Mouth Ulcers : నోటిపూత క్యాన్సర్‌కు సంకేతమట.. రెండు వారాలలోపు తగ్గకుంటే జాగ్రత్త
Oral Cancer : నోటిలో పుండ్లు, పూతలు అనేవి క్యాన్సర్‌కు హెచ్చరిక సంకేతం కావచ్చని చెప్తున్నారు నిపుణులు. రెండు వారాలలో పు నయం కాకుంటే వాటిని విస్మరించవద్దని అంటున్నారు.

Oral Ulcers : నోటిలో పుండ్లు, తెలుపు లేదా ఎరుపు రంగు మచ్చలు వంటి ఇబ్బందులు చాలామంది ఎదుర్కొంటారు. ఇది కామన్‌గా వచ్చే తేలికపాటి ఇబ్బందిగా చెప్పవచ్చు. నొప్పి తక్కువగా, చిన్నగా ఉంటుంది కాబట్టి.. వీటిని లైట్ తీసుకుంటారు. నోటి పూత రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే ఇది రెండు వారాల కంటే ఎక్కువ ఉంటే మాత్రం అస్సలు విస్మరించవద్దని చెప్తున్నారు నిపుణులు.
నోటి పూతకు కారణాలు ఇవే..
ఒత్తిడి, దంత సమస్యలు లేదా సాధారణ ఇన్ఫెక్షన్ కారణంగా నోటిలో పుండ్లు వస్తాయి. అయితే వైద్యుల అభిప్రాయం ప్రకారం.. ఈ పుండ్లు లేదా మచ్చలు రెండు వారాలలోపు నయం కాకపోతే.. అవి నోటి క్యాన్సర్ గురించి ఇచ్చే ముందస్తు హెచ్చరిక సంకేతం కావచ్చు. సరైన అవగాహన లేకపోవడం వల్ల దీనిని గుర్తించడం ఆలస్యమవుతుంది. దీనివల్ల చికిత్స ఆలస్యమవుతుంది. కాబట్టి చిన్న నోటి పుండ్లు క్యాన్సర్ హెచ్చరిక సంకేతంగా ఎలా మారతాయో చూసేద్దాం.
నోటి క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు
నోటి క్యాన్సర్ ప్రారంభ దశల్లో.. దాని లక్షణాలు తరచుగా తేలికపాటివిగా ఉంటాయి. నిజానికి నయం కాని నోటి పుండ్లు.. తెలుపు లేదా ఎరుపు మచ్చలు, తేలికపాటి నొప్పి లేదా మంట వంటి లక్షణాలను ఇస్తాయి. వీటిని తరచుగా పట్టించుకోరు. పొగాకు నమలడం, ధూమపానం, మద్యం సేవించడం వంటి అలవాట్ల వల్ల వీటి గురించి ఎక్కువగా ఆలోచించరు. అందుకే క్యాన్సర్ పెరిగి.. తీవ్ర స్థాయికి చేరుకుంటుంది.
ఎవరు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి?
వైద్యుల అభిప్రాయం ప్రకారం.. మన దేశంలో నోటి ఆరోగ్యం తరచుగా నిర్లక్ష్యం అవుతుంది. పొగాకు నమలేవారు, ధూమపానం చేసేవారు, మద్యం సేవించేవారు, పళ్లు విరిగినవారు, నోటి పరిశుభ్రత లేనివారు అప్రమత్తంగా ఉండాలి. నోటిలో పుండు లేదా మచ్చ రెండు వారాలలోపు నయం కాకపోతే.. లేదా పెరగడం ప్రారంభించినట్లయితే వెంటనే దాన్ని చెక్ చేయించుకోవాలి.
నోటిలో మచ్చలు, పుండ్లు అనేక రూపాల్లో ఉండవచ్చని వైద్యులు అంటున్నారు. సాధారణంగా ఒకటి నుంచి రెండు వారాలలోపు నయం అయ్యే చిన్న, బాధాకరమైన బొబ్బలు ఉంటాయి. నోరు, చిగుళ్ళు లేదా నాలుకపై రుద్దిన తర్వాత తగ్గని తెల్లటి మచ్చలు మరో రకం. తెల్లటి, మెష్ లాంటి మచ్చలు లేదా చికాకు కలిగించే పుండ్లు, రక్తస్రావం అయ్యే ఎర్రటి మచ్చలు మరింత ప్రమాదకరమైనవిగా చెప్తారు.
ఎప్పుడు ప్రమాదకరమంటే..
నోటి పూతలు.. గాయం, ఒత్తిడి, విటమిన్ లోపాలు లేదా ఇన్ఫెక్షన్ల వల్ల సంభవిస్తాయి. సాధారణ చికిత్సతో తగ్గుతాయి. కొన్ని సందర్భాల్లో, అవి తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం కావచ్చు. రెండు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగే పూతలు నోటి క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. చాలా సందర్భాలలో ల్యూకోప్లాకియా, ఎరిథ్రోప్లాకియాలను ముందస్తు క్యాన్సర్‌గా కూడా పరిగణిస్తారు. కొన్ని గాయాలు మధుమేహం, HIV లేదా ఆటో ఇమ్యూన్ వ్యాధులతో కూడా సంబంధం కలిగి ఉండవచ్చు.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే..
నోటి పూతల లేదా మచ్చలు మళ్లీ మళ్లీ వస్తుంటే.. బాధాకరంగా, ఎక్కువ కాలం కొనసాగితే.. వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. ముఖ్యంగా పుండ్లు రెండు వారాల కంటే ఎక్కువ కాలం నయం కాకపోతే.. నోటిలో ముద్ద, రక్తం లేదా నిరంతర నొప్పి, మింగడంలో, నమలడంలో లేదా మాట్లాడడంలో ఇబ్బంది ఉంటే, మెడలోని శోషరస గ్రంథులు వాచిపోతే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.























