Rainy Season Mobile Safety : వర్షాలు వస్తున్నప్పుడు మనం తడవడం ఎలా ఉన్నా.. మన మొబైల్ తడవకూడదని అనుకుంటాము. ఎందుకంటే వర్షంలో తడిస్తే స్మార్ట్‌ఫోన్‌కు నష్టం వాటిల్లే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆఫీసుకు లేదా బయటకు వెళ్లినప్పుడు వాతావరణం బాగానే ఉన్నా.. అకస్మాత్తుగా వర్షం వస్తే కష్టంగా ఉంటుంది. ఆ సమయంలో మొబైల్ ఉపయోగించడం, దానిని జాగ్రత్త చేయడం రెండూ కష్టమే అవుతాయి. కాబట్టి అలాంటి పరిస్థితిల్లో ఫోన్‌ను సురక్షితంగా ఎలా ఉంచుకోవాలో.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫోన్‌ని కాపాడుకునేందుకు కొన్ని సులభమైన చిట్కాలు, సింపుల్ హ్యాక్స్ ఇక్కడున్నాయి.
వాటర్‌ప్రూఫ్ పర్సు లేదా జిప్‌లాక్ బ్యాగ్
నాణ్యత కలిగిన వాటర్‌ప్రూఫ్ మొబైల్ కవర్ లేదా జిప్‌లాక్ బ్యాగ్‌ను కొనండి. దానిని మీతోనే ఉంచుకోండి. మీరు వెళ్లేప్పుడు బ్యాగ్‌లోనో.. లేదా బైక్‌లోనే దానిని పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీరు వర్షంలో బయటకు వెళ్లినా.. లేదా ఆకస్మికంగా వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫోన్‌ను ఈజీగా, సేఫ్‌గా తీసుకెళ్లిపోవచ్చు.
స్ట్రాంగ్ వాటర్ ప్రూఫ్ కేస్
మీరు బైక్ లేదా స్కూటర్‌లో ప్రయాణిస్తుంటే.. IP68 రేటింగ్ లేదా మిలిటరీ-గ్రేడ్ రక్షణను అందించే మొబైల్ కేస్‌ను ఉపయోగించండి. ఇది నీరు, షార్ట్ సర్క్యూట్ నుంచి ఫోన్‌ను రక్షిస్తుంది.
తడి చేతులతో ఫోన్‌ను చార్జ్ చేయవద్దు
వర్షంలో మీరు తడవడం, లేదా మీ ఫోన్ కూడా తడిచి ఉన్నప్పుడు దానికి ఛార్జింగ్ పెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే నీరు, విద్యుత్ కలయిక ప్రాణాంతకానికి దారి తీస్తాయి. కాబట్టి మీ చేతులు లేదా ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ తడిగా ఉంటే.. దాన్ని ఛార్జ్ చేయకపోవడమే మంచిది. ఏంపర్లేదు అని చార్జింగ్ పెట్టేస్తే ఫోన్‌లో షార్ట్ సర్క్యూట్ కావచ్చు లేదా మీకు షాక్ తగిలే అవకాశం కూడా ఉంది.
బ్యాటరీ సేవర్ మోడ్
వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీని వలన ఫోన్ బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీ పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో.. బ్యాటరీ త్వరగా అయిపోవచ్చు. మీరు బయట ఉంటే.. చార్జింగ్ పాయింట్ లేకుంటే పరిస్థితి ఇబ్బందికరంగా మారవచ్చు కాబట్టి.. బ్యాటరీ సేవర్ మోడ్‌ను ఆన్ చేయండి. ఇది చార్జింగ్ ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది.
ఫోన్ తడిస్తే..
వర్షంలో మీ ఫోన్‌ను జాగ్రత్త చేయలేని పరిస్థితుల్లో అది తడిచిపోతే.. వెంటనే స్విచ్ ఆఫ్ చేసేయాలి. దానిని ఆరబెట్టడానికి హెయిర్ డ్రైయర్ ఉపయోగించడం లాంటివి చేయవద్దు. దానిని బియ్యంలో ఉంచడం లేదా సిలికా జెల్ ప్యాకెట్లో 24 గంటల నుంచి 48 గంటల వరకు ఉంచాలి.
డేటా బ్యాకప్
వర్షాకాలంలో ఫోన్ పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన ఫైల్‌లు, కాంటాక్ట్‌లు, ఫోటోలు, WhatsApp చాట్‌లను Google Drive లేదా iCloudలో సేవ్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ల్యాప్‌టాప్‌కు డేటాను బదిలీ చేసుకోవడం మంచిది.
ఇంటి చిట్కాలు
ఫోన్ కవర్‌లో సిలికా జెల్ లేదా బ్లోటింగ్ పేపర్‌ను ఉంచండి. దీనివల్ల లోపల పేరుకుపోయిన తేమను ఇవి పీల్చుకుంటాయి. ఇలా చేయడం వల్ల ఫోన్‌ను లోపలి నుంచి పొడిగా ఉంచుకోవచ్చు.
ఛార్జింగ్ పోర్ట్ శుభ్రత
తేమ, ధూళి ఎక్కువైతే.. USB-C లేదా లైట్నింగ్ పోర్ట్‌లో అవి పేరుకుపోతాయి. దీని వలన ఛార్జింగ్ సమస్యలు వస్తాయి. కాబట్టి కొన్ని రోజులకోసారి పోర్ట్‌ను మృదువైన బ్రష్ లేదా బ్లోయర్‌తో శుభ్రం చేయండి.
నేరుగా కాల్స్ చేయకండి
మీ ఫోన్ వాటర్-రెసిస్టెంట్ అయినప్పటికీ.. వర్షంలో నేరుగా చెవికి ఫోన్ పెట్టి మాట్లాడటం ప్రమాదకరం కావచ్చు. మీరు వైర్డు ఇయర్‌ఫోన్‌లు లేదా బ్లూటూత్ పరికరాన్ని ఉపయోగించడం మంచిది.
ఫోన్ వేడెక్కితే..
వర్షాకాలంలో తేమ ఫోన్‌ను వేడిగా చేస్తుంది. ఛార్జింగ్ సమయంలో ఫోన్ మరీ ఎక్కువగా వేడిగా అనిపిస్తే.. వెంటనే ఛార్జింగ్ ఆపాలని గుర్తించుకోవాలి.