ప్రశ్న: నా భార్య మంచిది. కుటుంబాన్ని చక్కగా నడిపిస్తుంది. నన్ను, పిల్లలని చక్కగా చూసుకుంటుంది. కానీ ఆమెలో నాకు నచ్చని విషయం కుటుంబ వ్యవహారాలను రహస్యంగా ఉంచదు. మా వ్యక్తిగత విషయాలను కూడా నా స్నేహితులు, వారి భార్యలతో పంచుకుంటుంది. ఈ విషయంపై మా మధ్య అనేక వాదనలు అవుతూనే ఉన్నాయి. అయినా ఆమె మారడం లేదు. ఎంత చెప్పినా ‘అందులో తప్పేముంది’ అని వాదిస్తుంది. ఒక్కోసారి నాకు ఆవిడ చెప్పిన విషయాల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చివరికి పడక గదిలో మేము మాట్లాడుకునే విషయాలు కూడా కొంతమంది స్నేహితులతో ఆమె షేర్ చేసుకుంటుంది. దీనివల్ల నాకు చాలా చికాకుగా, విసుగ్గా ఉంది. చివరికి ఎవరినైనా ఇంటికి పిలవాలన్నా, పార్టీలకు వెళ్లాలన్నా భయం వేస్తోంది. దీంతో బయటికి వెళ్లడమే మానేశాం. ఎవరినీ ఇంటికి ఆహ్వానించడం లేదు. ఒకవేళ పెళ్లిళ్లకు వెళ్లాల్సి వస్తే నేను ఒంటరిగానే వెళుతున్నాను. ఇది కూడా సమస్యలను పెంచుతోంది. ఏం చేయమంటారు?


జవాబు: మంచి ప్రశ్న అడిగారు. ఇది ఇప్పటి కాలంలో ఎంతో మంది భార్యలు చేస్తున్న పని. ఒకప్పుడు భార్యలు బయట వారితో మాట్లాడేవారు కాదు, మాట్లాడినా కూడా చాలా తక్కువగా మాట్లాడేవారు. అన్ని విషయాలు బయటకు షేర్ చేసుకునేవారు కాదు. ఇప్పుడు ప్రతి వ్యక్తికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యం ఎక్కువగా ఉంది. అయితే వాటిని కొంతమంది సరిగా ఉపయోగించుకోలేకపోతున్నారు. అందులో మీ భార్య కూడా ఒకరనుకోవచ్చు. ఆమె అన్ని రకాలుగా మంచిదేనన్నారు, కానీ ఈ ఒక్క విషయంలోనే మిమ్మల్ని విసిగిస్తుంది అని చెబున్నారు. మీరు ఆమెని విసిగించడం లేదా కోపం తెప్పించడం లాంటివి చేసినప్పుడే ఆమె బయట వారికి వివరాలను చేరవేస్తోందా? లేక ప్రతి విషయాన్ని బయటకు చెప్పడం ఆమెకు అలవాటయిందా? అనేది గమనించండి. భర్త భార్యతో ఎక్కువసేపు గడపనప్పుడు, ఆమె చెప్పింది ఓపికగా విననప్పుడే వారు వేరే వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడతారు. తమ బాధను, ఆనందాన్ని షేర్ చేసుకునే వ్యక్తుల కోసం వెతుకుతారు. అలా స్నేహితులు దొరకగానే తాము చెప్పాలనుకున్నమని చెప్పేస్తారు. మీ భార్య కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే అన్ని విషయాలు బయటకు చెబుతుంటే మీరు ఆమెతో గడిపే సమయం పెంచండి.  ఆమె ఏం చెప్పాలనుకుంటుందో అన్నీ వివరంగా వినండి. ఇలా చేయడం వల్ల ఆమె బయట వారితో మాట్లాడే అలవాటు తగ్గుతుంది.


ఇక అన్నింటికన్నా మీరు బాధపడుతున్న విషయం... ఆమె పడకగది విషయాలు బయటపెట్టడం. అలాంటివి ఎంత రహస్యంగా ఉంచాలో ఆమెకు వివరించండి. ఈ విషయంలో అవసరమైతే మానసిక వైద్యులు చేత కౌన్సెలింగ్ కూడా ఇప్పించండి. కొంతమంది చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నవారు ఇలా చేస్తూ ఉంటారు. ఏది మంచో, ఏది చెడో సరిగా తెలియని పరిస్థితుల్లోఇలా బయట వారితో అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా మీ లైంగిక జీవితం గురించి మాట్లాడడం ఎంత తప్పో ఆమెకు వివరించండి.


ఆమె ఒకరిద్దరితోనే ఇలా అన్ని విషయాలు చెబితే అది ఆమె గాఢమైన స్నేహం అనుకోవచ్చు. కానీ ఎక్కువ మందితో షేర్ చేస్తే మాత్రం అది ఒక సమస్యగానే చూడాలి. మీ ఇద్దరు ఏకాంతంగా గడుపుతున్నప్పుడు ఈ విషయం గురించి మెల్లగా వివరించండి. ఈమె తన స్నేహితులకు అన్ని విషయాలను చేరవేస్తోంది, కానీ వారు మాత్రం ఆమెకు ఏ విషయాలు షేర్ చేసుకోరు అన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పండి. ఈమె ముగ్గురితో చెప్తే, ఆ ముగ్గురు మరో ముగ్గురుతో, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురుతో ఇలా చెప్పడం వల్ల కుటుంబం రోడ్డున పడుతుందని వివరించండి. 


మీరిద్దరూ రొమాంటిక్ డేట్ కి వెళ్లడం, ఇద్దరు గడిపే సమయం పెంచడం చేయండి. గొడవలు పడడం తగ్గించండి. మీకు  అసౌకర్యంగా అనిపిస్తున్న విషయాలు ఆమెతో షేర్ చేయండి. అలాగే ఆమె ఏ విషయాల్లో ఇంట్లో అసౌకర్యంగా ఫీల్ అవుతుందో తెలుసుకోండి. మీకు ఆమె చాలా ముఖ్యం అనే విషయాన్ని అర్థం అయ్యేలా చేయండి. 


Also read: కంటి శుక్లాలు ఎందుకు వస్తాయి? ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువ?