ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఆహార పదార్థాల్లో పిజ్జా ఒకటి. దీనికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. చీజీగా ఉన్న పిజ్జా చూస్తే ఎవరికైనా నోరూరిపోతుంది. ఈ ఇటాలియన్ వంటకం బాగా ప్రాచుర్యం పొందింది. ఎంతో టేస్టీగా ఉండే పిజ్జా మాత్రం ఆరోగ్యానికి  అంత మంచిది కాదని అంటారు. ఇది తినడం వల్ల బరువు పెరగడం, కొవ్వు చేరిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు తప్పనిసరిగా పిజ్జా, బర్గర్ వంటి జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. కానీ ఇక నుంచి బరువు తగ్గే డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఇలా పిజ్జాని తింటే మాత్రం ఏ ఇబ్బంది ఉండదు. పైగా బరువు తగ్గుతారు కూడా. అదెలాగో తెలుసా..?


న్యూట్రీషనిస్ట్ ఆంచల్ సోగాని తన ఇన్ స్టాగ్రామ్ లో పిజ్జా టిని కూడా బరువు తగ్గించుకోవచ్చని చెప్తున్నారు. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అందరూ ముందుగా ఆలోచించేది కేలరీలు తక్కువ ఉన్న ఆహారం మీదే దృష్టి పెడతారు. తక్కువ కెలరీలు తీసుకుంటే బరువు తగ్గవచ్చని అనుకుంటారు. అది నిజమే అలాగే పిజ్జా కూడా తినొచ్చు. అయితే మీరు పిజ్జా తీసుకునే పరిమాణం, అందులోని ఇంగ్రేడియంట్స్ ముఖ్యం. పిజ్జా మొత్తం ముందు పెట్టుకుని తినేయకుండా ఫ్రెండ్స్ లేదా ఇతరులతో దాన్ని పంచుకుని తినాలి.


పిజ్జా ఇలా చేసుకోండి?


పిజ్జాను బరువు తగ్గించే ఆహారంలో భాగంగా మార్చుకోవడానికి ఉన్న మరొక మార్గం ఆరోగ్యకరమైన పదార్థాలను ఎంచుకోవడం. ఉదాహరణకు పిజ్జా తయారీకి మైదా పిండికి బదులుగా గోధుమ పిండి ఉపయోగించడం. ఇందులో ఫైబర్, పోషకాలు ఉన్నాయి. అలాగే పిజ్జా మీద బెల్ పెప్పర్స్, పుట్ట గొడుగులు, ఉల్లిపాయలు, బచ్చలికూర, టొమాటోలు వంటి కూరగాయలు జోడించుకోవచ్చు. ఇవన్నీ బరువు తగ్గించేందుకు దోహదపడే ఆహార పదార్థాలు. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తూనే కేలరీల సంఖ్య తక్కువగా ఉంచుతుంది.


పిజ్జాను మితంగా తినాలి. ఇది ప్రధానమైన ఆహారంలో భాగం ఎంత మాత్రం కాదు అనే విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది బరువు తగ్గించే లక్ష్యాలను చేర్చుకోవడంలో కూడా సహాయపడుతుంది. పిజ్జాలో అతిగా చీజ్ వేసుకుని లాగించేయకూడదు. దాన్ని అతిగా తింటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.


బరువు తగ్గాలని ప్లాన్ వేసుకున్నపుడు ఇష్టమైన ఆహారాలను కూడా వదిలేసుకుంటారు. కానీ అలా చేయడం వల్ల వాటిని తినాలనే ఇష్టం ఎక్కువగా ఉంటుంది. దాని ప్రభావం ఇతర పదార్థాల మీద చూపించేస్తారు. పరిమితికి మించి తినేస్తుంటారు. అలా చేస్తే బరువు తగ్గడం అటుంచి తెలియకుండా బరువు పెరిగిపోతారు. అందుకే నచ్చిన పదార్థాలు మితంగా తీసుకుంటూ కూడా బరువుని అదుపులో ఉంచుకోవచ్చు.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: కళ్లు పొడిబారుతున్నాయా? జాగ్రత్త, హైపర్ థైరాయిడ్ కావచ్చు, ఇలా చేస్తే సేఫ్