ప్రపంచంలో వింత మనుషులకు కొదవ లేదు. ఎక్కడో ఒక చోట, ఏదో ఒక అద్భుతం చేస్తూ కనిపిస్తారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు మిచెల్ లోటిటో. ఈయన జీవితం అత్యంత అసాధారణంగా ఉంటుంది. వినడానికి ఆశ్చర్యం అనిపించే ఎన్నో పనులు ఆయన చేసి చూపించారు. 1950లో ఫ్రాన్స్‌లోని గ్రెనోబుల్‌లో జన్మించిన లోటిటో.. తొమ్మిదేళ్ల వయస్సు నుంచే ఆయన చేసే పనులతో ప్రత్యేక వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జీర్ణించుకోలేని గాజు, ఇనుము వంటి ప్రమాదకరమైన వస్తువులను తినడం మొదలు పెట్టారు.  


నీళ్ల గ్లాసు అతడి జీవితాన్ని మలుపు తిప్పింది!


ఒకానొక సమయంలో లోటిలో గ్లాసులో నీళ్లు తాగుతుండగా, కిందపడి పగిలిపోతుంది. పగిలిన గాజు ముక్కలను తీసి నమలడం మొదలు పెట్టారు. వెంటనే ఆయన తల్లిదండ్రులు అతడిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు ఆయనను అత్యంత అరుదైన వ్యక్తిగా గుర్తించారు. ఆయన దేహం పికా అనే ప్రత్యేక వ్యవస్థతో నిర్మితం అయ్యిందని వెల్లడించారు. మందపాటి కడుపు లైనింగ్, ప్రేగులలో అసాధార నిర్మాణం, ప్రత్యేక  జీర్ణ వ్యవస్థను కలిగి ఉన్నాడని ప్రకటించారు. ఫలితంగా గాజు ముక్కలు, ఇనుప వస్తువులు తిన్నా తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు.


విమానం మొత్తాన్ని తినేశాడు!


చిన్నప్పటి నుంచి మెటల్ సహా పలు వస్తువులను తిన్న ఆయన  వయసు పెరుగుతున్న కొద్ది పెద్ద పెద్ద వస్తువులను తినడం మొదలు పెట్టారు. ప్రతి రోజూ సుమారు రెండు పౌండ్ల లోహపు వస్తువులను కడుపులో వేయడం చేశారు.మొత్తంగా అతడి జీవితంలో సుమారు 18 సైకిళ్లు, 7 టీవీ సెట్లు, 2 బెడ్లు, 15 సూపర్ మార్కెట్ ట్రాలీలు, ఒక కంప్యూటర్, ఒక శవపేటిక,6  షాన్డిలియర్లు తిన్నారు. అతడి జీవితంలో అత్యంత కీలక ఘట్టం మొత్తం డాంగ్ విమానాన్ని తినడం.  1978లో ఈ విమానాన్ని తినడం ప్రారంభించిన ఆయన రెండు సంవత్సరాల పాటు ఈ ప్రక్రియ కొనసాగించారు. 1980లో ముక్క లేకుండా విమానాన్ని తినడం పూర్తి చేశారు.


Also Read: ఒంటిని విల్లులా వంచి ప్రపంచ రికార్డు సాధించిన 14 ఏండ్ల అమ్మాయి!


అరటి పండు తినలేకపోయేవాడు!


వాస్తవానికి పికా లక్షణాలను కలిగి ఉన్న వ్యక్తులు తినే వస్తువులు అత్యంత విషపూరితంగా ఉన్నా వారికి ఎలాంటి ఇబ్బంది కలగదు. సీసం కలిగి ఉన్న వస్తువులు సైతం హాని కలిగించవు. లోటిటో విష పదార్థాలను సైం సమర్థవంతంగా  ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని కలిగి ఉన్నారు. అసాధారణంగా అతడి కడుపులో శక్తివంతమైన ఆమ్లాలు ఉండేవి. అవి ఎంతటి వస్తువునైనా ఇట్టే జీర్ణం అయ్యేలా చేసేవి. గమ్మత్తైన విషయం ఏంటంటే? కఠినమైన వస్తువులను తినే  లోటిటో.. అత్యంత మృదువైన ఆహారాన్ని తినడంలో చాలా ఇబ్బంది పడేవారు. అరిపండ్లను కూడా సరిగా తినలేకపోయేవాడు.     


2007లో లోటిటో కన్నుమూత


లోటిటో 2007లో కన్నుమూశారు. ఆయన చనిపోయే నాటికి 57 సంవత్సరాలు.  వయస్సులో సహజ కారణాలతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన చనిపోయినా, తను చేసిన పనులు మాత్రం ఓ అద్భుత వ్యక్తిగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. విమానాన్ని తిన్న వ్యక్తిని ప్రపంచం ఆయనను ఎప్పటికీ మరచిపోదు.  తాజాగా ఈయన గురించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్  'క్యూరియస్ కేస్‌బుక్' అనే పేరుతో సరికొత్త స్నాప్‌ చాట్ షోను రూపొందించింది.  తొలి ఎపిసోడ్ ను ‘ది క్యూరియస్ కేస్ ఆఫ్ మాన్సీయర్ మాంగెట్‌ అవుట్’ పేరుతో రిలీజ్ చేసింది.


Also Read: ప్లాస్టిక్ కాలుష్య నిర్మూలనలో కీలక ముందడుగు.. అత్యంత వేగంగా ప్లాస్టిక్‌ను విచ్ఛిన్నం చేసే పురుగుల గుర్తింపు!