గర్భం దాల్చినప్పుడే కాదు ప్రసవం అయిన తర్వాత కూడా ఆరోగ్యంగా ఉండటం అనేది సవాలుతో కూడుకున్న పని. నవజాత శిశువు సంరక్షణతో పాటు తల్లి ఆరోగ్యం కూడా ముఖ్యమే. శరీరంలో వచ్చిన మార్పుల నుంచి బయటపడి సాధారణ స్థితికి చేరుకోవడం కోసం తగిన పోషకాహారం తీసుకోవాలి. కంటి నిండా నిద్రపోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం, యోగా లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల బరువు పెరగకుండా శరీరం కూడా ఫిట్ గా మారుతుంది. గర్భధారణ కాలం నుండి సాధారణ జీవితానికి మారడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. కొత్తగా తల్లి అయిన వాళ్ళు మళ్ళీ తమ యథారూపానికి రావాలని అనుకుంటే ఈ పోషకాలు నిండిన లడ్డూలు తినండి. అదెలా చేయాలంటే..
కావాల్సిన పదార్థాలు
నెయ్యి- 6 టేబుల్ స్పూన్లు
గోండు- 3 టేబుల్ స్పూన్లు
గసగసాలు- 2 టేబుల్ స్పూన్లు
తురిమిన ఎండు కొబ్బరి- 1 కప్పు
తరిగిన బాదం- 1 కప్పు
తరిగిన జీడిపప్పు- 1 కప్పు
వాల్ నట్స్- 1 కప్పు
పిస్తా- 4 టేబుల్ స్పూన్లు
గుమ్మడి గింజలు- 4 టేబుల్ స్పూన్లు
ఎండు ద్రాక్ష- 1 కప్పు
పొద్దుతిరుగుడు విత్తనాలు- 1 కప్పు
ఎండు అంజీరా- 6
ఖర్జూరాలు- 400 గ్రాములు
లడ్డు తయారీ విధానం
ఒక బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. అందులో గోండు వేసి ఉబ్బినంత వరకు వేయించాలి. గోండుని ఒక ప్లేట్ లోకి తీసి పొడిగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గసగసాలు ఒక నిమిషం పాటు వేడి చేసుకోవాలి. తర్వాత కొబ్బరిని కూడా వేయించుకోవాలి. గోండు పొడిలో గసగసాలు, తురిమిన కొబ్బరి వేసి కలుపుకోవాలి. మరొక బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. అందులో బాదం, జీడిపప్పు, వాల్ నట్స్, పిస్తా, గుమ్మడి గింజలు, ఎండుద్రాక్ష, పొద్దుతిరుగుడు గింజలు వేసి కాసేపు వేయించుకోవాలి. వాటిని ప్లేట్ లోకి తీసుకుని మెత్తగా నలగగొట్టాలి. ఇంకొక పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి సన్నగా తరిగిన అంజీర్, మెత్తని ఖర్జూరాలు వేసుకోవాలి. ఇవి రెండు పేస్ట్ లాగా అయ్యేవరకు వేయించాలి. ఇప్పుడు అందులో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న అన్ని పదార్థాలు కలుపుకోవాలి. కొద్దిగా నెయ్యి చేతులకు రాసుకుని ఆ మిశ్రమాన్ని లడ్డూల మాదిరిగా రోల్ చేసుకోవడమే. గాలి చొరబడని కంటైనర్ లో నిల్వ చేసుకోవచ్చు. రోజుకోకటి తిన్నా ఆరోగ్యంగా ఉంటారు.
లడ్డూ వల్ల లాభాలు
నెయ్యి: ఇది ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులను జోడించడంలో సహాయపడుతుంది. శరీరానికి మరింత పోషణ అందిస్తుంది. కీళ్లను బలపరుస్తుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. జీర్ణక్రియకి సహాయపడుతుంది.
గోండ్: దీన్ని ఎడిబుల్ గం అని కూడా పిలుస్తారు. కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు అందిస్తుంది.
గసగసాలు: శరీరాన్ని విశ్రాంతి మోడ్ లోకి తీసుకెళ్లేందుకు ఇవి సహాయపడతాయి. ఇందులో మార్ఫిన్ ఉంటుంది. ఇవి మంచి నిద్రని కలిగించదమాలో సహాయపడతాయి. ఎక్కువ పాలను ఉత్పత్తి చేయడంలో సహకరిస్తాయి.
కొబ్బరి: శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది. మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. శరీరంలోని చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
ఇక ఇందులో నట్స్, గింజలు వేయడం వల్ల పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లను అందిస్తాయి. ఖర్జూరాలు పాల ఉత్పత్తిని పెంచుతాయి. అంజీర్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.