Norovirus Outbreak in China : చైనాలో మొదలైన కోవిడ్ వల్ల ప్రపంచం అంతా అతలాకుతలమైంది. అయితే ఇప్పుడు అదే చైనాలో మరో వైరస్ వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తుంది. అదే నోరోవైరస్. దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని ఫోషాన్ నగరంలో ఉన్న ఒక సీనియర్ హైస్కూల్‌లో 103 మంది విద్యార్థులకు నోరోవైరస్ సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారని.. ఏ కేసు కూడా తీవ్రమైనది లేదా ప్రాణాంతకం కాలేదని స్థానిక ఆరోగ్య అధికారులు చెప్తున్నారు.

Continues below advertisement

నోరోవైరస్ అనేది తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్‌కు కారణమయ్యే వైరస్. ఇది సాధారణంగా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, బలహీనత వంటి లక్షణాలను చూపుతుంది. జిన్హుయ్ మిడిల్ స్కూల్‌కు చెందిన ఈ విద్యార్థుల్లో ఇటీవల ఇలాంటి లక్షణాలను గుర్తించారు. వారికి చేసిన ప్రాథమిక దర్యాప్తులో నోరోవైరస్ సంక్రమణను నిర్ధారించారు.

వైద్య శాఖ ఏం చెప్తుందంటే..

ఆరోగ్య శాఖ ప్రకారం.. మొత్తం 103 మంది విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది. ముందు జాగ్రత్తగా.. పాఠశాల ప్రాంగణాన్ని పూర్తిగా క్రిమిసంహారక మందుతో శుభ్రం చేసినట్లు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నామని మీడియాకు వెల్లడించారు. సంక్రమణ మూలాన్ని గుర్తించడానికి ఎపిడెమియోలాజికల్ సర్వేలు కూడా జరుగుతున్నాయని.. ప్రతి ఏడాది అక్టోబర్, మార్చి మధ్య నోరోవైరస్ కేసులు సాధారణంగా పెరుగుతాయని.. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్షియల్ డిసీజ్ కంట్రోల్ అధికారులు తెలిపారు. చలి కాలంలో ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుందన్నారు.

Continues below advertisement

నోరోవైరస్ అంటే ఏమిటి?

ప్రపంచవ్యాప్తంగా నోరోవైరస్ చాలా సాధారణ వైరస్‌గా పరిగణిస్తారు. ఏటా సుమారు 685 మిలియన్ కేసులు నమోదవుతున్నాయి. ఇందులో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న దాదాపు 200 మిలియన్ల మంది పిల్లలు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ ప్రతి సంవత్సరం సుమారు 2,00,000 మందిని చంపుతుంది. ఇందులో దాదాపు 50,000 మంది పిల్లలు ఉన్నారు. 

నోరోవైరస్ ప్రభావం తక్కువ ఆదాయ దేశాలలో కనిపిస్తుంది. ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక నష్టాలతో సహా నోరోవైరస్ ప్రపంచ ఖర్చు సుమారు $60 బిలియన్లుగా అంచనా వేస్తున్నారు. నోరోవైరస్ మొదటి వ్యాప్తి 1968లో USAలోని ఒహియోలోని నార్వాక్‌లో నమోదైంది. అందువల్ల ప్రారంభ జాతిని "నార్వాక్ వైరస్" అని పిలిచేవారు.

వైరస్ వ్యాపి ఎలా ఉంటుందంటే..

ఈ వైరస్ గ్యాస్ట్రోఎంటెరిటిస్‌కు కారణమవుతుంది. దీనిని చాలా మంది సాధారణంగా స్టమక్ ఫ్లూ అని పిలుస్తారు. అయితే ఇది ఫ్లూ కంటే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫ్లుఎంజా వైరస్‌లు కడుపు వ్యాధికి కాదు.. శ్వాసకోశ అనారోగ్యానికి కారణమవుతాయి. నోరోవైరస్ సాధారణంగా మురికి ఆహారం లేదా నీటి ద్వారా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తి తాకిన ఆహారం, సరిగ్గా ఉడికించని షెల్ఫిష్ లేదా మురికి నీటితో కడిగిన కూరగాయలు, పండ్లు తింటే ప్రమాదం పెరుగుతుంది. డోర్క్‌నాబ్‌లు, కుళాయిలు, కౌంటర్‌ల వంటి ఉపరితలాలపై వైరస్ రెండు వారాల వరకు జీవించగలదు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.. 

NYT నివేదిక ప్రకారం.. ఈ వ్యాధికి సమర్థవంతమైన వ్యాక్సిన్ లేదు. కాబట్టి నివారణ ఉత్తమ ఎంపిక. సబ్బు, నీటితో తరచుగా చేతులు కడుక్కోవడం అతి ముఖ్యమైన ముందు జాగ్రత్త. ఈ వైరస్‌కు వ్యతిరేకంగా హ్యాండ్ శానిటైజర్ మాత్రమే ప్రభావవంతంగా ఉండదు. బాత్రూమ్‌లు, తరచుగా తాకిన ఉపరితలాలను బ్లీచ్ కలిపిన నీటితో శుభ్రం చేయాలి. ఎవరైనా ఇన్ఫెక్షన్ బారిన పడితే.. వారు ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి. పుష్కలంగా నీరు తాగాలి. సూప్, ఎలక్ట్రోలైట్ పానీయాలు ప్రయోజనకరంగా ఉంటాయి.