Liquor Oak Wood Barrels | మీరు తాగే ఏ బ్రాండ్ లిక్కర్ అయినా, ఏ సైజు సీసాలో ఉన్న లిక్కర్ అయినా, ఏ రంగు, రుచి, వాసన ఉన్న లిక్కర్ అయినా అది మగ్గేది (తయారయ్యేది) ఓ బ్యారెల్‌లో అన్న విషయం మీకు తెలుసా? ఆ బ్యారెల్‌ను ఏ చెక్కతో తయారు చేస్తారో మీకు తెలుసా? ఏ బ్రాండ్ అయినా, అది బ్రాందీ, విస్కీ, స్కాచ్, వైన్, బీర్ ఏదైనా... బాట్లింగ్ చేసే ముందు చెక్క బ్యారెల్‌లో నిల్వ చేస్తారు. అయితే, బ్యారెల్‌లో నిల్వ చేయడానికి ఓక్ (Oak) వుడ్‌నే ఎక్కువగా వాడతారన్న విషయం మీకు తెలుసా? ఎందుకు ఓక్ వుడ్‌తోనే బ్యారెల్ తయారు చేస్తారు అన్న అనుమానాలు వస్తాయి కదా. అవును, ఈ ప్రక్రియ జరపడానికి కారణం ఏమిటనేది ఈ కథనం పూర్తిగా చదివితే మీకు తెలుస్తుంది.

ఓక్ బ్యారెల్‌లో నిల్వచేయడానికి ప్రధాన కారణాలు ఇవే:

లిక్కర్‌ను ఓక్ బ్యారెల్‌లో నిల్వ చేయడం చాలా ఏళ్ల నుండి ఆనవాయితీగా వస్తోంది. ఇలా ఓక్ చెక్కతో తయారు చేసిన బ్యారెల్‌లో మద్యాన్ని నిల్వ చేయడాన్ని ఏజింగ్ (Ageing) లేదా పరిపక్వత (Maturation) అంటారు. ఓక్ చెక్క బ్యారెల్‌లో మద్యాన్ని నిల్వ చేస్తే కొత్త రుచిని చేకూర్చుతుంది. ఈ కలప మద్యాన్ని మెరుగుపరచడానికి మూడు ప్రధాన అంశాలలో సహాయపడుతుంది.

1. రుచి మరియు సువాసన (Flavor and Aroma) - లిక్కర్ తయారయ్యాక ఓక్ చెక్కతో చేసిన బ్యారెల్‌లో నిల్వ చేయడం వల్ల కొన్ని రసాయన సమ్మేళనాలు జరుగుతాయి. తద్వారా నిల్వ చేయబడిన మద్యానికి సరికొత్త రుచిని అందిస్తుంది. దీని వల్ల మద్యం రుచిగా మారుతుంది.

వనిలిన్ (Vanillin) - విస్కీ లేదా బ్రాందీ వంటి మద్యాన్ని ఓక్ బారెల్స్‌లో నిల్వ చేసినప్పుడు, ఆ కలపలో సహజంగా ఉండే వనిలిన్ రసాయనం నెమ్మదిగా మద్యం లోకి విడుదల అవుతుంది. ఓక్ బారెల్స్‌లో మద్యం నిల్వ చేస్తే దానికి వనిల్లా ఫ్లేవర్ రుచిని సహజంగానే అందిస్తుంది. ఇది ఓక్ కలపలో ఉండే సహజ సమ్మేళనం, అందుకే ఓక్ బ్యారెల్‌లోనే మద్యాన్ని నిల్వ చేయడం రివాజుగా మారింది.

టానిన్లు (Tannins) - ఓక్ కలప బ్యారెల్ వల్ల మద్యంలోకి టానిన్లను విడుదల చేస్తాయి. దీని వల్ల మద్యానికి కఠినమైన రుచి అంటే వగరు, ఘాటు, చేదు రుచులు చేరుతాయి. వీటి కలయిక వల్ల మద్యానికి పటిష్టమైన రుచి, సమతుల్యత వస్తుంది.

లాక్టోన్స్ (Lactones) -  ఓక్ కలపలో మద్యం నిల్వ చేయడం ద్వారా ఓక్ చెక్క నుండి సహజమైన లాక్టోన్స్ విడుదల అవుతాయి. దీని వల్ల మద్యానికి కొబ్బరి పొడి వంటి సువాసనను అందిస్తాయి. వేడి చేసిన ఓక్ (Toasted Oak) పొగ, మసాలా మరియు వేయించిన పండ్లు వంటి సంక్లిష్ట రుచులను కూడా అందిస్తుంది.

ఈ రుచుల సమ్మేళనం, సువాసనల కారణంగా మద్యానికి సరికొత్త రుచి, సువాసన చేకూరుతుంది.

2. రంగు (Color) - స్వేదన ప్రక్రియ (The Distillation Process) ద్వారా తయారు చేసిన ఆల్కహాల్ పారదర్శకంగా ఉంటుంది. అయితే ఈ మద్యాన్ని ఓక్ కలప బ్యారెల్‌లో నిల్వ చేసినప్పుడు ఆ కలప నుండి వచ్చే సహజ రంగులు మద్యాన్ని ఆకర్షణీయంగా మార్చుతాయి. అంటే ఎర్రటి గోధుమ రంగును ఈ ఓక్ కలప మద్యానికి అందిస్తుంది.

3. ఆక్సిజన్ నియంత్రణ (Controlled Oxidation) - ఓక్ కలపలో మద్యం నిల్వ వల్ల, కలపకు ఉన్న సూక్ష్మ రంధ్రాల ద్వారా తక్కువ పరిమాణంలో ఆక్సిజన్ బ్యారెల్‌లోకి వస్తుంది. ఇలా స్వల్ప ఆక్సీకరణ ప్రక్రియ ద్వారా మద్యానికి మృదువైన రుచి వస్తుంది. మద్యంలోని ఆల్కహాల్ ఘాటును తగ్గిస్తుంది. దీని వల్ల మద్యం సేవించే వారికి ఆహ్లాదకరమైన రుచిని ఇస్తుంది.

కేవలం ఓక్ కలపనే బ్యారెల్‌గా వాడటానికి ఇతర ప్రధాన కారణాలు

a). ఓక్ కలప దృఢంగా ఉంటుంది. అంతే కాదు వంచగలిగే ఫ్లెక్సిబిలిటీ ఉన్న కలప ఓక్. ఈ రెండు కారణాల వల్ల ఓక్ కలపను వంచి బ్యారెల్ షేప్‌లో తయారు చేస్తారు.

b). ఓక్ కలప ప్రత్యేక కణజాలాన్ని కలిగి ఉంటుంది. దీన్నే టైలోసెస్ (Tyoses) అనే నిర్మాణం అంటారు. ఇవి చెక్క కణజాలంలో ఉండే సూక్ష్మ రంధ్రాలను పూరించి, నిల్వ చేసిన మద్యం బయటకు లీక్ అవ్వకుండా నిరోధించడంలో సహాయపడతాయి. ఇతర చెక్కలలో ఈ లక్షణం తక్కువగా ఉంటుంది.

c). కొన్ని శతాబ్దాలుగా మద్యం నిల్వ ప్రక్రియలో ఓక్ కలపను ఉపయోగిస్తున్నారు. ఓక్ కలప మద్యం నిల్వకు అనుకూలమైనదని రుజువైంది. ఫ్రాన్స్‌లో ముఖ్యంగా ఫ్రెంచ్ ఓక్ (French Oak) , అమెరికాలో అమెరికన్ ఓక్ (American Oak) ను ఎక్కువగా వాడతారు. ప్రతి ఓక్ రకం మద్యంపై దాని ప్రభావాన్ని చూపుతుంది.

ఇన్ని లక్షణాలు ఓక్ కలపలో ఉన్నందువల్ల మద్యం తయారీదారులు ఈ చెక్కతోనే బ్యారెల్స్ తయారు చేసి అందులో మద్యం నిల్వ చేస్తారు. మీరు తాగే మద్యానికి ఆ రంగు, రుచి వచ్చిందంటే అందులో ఓక్ కలప పాత్ర ఎంతో ఉంది.