Love Marriage Ban : వాలెంటైన్స్ డే వేళ షాకింగ్ నిర్ణయం.. ఆ గ్రామంలో లవ్ మ్యారేజ్‌పై పూర్తి నిషేధం, ఎందుకంటే
Love Marriage Not Allowed : ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేది చాలామందికి డ్రీమ్. కానీ అలా లవ్ మ్యారేజ్ చేసుకుంటే గ్రామ బహిష్కరణ చేస్తామంటోంది ఓ గ్రామం. అది ఎక్కడో తెలుసా?

Love Marriage Banned : వాలెంటైన్స్ డే సమయంలో చాలామంది లవర్స్ తమ మ్యారేజ్ లైఫ్ గురించి కలలు కంటారు. ఇంట్లో వాళ్లని ఒప్పించి వివాహం చేసుకోవాలనుకుంటారు. కానీ ఓ గ్రామంలో పేరెంట్స్ ఒప్పుకున్నా.. గ్రామం ఒప్పుకోదట. ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారా.. వాళ్లు అమ్మాయి అయినా, అబ్బాయి అయినా బయటకు గెంటెస్తారు. దానితో పాటు కొన్ని సౌకర్యాలపై నిషేధం కూడా విధిస్తారు. ఇంతకీ అక్కడ ప్రేమ పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? ఎలాంటి నిషేధాలు ఉంటాయి? ఆ గ్రామం ఎక్కడుంటుందో చూసేద్దాం.
అమృత్‌సర్‌లోని అజ్నాలా తహసీల్‌లోని ధరివాల్‌లోని ఒక పంచాయతీ ప్రేమ వివాహాలను పూర్తిగా నిషేధించింది. ఈ విషయంలో పంచాయతీ పెద్దలు కలిసి ఒక తీర్మానాన్ని ఆమోదించారు. గ్రామంలోని ఏ అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు వివాహం చేసుకున్నా.. వారిని గ్రామం నుంచి వెళ్లగొట్టాలని ప్రజలు అందరూ కలిసి.. సమ్మతితో నిర్ణయించారు.
ఎదురించి పెళ్లి చేసుకుంటే..
గ్రామ పెద్ద మాట కాదని ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకుంటే.. అమ్మాయి లేదా అబ్బాయిని గ్రామం నుంచి బహిష్కరిస్తారు. అంతేకాకుండా అబ్బాయి, అమ్మాయి కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరిస్తారు. వివాహం చేసుకున్న వారికి పంచాయతీ, ప్రభుత్వ సౌకర్యాలు రద్దు చేస్తారు. వారికి సంబంధించిన ఎలాంటి సర్టిఫికెట్ లేదా ఇతర పత్రాలకు సంతకం చేయరు. వారికి సంబంధించి ఏదైనా సమస్య తలెత్తితే.. గ్రామంలోని ఏ వ్యక్తి కూడా పోలీస్ స్టేషన్ లేదా కోర్టులో సాక్ష్యం ఇవ్వరు.
నిర్ణయం తీసుకోవడానికి ఇదే రీజన్
ఇటీవల ఒకే గ్రామానికి చెందిన 5 నుంచి 6 వివాహాలు జరిగినప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంచాయతీ పెద్దలు తెలిపారు. ఎందుకంటే ఒకే గ్రామంలో పెళ్లి చేసుకుంటే.. అత్తమామలు ఒకే వీధిలో లేదా కొన్నిసార్లు ముఖాముఖిగా ఉంటున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి తమ కూతురా లేక కోడలా అనేది గ్రామస్తులకు అర్థం కావడం లేదట. దీనివల్ల సంబంధాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, కుటుంబాలలో వివాదాలు పెరిగాయని తెలిపారు. అందువల్ల గ్రామంలో ఏ విధంగానైనా (ప్రేమ, పెద్దలు కుదిర్చిన)వివాహాలను పంచాయతీ నిషేధించింది. ఫిబ్రవరి 7న పంచాయతీ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రేమ వివాహంపై పూర్తి నిషేధం
గ్రామంలోని ఏ అబ్బాయి కూడా అదే గ్రామానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకోకూడదని ప్రజా సమ్మతితో పంచాయతీ తీర్మానాన్ని ఆమోదించారు. ఒకే గ్రామంలో వివాహం సామాజిక నిబంధనలు, సంప్రదాయాలకు విరుద్ధమని పంచాయతీ విశ్వసిస్తుంది. ఈ తప్పుడు ఆచారాన్ని ఆపడానికి ఈ కఠినమైన చర్య తీసుకున్నారట.
సామాజిక బహిష్కరణ
ఈ నియమాన్ని ఉల్లంఘించి గ్రామంలో వివాహం చేసుకున్న జంటలను పూర్తిగా సామాజికంగా బహిష్కరిస్తారు. పంచాయతీ నిర్ణయం ప్రకారం.. అటువంటి జంటలు గ్రామంలో నివసించడానికి అనుమతించరు. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామం వదిలి వెళ్లిపోవాల్సిందే. వారి తల్లిదండ్రులతో కూడా ఎటువంటి సంబంధం ఉండకూడదు.
ఎవరైనా వారికి సహాయం చేస్తే..
ఈ నిషేధం వివాహిత జంటలకు మాత్రమే పరిమితం కాదు. గ్రామంలోని ఏ వ్యక్తి అయినా అలాంటి జంటలతో సహవాసం చేసినా లేదా వారికి ఏ విధంగానైనా సహాయం చేసినా వారిని సామాజికంగా బహిష్కరిస్తామని ప్రతిపాదన స్పష్టం చేస్తుంది. పంజాబ్‌లోని అనేక గ్రామాల్లో ఇంతకు ముందు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. కులాంతర వివాహాలు నిషేధించారు. కాబట్టి వారికి ఇదేమి కొత్త కాదు అంటున్నారు.
























