్ ఫాలో అవ్వడంతో పాటు బ్యాగ్లో గొడుగును తీసుకెళ్తే మంచిది. వర్షం ఎక్కువగా ఉండే సమయంలో ఎక్కడైనా ఆగడం మంచిది. కాస్త తగ్గిన తర్వాత వెళ్తే దుస్తులు తడవడం, ఇన్ఫెక్షన్లు రావడం వంటి సమస్యలు తగ్గుతాయి.